iDreamPost

బాబు వల్ల కానిది జేఏసీ వల్ల అవుతుందా..?

బాబు వల్ల కానిది జేఏసీ వల్ల అవుతుందా..?

మూడు రాజధానులు వద్దంటూ అమరావతే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా కొనసాగించాలనే ఏకైక డిమాండ్‌తో అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాలకు గాను నాలుగు గ్రామాల రైతులు చేస్తున్న పోరాటం సోమవారానికి 286వ రోజుకు చేరుకుంది. గత డిసెంబర్‌లో మొదలైన రైతుల ఉద్యమం అమరావతి జేఏసీగా మారి.. చలి, ఎండ, కరోనా, వర్షం, వరద.. ఇలా దేని వల్ల అంతరాయం లేకుండా సాగుతోంది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదించిన వైసీపీ ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటూ.. ఆ దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలో అమరావతి జేఏసీ భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. అమరావతి ఉద్యమాన్ని రాష్ట్రం నలుదిశలా విస్తరించేందుకు ప్రణాళికలు రచించామని జేఏసీ నేతలు ప్రకటించారు. త్వరలో రాష్ట్ర పర్యటన చేయనున్నట్లు వెల్లడించారు. ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే.. ప్రజా మద్ధతు కూడగడతామని జేఏసీ నేతలు చెబుతున్నారు.

రాష్ట్ర పర్యటన, ప్రజా మద్ధతు కూడగట్టడం అనేది అంత సులువైన పని కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమరావతి జేఏసీ చేసే డిమాండ్‌లో అందరి శ్రేయస్సు ఉంటే.. ఈ పాటికే రాష్ట్ర ప్రజల మద్ధతు అమరావతి ఉద్యమానికి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రాజధానుల వల్ల రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెడితే.. అందరికి సమ న్యాయం జరిగినట్లు ఉంటుంది. అలా కాకుండా రాజధాని ఒక్కేటే ఉండాలి. అది మా ప్రాంతంలోనే ఉండాలి.. అంటే అది స్వార్థం అవుతుందని ఎవరైనా చెబుతారు.

రాజధాని వల్ల వచ్చే లాభం ఏమిటో అందరికీ తెసినదే. రాజధాని ప్రకటించక ముందు అమరావతి ప్రాంతంలో ఎకరా భూమి విలువ 25 లక్షలుగా ఉంటే.. ఆ తర్వాత కోట్ల రూపాయలకు పెరిగిందని ఉద్యమం చేస్తున్న రైతులే చంద్రబాబును పొగిడే సమయంలో చెప్పారు. సాగు నీరు సమృద్ధిగా ఉండి, అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన ప్రాంతంలోని ప్రజలకే మళ్లీ రాజధాని ప్రతిఫలాలు మొత్తం దక్కాలనే డిమాండ్‌ ఏ మాత్రం సహేతుకం కాదనేది ఎవరైనా చెప్పే మాట. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో ఇటీవల కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో అందరూ చూశారు. అమరావతి జేఏసీ నేతలు వారి వద్దకు వెళ్లి.. ఒకే రాజధాని ఉండాలి, అదీ మా ప్రాంతంలోనే ఉండాలని వారిని ఏ విధంగా ఒప్పించి, మద్ధతు కూడగడతారన్నది తెలియాల్సి ఉంది. ఆ సమయంలో అమరావతి జేఏసీ నేతలకు ఉత్తరాంధ్ర, సీమ ప్రజల ఉంచి ఎదరయ్యే ప్రశ్నలు ఎలా ఉంటాయో ఊహించగలం.

జేఏసీ నేతలు రాష్ట్ర పర్యటన చేసినప్పుడు ఎదురయ్యే పరిణామాలు పక్కనబెడితే.. అసలు వీరి లక్ష్యం అమలు జరుగుతుందా..? అనేదే మౌళిక ప్రశ్న. ఎందుకంటే.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నేత, పార్టీ క్యాడర్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకుడైన చంద్రబాబే అమరావతి ఉద్యమాన్ని గుంటూరు, కృష్ణా జిల్లాలకే విస్తరింపజేయలేకపోయారు. కనీసం అమరావతికి భూములు ఇచ్చిన 29 గ్రామాలు కూడా ఉద్యమంలో పాల్గొనడం లేదు. చంద్రబాబు జోలె పట్టి తిరిగినా, అనకూల మీడియా భారీ ఎత్తున మద్ధతుగా నిలబడినా.. సాధ్యం కాలేదు. అలాంటిది అమరావతి జేఏసీ నేతలు ఉద్యమాన్ని రాష్ట్రం నలుదిశలా విస్తరింపజేయగలరా..? అంటే ఎవరైనా ఈ విషయంపై ఒక అంచనాకు రాగలరు. ఏమైనా అన్ని సందేహాలకు సమాధానాలు జేఏసీ నేతల రాష్ట్ర పర్యటన ప్రారంభం అయినప్పుడే తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి