iDreamPost

రాజధానిపై జగన్‌ మనసులో మాట

రాజధానిపై జగన్‌ మనసులో మాట

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు ఏర్పాటుకే సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి మొగ్గు చూపారా..? అమరావతిని అభివృద్ధి చేయడం సాధ్యమయ్యే పనికాదని భావిస్తున్నా..? విశాఖ వైపు మొగ్గు చూపడానికి బలమైన కారణాలున్నాయా..? రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై దృష్టి సీఎం దృష్టి పెట్టారా..? అంటే అవునంటున్నారు రాష్ట్ర మంత్రులు. నిన్న అమరావతిలోని సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్‌ తన మనసులోని మాటను తమతో పంచుకున్నట్లు మంత్రులు చెబుతున్నారు.

సాధ్యం కాని పని..

రాజదానిగా అమరావతిని అభివృద్ధి చేయడం సాధ్యం కాని పనని సీఎం జగన్‌ భావిస్తున్నట్లు మంత్రులు చెబుతున్నారు. అమరావతిలో 56 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే ఎకరానికి రెండు కోట్ల రూపాయల చొప్పున మొత్తం లక్ష పదివేల కోట్ల రూపాయలు కావాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమం దృష్ట్యా అంత పెద్ద మొత్తం వెచ్చించే పరిస్థితి లేదు. చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రకటించిన అనంతరం నాలుగున్నరేళ్లలో కేవలం 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇంకా లక్ష ఐదు వేల కోట్లు కావాలి. ఇంత మొత్తం ఖర్చు చేసేందుకు నిధుల కొరతతోపాటు, ఎన్ని సంవత్సరాలు పడుతుందన్నది ప్రధాన ప్రశ్నగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో పెట్టిన ఖర్చుకు రెట్టింపు పెట్టినా.. 50 ఏళ్లు పడుతుంది.

నిధులు ఎలా..?

రాజధానికి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన 5,800 కోట్లలో కేంద్రం 15 వందల కోట్లు ఇవ్వగా చంద్రబాబు ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు పెట్టింది. మిగతా 4 వేల కోట్ల రూపాయలు అప్పుగా తెచ్చారని మంత్రి వర్గ సమావేశంలో చర్చ జరిగింది. ఇక రాబోయే రోజుల్లో రాజధాని కోసం చేయబోయే నిధులు ఎలా సమకూర్చుకోగలం అన్న చర్చ సాగింది.

అభివృద్ధి, సంక్షేమం పరిస్థితి ఏంటీ..?

కేవలం రాజధాని గురించే ఆలోచిస్తే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం పరిస్థితి ఎంటీ..? రాయలసీమ, ప్రకాశం, ¯ð ల్లూరు జిల్లాలకు గోదావరి మిగులు జలాలను తరలించేందుకు 60 వేల కోట్లు కావాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పూర్తికి 16 వేల కోట్లు అవసరం. సీమలో కరువుని తరిమేందుకు చెరువుల అభివృద్ధికి 25 వేల కోట్లు కావాలి. జలయజ్ఞం లో భాగంగా ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి 25 వేల కోట్లు కావాలి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు 26 వేల కోట్లు ఖర్చు చేయాలి. ప్రజలకు సురక్షితమైన నీరు సరఫరాకు 40 వేల కోట్లు ఖర్చు అవుతుంది. సామాజిక ఫించన్లకు 15 వేల కోట్లు, రైతు భరోసా పథకానికి దాదాపు ఐదే వేల కోట్లు, ఇతర నవరత్నాల పథకాలకు భారీగా నిధులు కావాలి.

10 శాతంతో విశాఖ అభివృద్ధి..

ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖపై దృష్టి సారిస్తే హైదరాబాద్‌ స్థాయిలో మనకు ఓ నగరం ఉంటుందని, తద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సీఎం భావిస్తున్నారు. పరిశ్రమలు పెరగడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అమరావతికి పెట్టే 1.10 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు పెడితే విశాఖను బ్రహ్మాండంగా అభివృద్ధి చేయొచ్చు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకుండా చేద్దామని సీఎం జగన్‌ పేర్కొన్నట్లు మంత్రులు చెబుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు వల్ల తమకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచన సీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంత ప్రజల్లో లేకుండా చేయొచ్చని భావిస్తున్నారు. సమగ్రాభివృద్ధి వల్ల భవిష్యత్‌లో వేర్పాటు ఉద్యమాలకు అవకాశం ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి