iDreamPost

ఎక్కడిదీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్?

ఎక్కడిదీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన రోజు నుండి రాష్ట్రంలో రాజధాని నిర్ణయంపై ప్రభుత్వాలు పలు కమిటీలు వేస్తు వస్తున్నారు. శివరామ కృష్ణన్ కమిటి, మంత్రి నారాయణ కమిటిని గత ప్రభుత్వ హయాంలో నియమిస్తే కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం జీ.యన్ రావు కమిటి, బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ ని రాజధాని పై అధ్యయనం చేయటానికి నియమించింది. అయితే ఈ కమిటీలపై వాటి విశ్వసనీయతపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ముఖ్యంగా బోస్టన్ గ్రూప్ పై పొర్చుగల్ దేశంలో అవినీతి కేసులు ఉన్నాయని, దానికి విజయసాయి రెడ్డికి సంబంధాలు ఉన్నాయని విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం మాత్రం ఇది మంత్రి నారాయణ లాంటి కమిటీ కాదని బోస్టన్ గ్రూప్ వారు కొత్తగా పుట్టుకు వచ్చిన వారు కాదని ఇదివరకే భారత దేశంలో అనేక విషయాలపై అధ్యయనం చేయటానికి వివిధ ప్రభుత్వాలు ఈ బోస్టన్ గ్రూప్ ని నియమించాయని చెప్పుకొచ్చింది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం వలన పూర్తి స్థాయిలో అభివృద్ది కేంద్రీకృతం అయిన హైదరాబాద్ ప్రాంతాన్ని నష్టపోయిన ఆంధ్ర ప్రజలకు, మళ్ళీ అదే నష్టం భవిష్యత్తులో జరగకూడదు అనే ఆలోచనతో నే జగన్ ప్రభుత్వం అభివృద్ది వికేంద్రికరణకు మొగ్గు చూపింది. ఈ ప్రక్రియను పూర్థి స్థాయిలో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని జి.యన్ రావు నేతృత్వంలో ఒక కమిటీ , బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్తో మరో కమిటిని ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. అయితే చంద్రబాబు ఆ కమీటిలను తీవ్ర స్థాయిలో హేళన చెసి మాట్లాడటం శోచనీయమని, రాజమౌళి చేత డిజైన్లు గీయించిన చంద్రబాబు జి.యన్ రావుని పట్టుకుని ఒక పనికిమాలిన ఆఫీసరు అంటూ వ్యక్తిగత దూషణలకు దిగడంపై వైసీపీ నాయకులు మండిపడ్డారు. శివరామ కృష్ణ కమిటీని పక్కన పెట్టి నారయణ కమిటీ వేసిన చంద్రబాబు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కమిటి విశ్వసనీయతని ప్రశ్నించటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు తీరును దుయ్యబట్టారు. పోర్చుగల్ లో బోస్టన్ గ్రూప్ కి సంబంధించిన ఒక క్లైంట్ కంపెనీ మీద అవినీతి ఆరోపణలు వస్తే అది బోస్టన్ గ్రూప్ మీదే పొలీస్ రైడ్ జరిగినట్టు ప్రచారం చేయడం చంద్రబాబు కుట్ర రాజకీయంలో భాగమని వైసీపీ నాయకులు చెప్పుకొచ్చారు.

ఎక్కడిదీ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్?

రాష్ట్రంలో వివాదాలకు, రాజకీయ విమర్శలకు కేంద్రబింధువైన ఈ బోస్టన్‌ గ్రూపు 1963లో అమెరికాలో ప్రముఖ కన్సల్టెంట్ సంస్థగా ఆవిర్భవించి, వివిధ దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో శాఖలున్నాయి. వీటిల్లో 18వేల 500 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కంపెనీ రెవెన్యూ 7500 కోట్ల డాలర్లు(7 .5 బిలియన్ డాలర్లు ) దాదాపుగా అన్ని దేశాల్లోనూ మౌలిక వనరులకు సంబంధించిన ప్రాజెక్టులకు ఈ సంస్థ సహకరించింది. వీటిలో పోర్టులు, రహదారులు, విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలవంటివి ఉన్నాయి. భారతదేశంలో కూడా వివిధ ప్రభుత్వ రంగ పోర్టుల అభివృధ్దికి ఈ సంస్థ కృషి చేసింది. కోల్‌కత్తా, ఒడిస్సా లోని పారాదీప్‌, వైజాగ్‌, ఎన్నూర్‌, చెన్నై, వి.ఓ చిదంబరం పోర్టు ట్రస్ట్‌, గుజరాత్ లోని కాండ్ల, ముంబాయి, గోవా, న్యూ మంగళూరు, కొచ్చిన్‌ పోర్టుల అభివృద్ధికి సలహాలు ఇచ్చింది.

Also Read : BCG రిపోర్ట్ – సమగ్రాభివృద్దే లక్ష్యం

ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ చంద్రబాబుకి కూడా తెలియనిదేమి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కంపెనీతొ ఒప్పందాలు కూడా చేసుకున్నారు. 2018 లో చంద్రబాబు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో టెక్నాలజీస్ ఫర్ టుమారో కార్యక్రమంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి నాలెడ్జ్ పార్టనర్గా ఉన్నది బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (BCG). బోస్టన్‌ గ్రూపు సంస్థ నిర్వహించిన స్ట్రక్చరల్ రీఫార్మ్స్ ఫర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్రోత్ సమావేశానికి 2017లో చంద్రబాబు కూడా హాజరయ్యారు. గత ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ సమావేశంలో మూడు రాష్ట్రాల్లో విద్య, మానవ వనరుల పెంపుపై రోడ్ మాప్ ఇచ్చింది, దానికి నాలెడ్జ్ పార్టనర్ గా ఈ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఉంది. 2016 లో డీమానిటైజేషన్ సమయంలో ఏర్పాటైన డిజిటల్ కరెన్సీ ప్రమోషన్ కమిటీకి కూడా నాలెడ్జ్ పార్టనర్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నే. ఈ కమిటీలో చంద్రబాబు ఛైర్మన్‌ కూడా వ్యవహరించారు. ఇక తాజాగా డిజిటల్‌ మాధ్యమం ప్రభావంతో జరిగే కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ అమ్మకాల పరిమాణం 2023 నాటికి 23 బిలియన్‌ డాలర్ల స్థాయికి చేరనుందని టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఇండియా తో కలిసి ఇదే బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక గత జులై నెలలో రూపొందించింది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గొప్ప కంపెనీగా కనిపించిన బోస్టన్ గ్రూప్ ప్రతిపక్షంలోకి రాగానే అవినీతి కంపెనీగా ఎలా మారిందో చంద్రబాబు నుండి వివరణ వస్తుందేమో చూడాలి. అలాగే చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు అధికారపక్షం కూడా వివరణ ఇస్తే ప్రజలకు తమ భవిష్యత్తు నిర్ణయించే కార్యాన్ని ఎత్తుకున్న ఈ సంస్థలపైన నమ్మకం ఏర్పడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి