iDreamPost

HIT2 మేజర్ హీరో కొత్త సినిమా ఏమైంది?

HIT2 మేజర్ హీరో కొత్త సినిమా ఏమైంది?

మేజర్ తో సూపర్ హిట్ కొట్టి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అడవి శేష్ నెక్స్ట్ మూవీ హిట్ 2. విశ్వక్ సేన్ నటించిన మొదటి భాగానికి కొనసాగింపుగా దీన్ని తీసుకురాబోతున్నారు. అయితే దానితో సంబంధం లేకుండా పూర్తిగా ఫ్రెష్ కేస్ తీసుకుని రూపొందించారు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. జూలై 29 విడుదలని మూడు నెలల క్రితమే ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఉన్నట్టుండి సైలెంట్ అయ్యారు. ఊహించిన దాని కన్నా గొప్పగా మేజర్ సక్సెస్ కావడంతో ఇప్పుడీ హిట్ 2ని ప్యాన్ ఇండియా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ కి శైలేష్ కొలను దర్శకుడు.

ఇటీవలే హిట్ 1 బాలీవుడ్ లో రాజ్ కుమార్ రావు హీరోగా రీమేక్ చేస్తే అక్కడ ఫ్లాప్ అయ్యింది. వసూళ్లు ఆశించినంత రాలేదు. వెబ్ సిరీస్ లో అంతకు మించి మర్డర్ మిస్టరీలు ఉండగా ప్రత్యేకంగా దీని కోసమే థియేటర్లకు వచ్చేందుకు నార్త్ ఆడియన్స్ అంతగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే ఇప్పుడీ హిట్ 2ని డబ్బింగ్ చేయాలా వద్దానే ఆలోచనలు జరుగుతున్నాయి. దానికి తోడు దగ్గరలో విడుదల తేదీలు ఖాళీగా లేవు. సెప్టెంబర్ చివరి వారం దాకా ప్రతి ఫ్రైడే దాదాపుగా లాక్ అయిపోయింది. మరి హిట్ 2ని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంలో క్లారిటీ రావడం లేదు. కమర్షియల్ అంశాలు లేని ఇలాంటి థ్రిల్లర్స్ జనాన్ని ఏ మేరకు రప్పిస్తాయో చూడాలి

చాలా సెలెక్టివ్ గా కథలను ఎంచుకుంటున్న అడవి శేష్ నెక్స్ట్ గూఢచారి సీక్వెల్ ప్లానింగ్ లో ఉన్నాడు. దర్శకుడు శశికిరణ్ తిక్కా ఎపుడో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు కానీ మేజర్ ని తెరకెక్కించే ఉద్దేశంతో ఈ పార్ట్ 2ని పెండింగ్ లో పెట్టారు. ఇంతకీ హిట్ 2 తాలూకు అప్డేట్స్ ఎందుకు ఆపేశారో అంతు చిక్కడం లేదు.చిత్రీకరణ బ్యాలన్స్ ఉన్న దాఖలాలు కూడా లేవు. అలాంటప్పుడు ఏదో ఒక డేట్ ని లాక్ చేసుకుంటే బెటర్. క్షణం, ఎవరు, గూఢచారి. మేజర్ ఇలా విలక్షణమైన సెలక్షన్ తో దూసుకుపోతున్న అడవి శేష్ ని రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో చూసే ఛాన్స్ లేదు కాబట్టి తను ఇలాంటి ప్రయోగాలు చేస్తేనే కొత్త జానర్లు బయటికి వస్తాయి