iDreamPost

ప్రేమను ఆవిష్కరించిన దృశ్యకావ్యం – Nostalgia

ప్రేమను ఆవిష్కరించిన దృశ్యకావ్యం – Nostalgia

అనగనగా ఒక రోజు

1989. మే 12. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లో దేవి 70 ఎంఎం థియేటర్.

గీతాంజలి మొదటి షో పూర్తి చేసుకుని జనం బయటికి వస్తున్నారు. అప్పటికే తెలుగునాట ఘర్షణ, మౌనరాగం, నాయకుడు సినిమాలతో ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నంతో అక్కినేని వారసుడు కాంబినేషన్ అనగానే షూటింగ్ టైం నుంచే విపరీతమైన అంచనాలు. నాగార్జునను ఎలా చూపిస్తాడో అని అభిమానులు ఏవేవో ఊహించుకున్నారు. ఆడియో క్యాసెట్లో విన్న ఇళయరాజా పాటలు ఏదో అద్భుతం చూడబోతున్నారన్న గ్యారెంటీ అయితే ఇచ్చాయి. కానీ జరిగింది వేరు. హాలు నుంచి బయటికి వస్తున్న ఫ్యాన్స్ లో మిక్స్డ్ రియాక్షన్స్. ఇదేంటి హీరోయిన్ ని రోగం ఉన్నదానిలా చూపించాడు. సరే ఏదోలే అనుకుంటే హీరోకు కూడా జబ్బా. ఇదెక్కడి అన్యాయంరా బాబు. హవ్వ ఎప్పుడైనా చూశామా ఇలాంటి విచిత్రాలు. మణిరత్నం బాగా ఓవర్ కాన్ఫిడెంట్ గా వెళ్ళాడు. అబ్బే పది రోజులు ఆడితే గొప్పే. ఇవీ బయటికి వినిపించిన కామెంట్లు. తన ఆఫీస్ లో ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తున్న నిర్మాత నరసారెడ్డికి ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి. నిజంగానే సినిమా పోయిందేమో అనే ఒత్తిడిలో అన్నారాయన.

ఎందుకిలా అయ్యింది

ఇలా జరగడానికి కారణాలు లేకపోలేదు. నాగార్జునకు అప్పటికే మాస్ లో అభిమానగణం పెరిగింది. ఆఖరి పోరాటం, కిరాయి దాదా, జానకి రాముడు, విక్కీ దాదా లాంటి సినిమాలు దానికి దోహదపడ్డాయి. అందుకే గీతాంజలి చూసినప్పుడు ఆడియన్స్ కి పైన వాటిలో మెప్పించిన ఏ అంశమూ ఇందులో కనిపించకపోయేసరికి కొంత నిరాశ చెందిన మాట వాస్తవం. దానికి తగ్గట్టే బయట మీడియాలోనూ గీతాంజలి ఫ్లాప్ అంట కదా అనే ప్రచారం కూడా కొంత అయోమయానికి గురి చేసింది. కానీ అసలు చరిత్ర తర్వాత మొదలయ్యింది. మొదటి నాలుగు రోజులు కలెక్షన్లు కొంత స్లోగానే ఉన్నాయి. జరుగుతున్నది చూసి నిర్మాత నరసారెడ్డి ఓ పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి వచ్చింది. తమ సినిమాకు దక్కుతున్న ఆదరణ గురించి, కొందరు పనిగట్టుకుని చేస్తున్న చెడు ప్రచారం గురించి వివరంగా చెప్పుకున్నారు. అరచేతిని అడ్డుపెట్టుకొని సూర్యుణ్ణి ఆపగలమా. అలాగే విషయం ఉన్న సినిమాను దెబ్బ తీయగలమా. గీతాంజలి ఈ విషయంలో అన్నింటి కంటే ఒక మెట్టు పైనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళదాం.

దృశ్యకావ్యానికి శ్రీకారం

1988 సంవత్సరం తమిళనాడులో అగ్ని నచ్చతిరం(తెలుగు డబ్బింగ్ ఘర్షణ)బ్లాక్ బస్టర్ అయ్యాక టాలీవుడ్ కు ఒక స్ట్రెయిట్ మూవీ చేయమని మణిరత్నం వెంటపడ్డారు నిర్మాత నరసారెడ్డి. ఘర్షణనే నాగార్జున-వెంకటేష్ కాంబోలో మల్టీ స్టారర్ గా తీయాలని ఆయన ఆలోచన. కానీ దానికి దర్శకుడు ససేమిరా అన్నారు. వేరే డైరెక్టర్ తో రీమేక్ కు సైతం ఒప్పుకోలేదు. దాని బదులు వేరే కొత్త సబ్జెక్టుతో తెలుగులో సినిమా చేస్తానని మాటివ్వడంతో ఘర్షణను వెంటనే డబ్బింగ్ చేసి వదిలితే ఇక్కడ ఏకంగా నూటా యాభై రోజులు ఆడేసింది. ఆ టైంలోనే గీతాంజలికి శ్రీకారం చుట్టబడింది. ఢిల్లీకి చెందిన ఓ యువతి క్యాన్సర్ కారణంగా చావుకు దగ్గరై కవితల రూపంలో ఓ పత్రికకు తన రచనలు పంపేది. వాటిని చదివిన మణిరత్నం అప్పటికే తన మనసులో ఉన్న డైయింగ్ యంగ్ అనే హాలీవుడ్ మూవీలో ఒక పాయింట్ తీసుకుని రెండింటిని కలిపి గీతాంజలి కథను రాసుకున్నారు. పూర్తిగా వినకుండానే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. తన పెళ్లికి వచ్చిన బంధువుల బృందంలో ఓ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకున్నారు మణిరత్నం. లండన్ లో పుట్టి పెరిగిన ఆమెకు తెలుగు రాదు. శిక్షణ ఇచ్చి మరీ నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. నాగ్ పక్కన కొత్తమ్మాయి అని వినగానే అందరూ షాక్.

1988లో ఊటీలో షూటింగ్ మొదలుపెట్టారు. పిసి శ్రీరామ్ ఛాయాగ్రహణం, ఇళయరాజా సంగీతం, రాజశ్రీ సంభాషణలతో పర్ఫెక్ట్ టీమ్ ని సెట్ చేసుకున్నారు. మొదట ద్విభాషా చిత్రంగా ప్లాన్ చేసుకున్నారు కానీ అలా చేస్తే ఒరిజినాలిటీకి ఇబ్బందవుతుందని గుర్తించిన మణిరత్నం తెలుగు వెర్షన్ కే కట్టుబడ్డారు. తమిళ్ లో అనువదించాలని నిర్ణయం జరిగిపోయింది. ఊటీతో పాటు మదరాసు లొకేషన్లలో అనుకున్న షెడ్యూల్స్ లో ఎక్కువ ఆలస్యం చేయకుండా పూర్తి చేశారు. పైకి లవ్ స్టోరీలా కనిపించినా బడ్జెట్ మాత్రం కోటి రూపాయలు దాటిపోయింది. నందికొండ వాగుల్లోనా, ఓ ప్రియా ప్రియా ప్రియా, జల్లంత కవ్వింత కావాలిలే పాటలకు పడిన కష్టం, పెట్టిన ఖర్చు సందర్భం వచ్చినప్పుడంతా నరసారెడ్డి గారు తలుచుకుంటూనే ఉంటారు. అలా అలా మణిరత్నం ఒకేఒక్క స్ట్రెయిట్ సినిమా గీతాంజలి 1989 మే 12న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సుమారు 42 ప్రింట్లతో రిలీజయ్యింది. అదే నెలలో వచ్చిన కె విశ్వనాధ్ సూత్రధారులు, వెంకటేష్ ఒంటరి పోరాటం, కృష్ణ సాహసమే నా ఊపిరి పోటీని తట్టుకుని మరీ అమోఘమైన విజయం అందుకుంది.

అంతగా ఏముంది ఇందులో

నిజానికి గీతాంజలిలో అసలు పాయింటే ఒక సాహసం. ఎందుకంటే అప్పటిదాకా దేవదాసు నుంచి మొదలుపెట్టి ప్రేమాభిషేకం దాకా హీరో లేదా హీరోయిన్ ఇద్దరిలో ఎవరో ఒకరికి జబ్బు ఉండి ఒకరు మాత్రమే కథలు వచ్చాయి. మరోచరిత్ర లాంటి వాటిలో డబుల్ ట్రాజెడీ ఉన్నప్పటికీ లీడ్ పెయిర్ కు ఎలాంటి వ్యాధులు ఉండవు. కానీ గీతాంజలి అలా కాదు. తాను ఎక్కువ రోజులు బ్రతకనని తెలిసి నిరాశగా రోజులు గడుపుతున్న హీరో, చావు తధ్యమని తెలిసినప్పుడు సంతోషంగా ఉండాలని అల్లరిగా ప్రవర్తించే హీరోయిన్ మధ్య లవ్ స్టోరీని అసలు ఊహించగలమా. మణిరత్నం ఇక్కడే తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఇది సీరియస్ గా చెబితే డాక్యుమెంటరీ అయిపోతుంది. ఆహ్లదకరంగా వినోదాత్మకంగా ఉండాలి. ఎమోషన్లు మిస్ కాకూడదు. అప్పుడే పండుతుంది. అందుకే రాజశ్రీ గారితో ప్రత్యేకంగా సంభాషణలు ఎలా రాబట్టుకోవాలో తమిళంలో చర్చించుకునే వారు. రోజు మన చుట్టూ లేదా పక్కింటోళ్లతో మాట్లాడినట్టుగా అనిపించాలి. ఎక్కడా అసహజత్వం కనిపించకూడదు. రాజశ్రీకి మణిరత్నం చెప్పిందిదే. ఆయన అక్షరాలా పాటించారు. లేచిపోదామా లాంటి పదాలు చాలా ఏళ్ళు కాలేజీ స్టూడెంట్స్ నోళ్ళలో నానుతూనే ఉన్నాయి.

ఎవరూ నటించలేదు

ప్రకాష్ గా నాగార్జున నటించలేదు. మణిరత్నం అనే మాస్టర్ శిక్షణలో జీవించాడు. హీరోయిన్ గిరిజ తనను ఏ ఉద్దేశంతో అయితే రిస్క్ అని భయపడకుండా తీసుకున్నారో దాన్ని సంపూర్ణంగా నెరవేరుస్తూ గీతాంజలి పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసింది. సున్నితమైన హాస్యం, ఎవరికైనా ఏదో ఒక రోజు చావు తప్పదనే సత్యాన్ని ఇంత హృద్యంగా ఇంత వినోదాత్మకంగా ఎవరూ తెరకెక్కించకపోవడంతో గీతాంజలి ఓ సరికొత్త అనుభూతిని కలుగజేసింది. డివైడ్ టాక్ ని దాటుకుని మరీ 7 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. తమిళంలో ఇదయతై తిరుడాదే పేరుతో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే అక్కడ ఏకంగా 13 సెంటర్లలో శతదినోత్సవం జరుపుకోవడం ఓ అరుదైన రికార్డు. తెలుగులో ఎస్పి బాలసుబ్రమణ్యం పాడిన పాటలకు అక్కడ మనో గాత్రదానం చేశారు. ప్రతి ఒక్క పాట ఆణిముత్యం. ఈ క్యాసెట్ లేని మ్యూజిక్ లవర్ అప్పట్లో లేరంటే అతిశయోక్తి కాదు. కామెడీ కోసం పెట్టిన చంద్రమోహన్-సుత్తివేలు-డిస్కో శాంతి ట్రాక్ ఆ తర్వాత ఫ్లోకి అడ్డం వస్తోందని వీడియో వర్షన్ లో తీసేశారు. విజయ చందర్, షావుకారు జానకి, ముచ్చర్ల అరుణ, డబ్బింగ్ జానకి, సుమిత్ర, ప్రదీప్ శక్తి, రాధా బాయ్ ఏ ఒక్కరి క్యారెక్టర్ పొడవుగా ఉండదు. కానీ అందరూ గుర్తుండిపోతారు. అదే గీతాంజలి ప్రత్యేకత

చివరి మాట

మొదట్లో సినిమాను విమర్శించిన కొన్ని వర్గాలు రెండోసారి చూశాక ఆశ్చర్యానికి గురయ్యాయి. అందమైన పెయింటింగ్ లాంటి ఓ దృశ్యకావ్యాన్ని తాము అర్థం చేసుకున్న తీరు పట్ల వాళ్ళను వాళ్ళే నిందించుకున్నారు. ఎకో కంపెనీ రిలీజ్ చేసిన ఆడియో క్యాసెట్లకు రిపీట్ ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. హైదరాబాద్ పేరుతో నడిచే సంస్థ దీన్ని వీడియో క్యాసెట్ రూపంలో విడుదల చేస్తే దాని అమ్మకాల్లోనూ సంచలనమే. యూత్ మళ్ళీ మళ్ళీ చూశారు. ఈ సినిమా చూశాక జీవితంలో తమ దృక్పథం పట్ల ఆలోచన మారిందని చెప్పుకున్న వాళ్ళు లేకపోలేదు. మణిరత్నం గీతాంజలికి రెండు పాత్రలకు ముగింపు ఇవ్వరు. అలా వదిలేస్తారు. వాళ్ళు ఏమవుతారో ఊహించుకోమని ప్రేక్షకులకే వదిలేస్తారు. మదిలో గూడు కట్టుకున్న ఓ అద్భుతమైన భావాన్ని అలాగే బయటికి తీసుకొచ్చి పదే పదే ఆస్వాదించాలని నిర్ణయించుకున్న వీక్షకులు ఏ తీర్పు చెప్పారో వేరే చెప్పాలా. అందుకే గీతాంజలి బాక్సాఫీస్ లెక్కలను దోచుకోవడం పక్కనపెడితే మూడు దశాబ్దాలు దాటినా జెనరేషన్ తో సంబంధం లేకుండా మనసులు మాత్రం కొల్లగొడుతూనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి