iDreamPost

దొంగగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆ ఒక్క తప్పు వల్ల దొరికిపోయాడు.

దొంగగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఆ ఒక్క తప్పు వల్ల దొరికిపోయాడు.

ఈజీ మనీ కోసం వక్ర మార్గాలు అనుసరిస్తున్నారు నేటి యువత. జల్సాలకు అలవాటు పడి.. డబ్బులు పోగొట్టుకోవడం, వాటిని తీర్చేందుకు దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నారు. జులాయిగా తిరుగుతున్న వ్యక్తులే కాదూ.. వేల నుండి లక్షల జీతం వచ్చే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం ఇదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా విజయనగరం జిల్లా రాజాంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దొంగగా మారి.. పోలీసులకు చిక్కాడు. ఈ నెల 18న జరిగిన దొంగతనం కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. బలగ హరిబాబు నిందితుడిగా గుర్తించి.. అరెస్టు చేయగా.. అతడు శ్రీకాకుళం రూరల్ మండలం కరజాడకు చెందిన సాఫ్ట్ వేర్ అని తేలింది. అప్పులు తీర్చేందుకు ఈ వృత్తిని ఎన్నుకున్నట్లు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజాం వాసవి నగర్‌లో ఉపాధ్యాయుడు వెంకట రమణ ఇంట్లో ఈ నెల 18న రాత్రి ఇంటికి తాళం వేసి.. ఎందువ అనే గ్రామానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన హరిబాబు.. వెంకట రమణ ఇంట్లోకి చొరబడి.. 241 గ్రాముల బంగారం, రూ. 50 వేల నగదు ఎత్తుకెళ్లాడు. చోరీ తర్వాత బయటకు వెళ్లే క్రమంలో పక్కనే ఉన్న మురికి గుంటలో పడ్డాడు. దుస్తులు మురికి కావడంతో.. ఎవరికైనా అనుమానం వస్తుందని భావించి.. దొంగతనం చేసిన ఇంట్లోకే వెళ్లి.. ఫ్యాంటును అక్కడే వదిలేసి.. వెంకట రమణ దుస్తులు ధరించి వెళ్లిపోయాడు. క్లూస్ టీంకు వేలిముద్రలు దొరక్కుండా .. గ్లౌజులకు బదులు షూ సాక్సులు వినియోగించాడు. శ్రీకాకుళం నుండి రాజాం వస్తూ చిలకపాలెం సమీపంలోనే ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. అన్నీ పక్కాగానే ప్లాన్ చేశాడు కానీ.. తన ఫ్యాంటును వెంకట రమణ ఇంట్లో వదిలేయడంతో దొరికిపోయాడు.

హైదరాబాద్, ఢిల్లీ, వరంగల్ ప్రాంతాల్లో హరిబాబు సాఫ్ట్ వేర్‌గా ఉద్యోగం చేసేవాడు. అయితే ఆన్ లైన్ బెట్టింగులకు అలవాటు పడి.. అప్పులపాలయ్యాడు. తన వద్ద ఉన్న బంగారపు వస్తువులు కుదవపెట్టేశాడు. అప్పుల వారి నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో దొంగతనాలకు తెరలేపాడు. గతంలో తన మేనత్త ఇంట్లోనే దొంగతనానికి పాల్పడి.. దొరికిపోయాడు. జైలుకి వెళ్లొచ్చిన అతడి పద్ధతిలో మార్పు రాలేదు. ఈ సారి ఏరియా మార్చాలన్న ఉద్దేశంతో విజయనగరం జిల్లాను ఎంచుకున్నాడు. ఈ నెల 16న వాసవి నగర్ లో మరో ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. ఇప్పుడు అదే ఏరియాలోని వెంకట రమణ ఇంట్లో దొంగతనానికి వెళ్లి అడ్డంగా దొరికిపోయాడు. అతడి నుండి బంగారం, డబ్బు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.