iDreamPost

తొందరపడ్డ నిమ్మగడ్డ..కోర్టు మెట్లెక్కిన రాష్ట్ర ప్రభుత్వం

తొందరపడ్డ నిమ్మగడ్డ..కోర్టు మెట్లెక్కిన రాష్ట్ర ప్రభుత్వం

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ షెడ్యూల్‌ను జారీ చేస్తూ ప్రొసీడింగ్స్, ఎన్నికల నియమావళి విధింపు, బదిలీలపై నిషేధం విధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆది నుంచి నిమ్మగడ్డ వ్యవహరించిన తీరును ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తామని ఏకపక్షంగా నవంబర్‌ 17వ తేదీన నిర్ణయం తీసుకోవడం, దానిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ఎస్‌ఈసీతో సంప్రదింపులు జరపమని ఆదేశించిన క్రమంలో జరిగిన పరిణామాలను పిటిషన్‌లో పేర్కొంది.

తొందరపడిన నిమ్మగడ్డ..

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలను పరిశీలిస్తే.. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొందరపడినట్లుగా తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా వెలువడిన తర్వాత మూడు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు వెళ్లి ఎస్‌ఈసీతో సంప్రదింపులు జరపాల్సి ఉంది. గత నెల 29వ తేదీన కోర్టు ఈ విషయం చెప్పగా.. జనవరి ఐదవ తేదీన ఆ ఉత్తర్వులు రాత పూర్వకంగా వెలువడ్డాయి. అయితే కోర్టు ఆదేశాలు రాతపూర్వకంగా వెలువడక ముందే సంప్రదింపుల కోసం సీఎస్, పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శికి లేఖలు పంపండం నిమ్మగడ్డ తొందరను తెలిజేస్తోంది.

మొట్టికాయలు తప్పవా…

కోర్టు తీర్పు ప్రతి ఈ నెల 5వ తేదీన అందగా.. 7వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణపై తన వైఖరిని రాతపూర్వకంగా ఎస్‌ఈసీకి తెలియజేసింది. 8వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు అధికారులు వెళ్లి వివరించారు. ఎన్నికలు ఎందుకు నిర్వహించాలో నిమ్మగడ్డ, ఎందుకు సాధ్యం కాదో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే తమ తమ వైఖరులను వెల్లడించాయి. ఇరు పక్షాలు గతంలో చేసిన వాదనలే ఇప్పుడు కూడా
వినిపించాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏమి చెప్పిందో ఎస్‌ఈసీ హైకోర్టుకు తెలియజేకుండానే.. అధికారుల భేటీ అయిన గంటల వ్యవధిలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేయడం ఇక్కడ గమనించాల్సిన అంశం. కోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఈసీ వద్దకు వెళ్లింది. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించగా.. నిమ్మగడ్డ మాత్రం సంప్రదింపుల సారాంశం కోర్టుకు తెలియజేయకుండానే ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోవడం కోర్టును అగౌరవపరచడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఎలాంటి వాదనలు జరగబోతున్నాయి..? హైకోర్టు నిమ్మగడ్డ చర్యలపై ఏ విధంగా స్పందించబోతోంది..? అనే అంశాలు ఆసక్తిని రేపుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి