iDreamPost

చురుగ్గా స‌ర్కారు-అమ‌రావ‌తి ఉద్య‌మ పయ‌నం ఎటు?

చురుగ్గా స‌ర్కారు-అమ‌రావ‌తి ఉద్య‌మ పయ‌నం ఎటు?

ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని వ్య‌వ‌హారం ఓ కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వం వ‌డివ‌డిగా అడుగులు వేస్తోంది. విశాఖ నుంచి సచివాల‌యం న‌డిపించేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తోంది. కీల‌క శాఖ‌ల్లో కొన్ని విభాగాల‌ను తొలిద‌శ‌లో త‌ర‌లించ‌డం ద్వారా ఈ ప్ర‌క్రియ ప్రారంభం అవుతోంది. అందుకు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడ‌కుల‌ను విశాఖ‌లో నిర్వ‌హించ‌డం ద్వారా ముహూర్తం పెట్టిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే 20 రోజులు దాటిన అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మం ఎటు ప‌య‌నిస్తుంద‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

ఉద్య‌మం ఉధృతం కాలేదెందుకు!

అమ‌రావ‌తిలో ఆందోళ‌న ప్రారంభించిన నాటి నుంచి విభిన్న రూపాల్లో నిర‌స‌న‌లు సాగుతున్నాయి. ధ‌ర్నాలు, దీక్ష‌లు, రోడ్డు మీద బైఠాయింపులు, ర్యాలీల వ‌ర‌కూ వెళ్లింది. కానీ ఉద్య‌మ తీవ్ర‌త మాత్రం క‌నిపించ‌డం లేదు. దాంతో ఈ నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్న వారు నీరసపడిపోతున్నారు . 29 గ్రామాల్లో ఒకేసారి ఉద్య‌మం సాగించాల‌ని ప్ర‌య‌త్నించినా ఇప్ప‌టి వ‌ర‌కూ సాధ్యం కాలేదు. కొన్ని గ్రామాల్లో మాత్రం నిర‌స‌న‌లు నిరంత‌రం కొన‌సాగుతున్నాయి. మంద‌డం, వెల‌గ‌పూడి, రాయ‌పూడి, తుళ్లూరు వాసులు వెనుదిర‌గ‌కుండా ఆందోళ‌న‌లు సాగిస్తున్నారు.. మిగిలిన గ్రామాల్లో అడ‌పాద‌డ‌పా ఉద్య‌మం సాగుతోంది.

అదే స‌మ‌యంలో ఆయా గ్రామాల్లోని కొన్ని త‌ర‌గ‌తులు మాత్ర‌మే నిర‌స‌న‌ల్లో భాగ‌స్వాముల‌వుతుండ‌డం విశేషం. ప్ర‌ధానంగా కొన్ని సామాజిక‌వ‌ర్గాలు ఈ పోరాటానికి దూరంగా ఉంటున్నారు. కొంద‌రు వ్య‌క్తులుగా వ‌చ్చి మొకం చూపించినా, మెజార్టీ మాత్రం రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో క‌నిపిచండం లేదు.

అంతేగాకుండా అటు విజ‌య‌వాడ‌, ఇటు గుంటూరు న‌గ‌రాల్లో కూడా అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ పేరుతో ఆందోళ‌న‌లు ప్రారంభించినా అవి ముందుకు సాగ‌లేదు. ప్ర‌జ‌లు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకున్న దాఖ‌లాలే లేవు. చివ‌ర‌కు న్యాయ‌వాదులు కూడా నిర‌స‌న‌లు చేప‌ట్టినా వాటిని కొన‌సాగించ‌ల ప‌రిస్థితి రాలేదు. ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి ఉద్య‌మం ఆశించిన స్థాయిలో నిర్వ‌హించ‌లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు నేరుగా టీడీపీ అధినేత రంగంలో దిగినా అది ఫ‌లించ‌లేదు. ఆయ‌న భార్య కూడా వ‌చ్చినా ప్ర‌భావం శూన్యం. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా వ‌న్ డే షోకి ప‌రిమితం అయిపోయారు. బీజేపీ కూడా తొలుత హ‌డావిడి చేసినా ఆ త‌ర్వాత ఏం జ‌రుగుతుందో చూద్దాం అనే నిర్ణ‌యానికి వ‌చ్చేసింది. వామ‌ప‌క్షాల నేత‌లు కూడా సంఘీభావం ప్ర‌క‌ట‌న‌లే త‌ప్ప పూర్తిగా కార్యాచ‌ర‌ణ‌లో క‌నిపించ‌లేని స్థితి ఉంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో అమ‌రావ‌తి కోసం సాగుతున్న ఉద్య‌మంలో మ‌హిళ‌లు ముందుకొస్తున్నా ఉద్య‌మ తీవ్రత మాత్రం పెర‌గక‌పోవ‌డం విశేషం. ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తుండ‌డం ఉద్య‌మాన్ని వెన‌క్కి నెట్టే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాలున్నాయి.

టీడీపీ నేత‌లు కూడా త‌లోదిక్కు అన్న‌ట్టుగా..

అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో టీడీపీదే కీల‌క‌పాత్ర‌. ఆపార్టీకి చెందిన ప్ర‌ధాన నేత‌లు బాధ్య‌త తీసుకుని ఈ ఉద్య‌మం న‌డుపుతున్నారు. అయితే అమ‌రావ‌తి రాజ‌ధాని గ్రామాల‌కు మ‌ద్ధ‌తుగా మిగిలిన ప్రాంతంలో చేప‌డుతున్న నిర‌స‌న‌ల్లో పెద్ద‌గా ప్ర‌జా స్పంద‌న క‌నిపించ‌క‌పోవ‌డంతో కొన‌సాగించ‌డం వారికి కూడా క‌ష్టంగానే మారుతోంది .

చివ‌ర‌కు మాజీ మంత్రి దేవినేని ఉమా వంటి వారు సైతం ఉద్య‌మం న‌డిపించ‌లేని ప‌రిస్థితికి చేరారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్ వంటి వారు ప్రారంభించిన దీక్ష‌లు కూడా అర్థాంత‌రంగా ముగించాల్సి వ‌చ్చింది. ఇక 24గం.ల దీక్ష చేప‌ట్టిన విజ‌య‌వాడ తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మెహ‌న్ కి కూడా అంతంత‌మాత్రంగానే స్పంద‌న వ‌చ్చింది. ఇక గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పాత్ర కూడా అర‌కొర‌గానే ఉంది. పార్ల‌మెంట్ లో నిల‌దీస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌ట‌న‌లే త‌ప్ప రాజ‌ధాని ప్రాంతం త‌న ప‌రిధిలోనే ఉన్నా పెద్ద‌గా హాజ‌రుకావ‌డం లేదు. ఇక టీడీపీకి చెందిన మూడో ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు క‌నీసం క‌నిపించ‌లేదు. ఎమ్మెల్యేల్లో కూడా కొంద‌రు మిన‌హా మిగిలిన వారంతా మొఖం చాటేశారు. చివ‌ర‌కు క‌ర‌ణం బ‌ల‌రాం వంటి సీనియ‌ర్లు సైతం ప‌ట్ట‌న‌ట్టే ఉన్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ కూడా అమ‌రావ‌తి ఉద్య‌మం వ‌ల్ల ఒరిగేదేముంద‌నే విష‌యంలో భిన్నమైన ఆలోచ‌న‌తో ఉంది. అధినేత ఆతృత ప‌డుతున్నా అందుకు త‌గ్గ‌ట్టుగా ఫ‌లితాలు ఉండ‌వ‌ని ప‌లువురు భావించడంతో ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కూడా ఏమీ చేయ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింది.

శాంతిభ‌ద్ర‌త‌ల విష‌యంలో సీరియ‌స్ గా..

ప్ర‌భుత్వం మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆందోళ‌న‌కారుల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌నే ఆదేశాలు ఇచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. గ‌తంలో భూసమీక‌ర‌ణ స‌మ‌యంలో పోలీసుల క‌వాతు మ‌ధ్య రాజ‌ధాని ప్రాంతం క‌ల‌వ‌ర‌ప‌డేది. నిత్యం పంట‌లు ద‌గ్ధం కావ‌డం, రైతుల మీదే ఎదురు కేసులు బ‌నాయించ‌డం, భూములు ఇవ్వ‌డానికి నిరాక‌రించిన వారిని స్టేష‌న్ల‌లో నిర్బంధించ‌డం వంటివి నిత్యం క‌నిపించేవి. ప్ర‌స్తుతం అలాంటి ప‌రిస్థితి లేకుండా చివ‌ర‌కు సెక్ర‌టేరియేట్ స‌మీపంలో కూడా ఆందోళ‌న చేసినా ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండ‌డ‌మే త‌ప్ప అరెస్టుల‌కు సిద్ధం కావ‌డం లేదు. కొంద‌రు సిబ్బందిని అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన మ‌హిళ‌ల‌ను అదుపులోకి తీసుకుని ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌డ‌మే త‌ప్ప అరెస్టుల‌కు కూడా ప్ర‌య‌త్నించ‌లేదు. త‌ద్వారా ప్ర‌భుత్వం శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కే క‌ట్టుబ‌డి ఉంద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇస్తున్నారు. రైతుల‌ను వేధించే ప్ర‌భుత్వం కాద‌ని చాటుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

మీడియాపై దాడి విష‌యంలో 23 మంది జైలుకే

రాజ‌ధాని ప్రాంతంలో 21 రోజుల ఆందోళ‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 23 మందిని మాత్ర‌మే అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్ కి త‌ర‌లించ‌డం విశేషం. వారు కూడా మీడియా ప్ర‌తినిధుల‌పై దాడి కేసులో నిందితులు కావ‌డం, దాడి ఘ‌ట‌న మీడియాలో విస్తృతంగా ప్ర‌చారం కావ‌డంతోనే కేసులు బనాయించారు. 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి త‌ర‌లించారు. విడ‌త‌ల వారీగా ఈ ప్రక్రియ సాగింది. టీవీ9 విలేక‌రి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ కేసు న‌మోదు కావ‌డం విశేషం.

ఉద్య‌మం ముగింపు ఎలా

రైతుల ఆందోళ‌న విష‌యంలో వారితో రాయ‌బారాలు న‌డ‌పాల‌ని ప్ర‌భుత్వం ఆలోచిస్తోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే చ‌ర్చ‌ల‌కు రావాల‌ని మంత్రి కొడాలి నాని ఆహ్వానించారు. హైప‌వ‌ర్ క‌మిటీ భేటీ అనంత‌రం అందుకు అనుగుణంగా అడుగులు ఉంటాయ‌ని స‌మాచారం. రాజ‌ధాని ప్రాంతంలో ఆందోళ‌న చెందుతున్న వారిని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. క‌ర‌డుగ‌ట్టిన టీడీపీ నేత‌లు వ్య‌తిరేకించినా ఇత‌రుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి వారి స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రిస్తామ‌నే హామీ ఇచ్చేందుకు సిద్ధ‌ప‌డ‌తార‌ని చెబుతున్నారు. అందుకు భిన్నంగా జ‌రిగిన‌ప్ప‌టికీ రైతుల ఆందోళ‌నకు ముగింపు ఎలా అన్న‌దే ఇప్పుడు ఉద్య‌మం చేస్తున్న వారికి అంతుబ‌ట్ట‌డం లేదు.

ఓ వైపు ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తున్న ద‌శ‌లో కొద్ది గ్రామాల ప్ర‌జ‌ల పోరాటంతో దానిని నిలువ‌రించ‌డం సాధ్యం కాద‌న్న‌ది వారు కూడా గ్ర‌హించిన‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌రి ప్ర‌య‌త్నంలో భాగంగా అమ‌రావ‌తి నుంచి ప‌లు శాఖ‌ల కార్యాల‌యాల త‌ర‌లింపు ప్ర‌క్రియ‌ను అడ్డుకోవాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఆ సంద‌ర్బంగా ఎటువంటి ర‌చ్చ జ‌రిగినా దానిని మీడియా స‌హాయంతో పెద్ద‌ది చేయ‌డం ద్వారా ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేసే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు

ఏమి జ‌రిగినా రాజ‌ధాని త‌ర‌లింపు ఇక ఆగ‌ద‌నే అంచ‌నాలో రాజ‌ధాని రైతులు కూడా ఉన్నారు. ప‌లువురు ఈ ఉద్య‌మంలో భాగ‌స్వాములు కాక‌పోవ‌డానికి అదో కార‌ణంగా కూడా చెబుతున్నారు. ఏమ‌యినా రాజ‌ధాని ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఓ అడుగు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. వారిని స‌ముదాయించేందుకు త‌గ్గ‌ట్టుగా చ‌ర్య‌లు చేప‌ట్టాల్సి ఉంది. ఎలాంటి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతాయి..చివ‌ర‌కు ఈ ఉద్య‌మం ఎలా ముగుస్తుంద‌న్న‌దే ఇప్పుడు ప్ర‌శ్న‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి