iDreamPost

అమరావతి – శక్తిపీఠ రాజకీయం

అమరావతి – శక్తిపీఠ రాజకీయం

అమరావతి – శక్తిపీఠమా?

పురాణ కథ ప్రకారం సతీదేవి తండ్రి దక్షుడి మీద కోపంతో అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. దానికి కోపగించిన పరమేశ్వరుడు దక్షుణ్ణి సంహరించి సతీదేవి శరీరం తీసుకెళుతుండగా ఆమె శరీర భాగాలు పద్దెనిమిది చోట్ల పడి శక్తిపీఠాలుగా వెలిశాయి. వాటినే అష్టాదశ (అష్ట అంటే ఎనిమిది, దశ అంటే పది) శక్తిపీఠాలు అంటారు.

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

శ్రీలంకలోని శాంకరీ దేవి, కంచిలోని కామాక్షి, ప్రద్యుమ్నమందున్న శృంగళా దేవి, క్రౌంచ పట్టణమందున్న (మైసూరు) చాముండీ దేవి, ఆలంపురమందున్న జోగులాంబ, శ్రీశైలమందున్న భ్రమరాంబికా, కొల్హాపురియందున్న మహాలక్ష్మి, మహూరమందున్న (మహూర్, నాందేడ్ జిల్లా) ఏక వీరికా, ఉజ్జయినియందున్న మహాకాళీ, పిఠాపురమందున్న పురుహూతికా దేవి, ఓఢ్య దేశముననున్న జాజ్ పూర్ కు దగ్గర ఉన్న గిరిజా దేవి, దక్షవాటిక యందున్న (దాక్షారామం) మాణిక్యాంబ, హరిక్షేత్రమందున్న (అస్సాం) కామ రూపిణి, ప్రయాగలోని మాధవేశ్వరి, జ్వాలయందున్న (కాంగ్రా, హిమాచల్ ప్రదేశో) వైష్ణవీ దేవి, గయ యందున్న మాంగళ్య గౌరి, వారణాసి యందున్న విశాలాక్షి, కశ్మీరమందున్న సరస్వతి – ఇవి పదునెనిమిది శక్తి పీఠాలు.

ఇందులో  ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలంలో భ్రమరాంబికాలయం ఉంది. శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. అంటే జ్యోతిర్లింగం,శక్తిపీఠం ఉన్న ఏకైక క్షేతం శ్రీశైలం.జ్యోతిర్లింగాలు,శక్తిపీఠాలు తో పాటు పంచ ఆరామాలు ఉన్నాయి.

శ్రీనాధుడు రాసిన భీమేశ్వర పురాణం ప్రకారం రాక్షసుల బారి నుంచి దేవతల్ని కాపాడేందుకు పాశుపతాస్త్రంతో రాక్షసుల్ని సంహరించిన తర్వాత వారి రాజ్యాన్ని కూడా బూడిద చేశాడు ముక్కంటి. అంత యుద్ధం తర్వాత కూడా త్రిపురాసులు పూజించే శివలింగం మాత్రం చెక్కుచెదరలేదు, దానిని ఐదు భాగాలుగా చేసి పలు చోట్ల ప్రతిష్ఠిస్తే అవి ఆంధ్రరాష్ట్రంలో పంచారామాలు అయ్యాయి.

స్కాంద పురాణం ప్రకారం – హిరణ్యకశపుడి మనవడు తారకాసురుడు, అతని భక్తికి మెచ్చి వరమిచ్చిన శివుడే పలు కారణాల వల్ల తన కుమారుడైన సుబ్రహ్మణ్యస్వామి చేత తారకాసురుణ్ణి అంతమొందిస్తాడు. ఆ రాక్షసుడిలోని ఆత్మలింగాన్ని దేవతలు ఆంధ్రప్రదేశ్ లోని అయిదు చోట్ల ప్రతిష్టింపజేశారు. అవే పంచారామాలు… తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామంలో ‘దక్షారామం’; సామర్లకోటలోని కుమారారామం; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని ‘క్షీరారామము’, భీమవరంలోని ‘భీమారామము’; గుంటూరు జిల్లాలోని ‘అమరారామము’.

గుంటూరు జిల్లాలోని అమరారామమున్న ప్రాంతం అమరావతి. అది, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం ఒకటి కాదు – రెండిటికీ మధ్య ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమం అని చెబుతున్న సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ “అమరావతి శక్తిపీఠం.. దీన్ని ఎవరూ కదిలించలేరు” అన్నారు.

రాజకీయాల్లో  “అందరికి నేనే ,అంతా నేనే ” అని ప్రచారం చేసుకునే చంద్రబాబు చివరికి శక్తి పీఠాలను కూడా వదలలేదు. రాజకీయాల కోసం చరిత్ర వక్రీకరణ చేసినట్లే “నేను కట్టిన అమరావతి” అను చెప్పుకుంటున్న అమరావతిని శక్తి పీఠం చేశాడు. 

అమరావతిని రాజధానిగా ప్రకటిస్తూ బౌద్ధ క్షేత్రమైన అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే దలైలామా ,ఇతర బౌద్ధ సంస్థలు లక్షల కోట్ల నిధులు ఇస్తాయని తన అనుకూల మీడియాలో రాయించిన చంద్రబాబు ఇప్పుడు సడన్ గా అమరావతికి శక్తిపీఠం చేయటం కూడా స్వీయ రాజకీయం కోసమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి