iDreamPost

బీజేపీ.. పవన్‌ ఒకలా, ప్రచారానికి ఒకలా చెప్పిందా..?

బీజేపీ.. పవన్‌ ఒకలా, ప్రచారానికి ఒకలా చెప్పిందా..?

ఏపీ రాష్ట్ర రాజధాని విషయంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఏపీ రాష్ట్ర నాయకత్వానికి ఒకలా, తన మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు ఒకలా చెప్పిందా? అన్న ప్రశ్న ఇప్పుడు విశ్లేషకుల మెదళ్ళను తొలుస్తోంది. ఇటీవలే రాజధాని ప్రాంత వాసులతో సమావేశన పవన్‌ కళ్యాణ్‌ రాజధానిని అమరావతిలోనే ఉంటుందని బీజేపీ తనకు చెప్పిందని వ్యాఖ్యానించడం పట్ల ఇప్పుడు సర్వత్రా చర్చజోరందుకుంది. రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోదని రాష్ట్ర బీజేపీ నాయకత్వం తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగానే అనేక వేదికలపై ఇప్పటికే స్పష్టం చేసేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అంగీకారమే అన్న రీతిలోనే రాష్ట్ర బీజేపీ వ్యవహరిస్తోంది.

మరి అటువంటప్పుడు పవన్‌ కళ్యాణ్‌కు మాత్రం అలా ఎందుకు చెప్పిందన్న ప్రశ్నకు సమాధానం చిక్కడం లేదిప్పుడు. అంటే పవన్‌ కళ్యాణ్‌ను బీజేపీ కావాలనే తప్పుదారి పట్టించిందా? లేక ఇరు పార్టీలకు ఇప్పుడు ప్రత్యక్షంగా కమ్యూనికేషన్‌ లేదు కాబట్టి? అప్పుడెప్పుడో అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకున్న విషయాన్ని పవన్‌ ఇప్పుడు తెరపైకి తెచ్చారా? అని అనేక ప్రశ్నలు ఇప్పుడు అన్ని వైపుల నుంచీ విన్పిస్తున్నాయి.

అయితే పవన్‌ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ కార్యవర్గం నుంచి కూడా ఎటువంటి కామెంట్లు వెలువడలేదు. ఈ లోపు గ్రేటర్‌ హైదరాబాదు ఎన్నికల్లో ముందు పోటీ చేస్తానని, ఆ తరువాత బీజేపీకి మద్దతు ఇస్తానని పవన్‌ రెండు మాటలు విన్పించడంతో చర్చ ఆ పక్కకు మరలిపోయింది.

అయితే పవన్‌ వ్యాఖ్యలను బట్టి బీజేపీతో పవన్‌ స్నేహం ప్రత్యర్ధులు ఊహిస్తున్నంత సరసంగా లేదన్నది మాత్రం మరోసారి తేటతెల్లమైపోయిందంటున్నారు. దాదాపుగా ప్రతి విషయంలో పవన్‌ను మరుగున పెట్టే విధంగా బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తోందని విన్పిస్తున్న ఆరోపణలు నిజమయ్యే సూచనలే కన్పిస్తున్నాయంటున్నారు.

ఇప్పటికే ఏపీలో దాదాపు కోల్డ్‌ స్టోరేజీ స్థాయికి జనసేనను, పవన్‌ కళ్యాణ్‌ను బీజేపీ నాయకత్వం కట్టడి చేసేసిందన్న అభిప్రాయాన్ని రాజకీయవర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఒక్కో సారి ఒక్కో రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పవన్‌ కూడా తన అస్థిరతను ప్రదర్శించుకుంటున్నారంన్నారు. అయితే ఈ తరహా వ్యవహారం ఆ పార్టీనే నమ్ముకున్న కరుడుగట్టిన కార్యకర్తల్లో మరింత అయోమయం పెంచకమానదు. అటు బీజేపీగానీ, ఇటు పవన్‌ కళ్యాణ్‌గానీ సదరు వ్యాఖ్యలపై క్లారిటీ ఇస్తే తప్ప ఈ ఎడతెగని చర్చకు ముగింపుదొరికే అవకాశం లేదంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి