iDreamPost

అగ్రవర్ణ పేదలకు గుడ్‌ న్యూస్‌.. సరికొత్త పథకానికి జగన్‌ సర్కార్‌ శ్రీకారం..

అగ్రవర్ణ పేదలకు గుడ్‌ న్యూస్‌.. సరికొత్త పథకానికి జగన్‌ సర్కార్‌ శ్రీకారం..

పూర్వం రాజుల తమ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు వేగులను పెట్టుకునేవారు. వారి నుంచి వచ్చే సమాచారంపైనే ఆధారపడకుండా మారువేషంలో ప్రజల్లోకి వెళ్లి విచారించేవారు. ప్రజల అభిప్రాయాలు, అభీష్టాలకు అనుగుణంగా పాలన సాగించేవారు. ఈ తరహాలనే ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పాలన సాగిస్తున్నారు. తాజాగా మంత్రివర్గ సమావేశంలో ఈబీసీ నేస్తం అనే సరికొత్త పథకానికి ఆమోదముద్ర పడింది. ఇది అగ్రవర్ణ పేదలకు సంబంధించిన పథకం. ఎన్నికల సమయంలో చెప్పకపోయినా.. ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌అమలు చేసేందుకు సిద్ధమయ్యారు.

కులం ఏదైనా.. అందులో ధనికులున్నారు. పేదలూ ఉన్నారంటారు. పేదలకు అండగా ఉండేందుకు, వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు జగన్‌ సర్కార్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌ చేయూత అనే పథకాన్ని అమలు చేస్తోంది. 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళలు కుటుంబం, పిల్లలు, పని వల్ల 60 ఏళ్లలోపే నిస్సత్తువులవుతున్నారని, వారికి అండగా ఉండేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఈ పథకం ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 4 ఏళ్లలో ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 75 వేల రూపాయలు ఆయా సామాజిక వర్గాల మహిళలకు అందిస్తున్నారు. అదే తరహాలనే కాపు సామాజిక వర్గంలోని 45– 60 ఏళ్లలోపు ఉన్న పేద మహిళలకు కూడా 75 వేల రూపాయలు అందిస్తున్నారు. వీరికి ఏడాదికి 15 వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు.

ఈ రెండు పథకాలు అమలు వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల్లోని కాపులకు మేలు జరిగింది. మిగతా అగ్రవర్ణాలైన రెడ్డి, కమ్మ, క్షత్రియ, వైశ్య, బ్రహ్మాణ సామాజికవర్గాలోని పేదలకు ప్రభుత్వం అండగా ఉండాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం పథకాలు అమలు జరుగుతున్న సమయంలో ప్రజల మధ్య ఈ చర్చ జరిగింది. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న జగన్‌ సర్కార్‌ వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం తరహాలోనే అగ్రవర్ణ పేదలకు ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం చేయబోతోంది. ఈ పథకం కింద అర్హులైన 45–60 ఏళ్ల మధ్య ఉన్న అగ్రవర్ణకుటుంబాల్లోని మహిళలకు 45 వేల రూపాయలు మూడేళ్లలో అందించనున్నారు. అగ్రవర్ణాల్లో రేషన్‌కార్డు ఉన్న వారందరూ ఈబీసీ (ఎకనమికల్లీ బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌) కిందకు వస్తారు. ఈ పథకం కింద ప్రభుత్వం 670 కోట్ల రూపాయలను కేటాయించింది. వలంటీర్ల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించి పథకం అమలు చేయనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి