iDreamPost

అమరావతి అయోమయ స్థితి . కింకర్తవ్యం ?

అమరావతి అయోమయ స్థితి . కింకర్తవ్యం ?

అద్భుత రాజధాని నిర్మిస్తానని , ప్రపంచంలోని ఉత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా నిలుపుతానన్న బాబు ఐదేళ్లలో ఆ దిశగా ఎం చేసాడు , ఎంత వరకు సఫలమయ్యాడు అంటే ఇదిమిద్దంగా చెప్పటం కష్టం .

విభజన ఉద్యమ సమయంలో హైదరాబాద్ ప్రస్తావన వచ్చినప్పుడు తెలంగాణా ఇచ్చేయండి, నాలుగైదు లక్షల కోట్లు ఇస్తే అంతకు మించిన నగరాన్ని కడతానన్న బాబు ఎన్నికల ప్రచారంలో సైతం ఐదు లక్షల కోట్లతో అద్భుత నగరాన్ని అందిస్తా అని హామీ ఇచ్చాడు . జనమూ కొంత భ్రమలకు లోనయ్యారని చెప్పొచ్చు .

అధికారాన్ని చేపట్టిన బాబు వెంటనే రాజధాని స్థలం ఎంపికను ప్రకటించలేదు . ఓ వైపు కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ పర్యటన జరిపి కొన్ని ప్రాంతాలు సూచించగా వాటిని కాదని ఏ రంగం లోనూ నిష్ణాతులు కాని తన పార్టీ బడా నాయకులు , వ్యాపారవేత్తలతో ఓ కమిటీ వేశారు . రైతు రుణమాఫీ కమిటీ కోటయ్య లాగానే ఈ కమిటీ కూడా పార్టీ అనుకూల ఉద్దేశ్యంతో పని చేసింది అనేది నిర్వివాదాంశం . అలా ఎన్నికయ్యిన ప్రాంతమే అమరావతి .

ఎంచుకున్న ప్రాంతంలో నోటిఫికేషన్ ద్వారా భూమి సేకరించకుండా భూమిఇచ్చిన రైతులకు పరిహారంగా డబ్బు కానీ భూమికన్నీ ఇవ్వకుండా భూసమీకరణ పద్దతిలో భూమి ఇస్తే డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తా అనడం ద్వారా రైతుల్ని కూడా ఈ రొంపిలోకి లాగాడు బాబు .

దాంట్లో ఉన్న లోపాలు , జరిగిన తప్పులు, మోసాలు మళ్లీ చెప్పుకొంటే చాంతాడంత కానీ అవన్నీ అప్రస్తుతం . రెండేళ్లలో రోడ్స్ , డ్రైనేజ్ లాంటి వాటితో ప్లాట్స్ డెవలప్ చేసి ఇస్తానన్న హామీ నేటికీ నెరవేరలేదు . ప్లాట్స్ రిజిస్టర్ అయ్యాయి కానీ లొకేషన్స్ ఎక్కడో భేతాళ ప్రశ్న . వాటికి డ్రైనేజ్ దేవుడెరుగు దారి దేవుడు కూడా ఎరగడు .

సమీకరణకు ఇవ్వనోడికి రాజధాని పోయినా సాగు యోగ్యమైన భూమి అన్నా మిగిలింది . ఇచ్చినోడి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యింది . రాజధానిలో కట్టిన శాశ్వత నిర్మాణాలు లేకపోయినా సమీకరణకు భూములిచ్చిన రైతులు వ్యవసాయం చేసుకొంటున్నారని ఆపటానికి హద్దులు చెరిపేస్తూ భూమి మొత్తాన్ని ఏకచదరంగా చదును చేసిన దుర్మార్గం వారి పాలిట మరో శాపం .

Insider Treading లేదా రియల్ ఎస్టేట్ కోసం భూములు కొనుక్కున్న వారినీ పక్కన పెడితే తమ ప్రాంతంలో రాజధాని పెడితే ఇచ్చే ప్లాట్స్ కి అధిక ధర వస్తుంది జీవితాలు బాగుపడతాయి అని ఆశతో ఇచ్చిన రైతులు ఉన్నారు . నలుగురితో పాటు నారాయణ వాళ్ళు ఇచ్చి నేను ఇవ్వకపోతే లాక్కోకుండా ఉంటారా అని తలొంచుకొని ఇచ్చిన సాధారణ రైతులు ఉన్నారు . మేమివ్వం అని అడ్డం తిరిగి టీడీపీ ప్రభుత్వం చేతిలో జ్ఞానోదయం అయ్యి ఇచ్చిన వారు ఉన్నారు . అప్పటికీ భీష్మించుకు కూర్చొని కోర్టులకు వెళ్లి నిలవరించిన వారూ ఉన్నారు .

వీరి ప్రస్తుత స్థితి ఏంటీ ??? . తప్పని స్థితిలో వ్యవసాయం వదిలేసి ప్రభుత్వం ఇచ్చిన తృణమో ఫనమో కవులూ , పింఛన్ తీసుకొని ఇచ్చే ప్లాట్ నే ఆదాయంగా పరిగణించుకొందాం అనుకొని మరో జీవనాధారం చూసుకొన్న వారు ఇప్పుడు వ్యవసాయ యోగ్యం కాని ఎక్కడుందో హద్దులు కూడా లేని తన భూమి ఏమి చేసుకొంటాడు .

కొంత భూమి అమ్మి కొంత భూమి ప్రభుత్వానికి ఇచ్చి విలాస జీవన శైలికి అలవాటు పడ్డవాడి పరిస్థితి అయితే కుడితిలో పడ్డ ఎలుక సామెత అని చెప్పక తప్పదు.

ఊహల లోకంలోనుండి ఒక్కసారిగా యదార్ధ స్థితిలోకి తెచ్చిపడేసిన జగన్ ప్రస్తుతం రైతుల నుండి కొంత వ్యతిరేకత ఎదుర్కోవచ్చు గానీ ఈ మొత్తం నేరానికి , జరిగిన అన్యాయానికి ప్రధాన కారకుడు బాబు . కేంద్ర సహకారంతో ఐదులక్షల కోట్లతో అంతర్జాతీయ నగరాన్ని నిర్మిస్తానని అదే ఆంధ్రా భవిష్యత్ అని జనాల్ని నమ్మించి నయానా భయానా భూముల్ని లాక్కుని బాబు చేసిన అభివృద్ధి సూన్యం . తాను నగరాన్ని కొంత మేర అయినా నిర్మించి ఉంటే ఈ రోజు రాజధాని మార్చే స్థితి వచ్చి ఉండేది కాదు .

ఐదు లక్షల కోట్లతో సింగపూర్ నిర్మిస్తానన్న బాబు ,మాస్టర్ ప్లాన్స్ కే ఐదు వేల కోట్లు అవసరమన్న బాబు మొదటి యాడాది సాయంగా కేవలం ఐదు వేల కోట్లు ఆడిగినప్పుడే ఇది అరచేతిలో వైకుంఠం అని తెలుసుకొని జాగ్రత్త పడాల్సింది . ఐదేళ్లలో అన్ని దేశాల అద్భుతాలు చూపిస్తూ అలాగే నిర్మిస్తానని కబుర్లు చెప్తూ ప్రజాధనాన్ని వృధా చేసి చివరికి కేంద్రం ఇచ్చిన రెండున్నర వేల కోట్లతో , చేసిన అప్పులతో తాత్కాలిక కట్టడాలు తప్ప ఒక్క శాశ్వత భవనమూ నిర్మించక అటు రైతుల్ని , ఇటు రాష్ట్రాన్ని భ్రమలో ముంచిన బాబు ఎప్పటికీ క్షమర్హుడు కాదు .

ప్రస్తుత చర్చానీయాంశం కూడా కాదు . నష్టపోయిన వారి తరుపున పోరాడే నైతిక అర్హత కూడా లేదు . ఒకవేళ అవకాశం ఉన్నా సొంత ప్రచారానికి తప్ప ప్రజాపయోగంగా పోరాడడు అనేది ఈ రోజు చిన్న పిల్లవాడికి సైతం తెలుసు .

ప్రస్తుతం రైతుల కర్తవ్యం ఏంటీ .

శోకాలకీ శాపాలకీ విలువ ఉండదని రాజధాని రైతులు తెలుసుకోవాలి .
2017 లో బిస్కెట్ లా ముద్దుగా చేసి అప్పగించాల్సిన తమ ప్లాట్లు ఇప్పటికీ అతీగతీ లేని స్థితి గమనించుకోవాలి .
ప్రస్తుత ఆర్థిక స్థితిలో మరో ఐదేళ్ళకి కూడా పూర్తి కాదు అన్న చేదు నిజం అర్థం చేసుకోవాలి .
అలాంటప్పుడు మంచో చెడో తమ భూమి తాము తిరిగి తీసుకోవటానికి సిద్ధపడాలి .
29 గ్రామాల రైతులు గ్రామాల వారీగా , వీలైతే సర్వే నంబర్ల సహ రైతుల వారీగా రాజకీయాలకతీతంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి .
తమ భూమి వాస్తవ హద్దుల రూపంలో తిరిగి పొందటానికి మార్గదర్శకాలు ఏర్పాటు చేసుకొని వాటి సాధనకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి .
తిరిగి సాగు యోగ్యంగా చేసుకోవటానికి , అందుకయ్యే కాలంలో తమ పోషణకు అయ్యే ఖర్చులను , ఇన్నాళ్లు కోల్పోయిన నష్టాన్ని సరాసరిన అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి పరిహారంగా పొందే ప్రయత్నం చేయాలి .

రాజధాని ఇక్కడ నుండి తరలిస్తున్నాం , ఇక్కడ అసెంబ్లీ మరికొన్ని విభాగాలు ఉంటాయి అని ,అవసరమైన మేర ఉంచుకొని మిగతా భూములు రైతులకిచ్చేస్తామని నర్మగర్భంగా చెప్పిన ప్రభుత్వం ప్రస్తుతం నెలకొన్న కొన్ని ఆందోళనల దృష్ట్యా ఇహ అలసత్వం ప్రదర్శించటం మంచిది కాదు .

ఒకరు కాదు ఇద్దరు కాదు ఇరవై నాలుగు వేల మంది రైతుల భూములతో ముడిపడి ఉన్న అంశాన్ని వీలైనంత త్వరగా తేల్చాలి.

ఎన్ని ఎకరాల భూమి ఏ గ్రామాల పరిధిలో ఉంచుకొంటారు . వారికి పరిహారంగా ఏమి అందిస్తారు ,
(గతంలోలా ప్లాట్స్ డెవలప్ చేసి ఇస్తామంటే ఒప్పుకోకపోవచ్చు .ఐదేళ్లు మోసపోయారు కాబట్టి) .

ఇప్పుడు ఏ ఏ గ్రామాల పరిధిలో భూమి తిరిగిస్తారు .కొన్ని గ్రామాల పరిధిలో సరిహద్దులు చేరిపేసి చదును చేసినవి మళ్లీ కొలతలు వేసి హద్దులు నిర్ణయించి ఏ గడువులోగా ఇస్తారు .గత మూడు నాలుగేళ్లుగా సాగులో లేక పాడుబడ్డ భూముల్ని వ్యవసాయ యోగ్యంగా చేసి ఇస్తారా ? లేక రైతుల్ని బాగు చేసుకోమని పరిహారం ఇస్తారా .
అది ఏ అంశాల ప్రాతిపదిక చేసుకొని ఎకరాకు ఎంత నిర్ణయిస్తారు .

అలాగే ప్రభుత్వం తిరిగిచ్చే ప్రక్రియకి అయ్యే కాలం , మళ్లీ సాగులోకి తేవటానికి అయ్యే కాలం పంట నష్టాన్ని సరాసరి అంచనా వేసి రైతుకి వీలైనంత న్యాయం చేసే ప్రయత్నం చేయాలి .

ఇహ ముఖ్యమైన అంశం ఇంసైడర్ ట్రేడింగ్ వలన నయానో భయానో భూమి కోల్పోయిన రైతులకు కూడా న్యాయం చేకూర్చే ప్రయత్నం .

2014 ఎన్నికల నాటి నుండి రాజధాని ప్రకటన లోపు జరిగిన కొనుగోళ్లు మాత్రమే ఇంసైడర్ ట్రేడింగ్ కాదు . ఆ సమయంలో సేల్ అగ్రిమెంట్లు , స్వాధీనం అగ్రిమెంట్లు చేసుకొని తర్వాత కాలంలో రిజిస్టర్ చేసుకొన్న వ్యక్తుల్ని , కంపెనీల్ని కూడా గుర్తించాలి (ఇటీవల కొన్ని సంస్థలు , కొందరు బడా వ్యక్తులు తాము రాజధాని ప్రకటించాక కొన్నాము అని ప్రకటించిన విషయం పాఠకులకు గుర్తుండే ఉంటుంది) .

ప్రభుత్వ రంగ సంస్థలకు చేసిన కేటాయింపులు తప్ప నిర్మాణాలు చేపట్టని ప్రయివేటు కేటాయింపులు మొత్తం రద్దు చేయాలి . ప్రభుత్వ రంగ సంస్థలకు , ప్రయివేటు సంస్థలకు కేటాయింపుల మధ్య వ్యత్యాసాలను గుర్తించి లోపాయకారి కేటాయింపులు జరిపిన గత ప్రభుత్వ పెద్దలను , కంపెనీలను విచారించి దోషులకు శిక్షలు పడేట్టు చర్యలు తీసుకోవాలి.

ఈ వ్యవహారాలన్నింటికి సత్వరమే ఆయా రంగాల్లో విస్తృత అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులతో కమిటీని నియమించి కమిటీ ద్వారా మార్గదర్శకాలు నిర్దేశించుకొని వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించాలి . లేకపోతే బాబుగారు రైతులకు రాష్ట్రానికి చేసిన తీరని అన్యాయమే వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించినట్లు అవుతుంది .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి