iDreamPost

ప్రధానితో ముగిసిన జగన్ భేటీ

ప్రధానితో ముగిసిన జగన్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఎపి సియం జగన్ భేటీ ముగిసింది. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా విభజన హామీలు, పోలవరానికి రావాల్సిన నిధులు, రాజధాని వికేంధ్రీకరణపై వీరిరువురి మధ్య గంటన్నరకు పైగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. భారీగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక లోటు పూడ్చడానికి నిధులు కోరినట్టుగా సమాచారం. గత కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించని విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది.

ముందుగా పార్టీకి సంబందించిన ఎంపీలతో సమావేశమైన జగన్ సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలో వారిని వెంటబెట్టుకొని ప్రధాని నివాసానికి చేరుకొని ప్రధానిని కలసిన అనంతరం, వీరిరువురి మధ్య గంటకి పైగా ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ భేటీలో విభజన హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక నిధులు, రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు సహకారం, అధికార వికేంధ్రీకరణ, మూడు రాజధానులు ఏర్పాటు, శాసనమండలి రద్దు అంశంతో పాటు రాష్ట్రానికి సంబందించిన పాలనాపరమైన అంశాలన్నింటినీ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. సమావేశం ముగిసిన అనంతరం పార్టీ ఎంపీలతో కలసి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నివాసం నుండి ఎపి భవన్ కి వెళ్లిపోయారు.

ప్రధాని తో భేటీ ముగిసిన అనంతరం జగన్ మోహన్ రెడ్డి హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా కోరినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈరోజు రాత్రికి కానీ, రేపు ఉదయం కానీ జగన్ అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశం వుంది. మాములుగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు సాయంత్రానికే జగన్ మోహన్ రెడ్డి అమరావతి చేరుకోవాల్సి ఉంది. ప్రధానితో భేటీ అనంతరం విలేకరులు జగన్ తో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ప్రధాని నివాసం హై సెక్యూరిటీ రీజియన్ కావడం, ట్రాఫిక్ కి ఇబ్బందిగా ఉండడంతో ఈ అంశాలమీద అధికారికంగా పార్టీ ఎంపీలు తెలియచేస్తారని విలేకరులకు తెలిపిన జగన్ మోహన్ రెడ్డి అక్కడ నుండి బయటకి వెళ్లారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి