iDreamPost

తమిళనాడులో కలకలం రేపుతున్న ఎపి CM జగన్, హీరో విజయ్ ల మార్ఫింగ్ పోస్టర్లు

తమిళనాడులో కలకలం రేపుతున్న ఎపి CM జగన్, హీరో విజయ్ ల మార్ఫింగ్ పోస్టర్లు

ఎపి ముఖ్యమంత్రి జగన్, హీరో విజయ్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలసి మాట్లాడుకుంటున్న విధంగా ఏర్పాటు చేసిన మార్ఫింగ్ ఫోస్టర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. హీరో విజయ్ కి గట్టి పట్టున్న మధురై ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్లు నగరంలో హాట్ టాపిక్ గా మారాయి. “ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకున్నారు.. ఇక తమిళనాడుని మీరే కాపాడుకోవాలి..” అనే అర్ధంతో తమిళంలో ముద్రించిన ఈ పోస్టర్ల పై ఇప్పుడు మధురై ప్రాంతంలో తీవ్ర చర్చ జరుగుతుంది.

హీరో విజయ్ అభిమానులే తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటూ ఈ పోస్టర్ లని ఏర్పాటుచేసినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో మొదటినుండి బిజెపికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న హీరో విజయ్ పై గతవారం పెద్ద ఎత్తున ఐటి దాడులు జరగడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఈ పోస్టర్ లు ఏర్పాటు చేశారు.

వెనుకబడిన వర్గానికి చెందిన హీరో విజయ్ కి తమిళనాడు వ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. దాని కారణంగానే అయన తీసిన సినిమాలకు ఏవరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం భారీ స్థాయిలో వసూలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా రజనీకాంత్ విషయంలో ఒకలాగా తమ అభిమాన నటుడు విజయ్ విషయంలో మాత్రం మరోరకంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందని హీరో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో వున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కుట్రపూరితంగా విజయ్ ని అణచివేసే కుట్ర చేస్తుందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ కచ్చితంగా రాజకీయాల్లోకి రావాల్సిందేనని, ఆయన వచ్చి తమిళనాడుకి కాపాడాలని కోరుతూ అభిమానులు ఎపి ముఖ్యమంత్రి జగన్, హీరో విజయ్, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలసి మాట్లాతున్నట్టు మార్ఫింగ్ పోస్టర్లు ఏర్పాటు చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయంలో ప్రశాంత్ కిషోర్ కీలకంగా వ్యవహరించడంతో, అదేతరహాలో తమిళనాడులో కూడా విజయ్ ప్రశాంత్ కిషోర్ తో కలసి రంగంలోకి దిగాలని, వారికి మేము పూర్తిగా అండగా ఉంటామని ఆ పోస్టర్ల తాలూకు ఉద్దేశంగా కనపడుతుంది. ఈ పోస్టర్లు ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో పెద్దఎత్తున హల్ చల్ చేస్తున్నాయి. తమిళ సినిమా ఇండస్ట్రీ కూడా ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తుంది. మరి ఈ మార్ఫింగ్ పోస్టర్లపై హీరో విజయ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి