iDreamPost

వాలంటీర్స్ కి తీపి కబురు

వాలంటీర్స్ కి తీపి కబురు

వైసీపీ అధినేత జగన్ మానస పుత్రిక అయిన వలంటీర్ వ్యవస్థలోని గ్రామ , వార్డ్ వలంటీర్ల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. జగన్ అధికారం చేపట్టాక ప్రభుత్వం అందించే పౌర సేవలు వారి ఇంటి వద్దనే అందించేందుకు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 500 విధాల సర్వీసులు నేరుగా ఆయా కుటుంబాల చెంతకు చేర్చడంలో విజయవంతమైన వలంటీర్ వ్యవస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది అని చెప్పొచ్చు .

పాలనా సౌలభ్యంలో భాగంగా ప్రజలకు జారీ చేసే పలు రకాల గుర్తింపు కార్డుల దరఖాస్తు ప్రక్రియ పౌరుల ఇంటి వద్దే చేయడంతో పాటు , సామాజిక పెన్షన్లు , అర్హులకు పలు సంక్షేమ పథకాల వర్తింపు లాంటి వాటికి ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ఇళ్ల వద్దే అందించటంతో పాటు ప్రభుత్వ పరంగా నిర్వహించిన పలు రకాల సర్వేలలో క్రియాశీలక పాత్ర పోషించారు .

ఇవన్నీ ఒక ఎత్తు అయితే కోవిడ్ 19 విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించిన తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్స్ గా వీరు అందించిన సేవలు వెల కట్టలేనివి . ఒక్కో వాలంటీర్ పరిధి లోని 50 కుటుంబాలలో ఎవరైనా బయటి దేశాల నుండి, రాష్ట్రాల నుండి వచ్చిన వారిని, వైరస్ అనుమానితులను గుర్తించి వారికి టెస్ట్స్ చేయించి క్వారంటయిన్ కి పంపడం నుండి, వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇంటింటికి ప్రచారం చేసి కోవిడ్ పట్ల అవగాహన కల్పించడంతో పాటు, రెడ్ జోన్స్ లోని వారికి ఇంట్లో నుండి బయటికి వచ్చే పని లేకుండా పాలు కూరగాయల లాంటి నిత్యావసరాలను , నెలవారీ సరుకులను ఇంటి వద్దకే చేర్చి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తరపున ఆపద్భాందవ పాత్ర పోషించారు . కోవిడ్ 19 పై పోరులో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండటంలో వాలంటీర్స్ భాగస్వామ్యం చెప్పుకోతగ్గది .

లాక్ డౌన్ సమయంలో వీరు అందించిన సేవలు దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కాక కొన్ని విదేశాల నుండి కూడా ప్రశంసలు దక్కడంతో పాటు కొన్ని రాష్ట్రాలు , విదేశాలు ఇదే బాటలో వలంటీర్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకొనే బాటలో పయనిస్తున్నాయి . ఇటీవల దేశ ప్రధాని మోడీ ముఖ్యమంత్రుల కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ జగన్ ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ యొక్క పనితీరు అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రిని ప్రశంసించడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ తరహా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు.

ఇదే పనితీరుని కొనసాగిస్తూ రాష్ట్ర ప్రజలకు మరింత మెరుగ్గా సేవలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 50 కుటుంబాలకు ఒకరు చొప్పున నియమించిన 2.8 లక్షల మంది వాలంటీర్స్ సేవలను 2021 ఆగస్ట్ పదిహేను వరకూ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి