iDreamPost

నంది అవార్డులకు 38 మంది ఎంపిక.. వారిద్దరి పేర్లతో అవార్డులు : పోసాని

నంది అవార్డులకు 38 మంది ఎంపిక.. వారిద్దరి పేర్లతో అవార్డులు : పోసాని

గత కొన్ని సంవత్సరాల నుండి ఆగిపోయిన నంది అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మళ్లీ శ్రీకారం చుట్టింది ఏపీలోని జగన్ సర్కార్. ఈ మేరకు ఆ కార్యక్రమ బాధ్యతలను ఏపీ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణ మురళికి అప్పగించారు. తాజాగా ఆయన నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని పోసాని వెల్లడించారు. ఉత్తములు, అర్హులకు మాత్రమే ఈ అవార్డులను అందిస్తామని, ఒకేసారి సినిమా, టీవీ, డ్రామా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్య పడదని గతంలో ప్రకటించారు.  మొదటిగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు పోటీలు నిర్వహించగా.. గుంటూరులో ఫైనల్స్ నిర్వహిస్తామన్నారు. వీరిలో 38 మంది ఎంపికయ్యారని తెలిపారు.

విమర్శలకు తావునివ్వకుండా వీరిని 12 మంది జడ్జిలు ఎంపిక చేశారని, ఈ ఏడాది నుండి ఎన్టీఆర్ రంగ స్థల అవార్డును ఇస్తున్నట్లు పోసాని తెలిపారు. అవార్డుతో పాటు రూ. 1.5 లక్షల బహుమానం ఇస్తామన్నారు. వైఎస్సార్ రంగ స్థల పురస్కారాలను కూడా అందిస్తామన్నారు. రంగస్థల రంగానికి కృషి చేసినందుకు వారికి రూ. 5 లక్షలు ఇస్తామని తెలిపారు. వైఎస్ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2004 నుండి ఏపీలో రంగ స్థలాన్ని ప్రోత్సహించారని ఆయన గుర్తు చేశారు. అందుకే ముఖ్యమైన జిల్లాల్లో ఆడిటోరియంలు కట్టించినట్లు చెప్పారు. ఏపీలో ఉన్న నటులు, సాంకేతిక నిపుణులకు త్వరలోనే ఉచితంగా గుర్తింపు కార్డలు ఇస్తామని చెప్పారు. ఆన్ లైన్లో నటుల వివరాలు పొందుపరుస్తామన్నారు. షూటింగ్ లకు వెళ్లే సినీ నటుల కోసం బస్సు రాయితీ ప్రతిపాదనపై చర్చిస్తామన్నారు. ఏపీలో చిత్రీకరణలు ఉచితంగా చేసుకోవచ్చునని, స్టూడియోలు కడితే స్థలాలు ఇస్తామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి