iDreamPost

లోకేశ్ ఎంట్రీ కూడా జ‌రిగిపోయింది..!

లోకేశ్ ఎంట్రీ కూడా జ‌రిగిపోయింది..!

అమ‌రావ‌తి ఆందోళ‌న‌ల విష‌యంలో తెలుగుదేశం ఎంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని భావించినా వ్య‌వ‌హారం రాజ‌ధాని గ్రామాల‌కే ప‌రిమితం కావాల్సిన విధంగా మారిపోయింది. జాతీయ పార్టీ అధ్య‌క్షుడిగా చెప్పుకున్న చంద్ర‌బాబు గ‌త ఇరవై రోజులుగా మ‌రో విష‌య‌మే లేకుండా ఆ గ్రామాల‌కే ప‌రిమితం అయ్యారు. చివ‌ర‌కు వ‌చ్చే సంక్రాంతికి సొంత గ్రామానికి కూడా వెళ్ల‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు కూడా దూరంగా ఉన్నారు. ఆయ‌న భార్య భువ‌నేశ్వరి సైతం రాజ‌ధాని రైతులకు స‌హాయంగా ఉంటామ‌ని ప్ర‌క‌టించారు. ఆమె ప్లాటినం గాజులు సైతం దానం చేసి ఉదార‌త‌ను చాటుకున్నారు.

ఇంత జ‌రిగినా రాజ‌ధాని ఉద్య‌మంలో నారా లోకేశ్ మాత్రం క‌నిపించ‌లేదు. కేవ‌లం మంగ‌ళ‌గిరిలో ఓ నిర‌స‌న కార్య‌క్ర‌మం మిన‌హా ఆయ‌న పాత్ర పెద్ద‌గా లేక‌పోవ‌డంతో ప‌లువురు ఆశ్చ‌ర్యం వ్య్తక్తం చేశారు. ట్వీట్లు చేయ‌డం త‌ప్ప ప్ర‌జ‌ల్లో నేరుగా ఆయ‌న ఎందుకు క‌నిపించలేదా అనే అనుమానం మొద‌ల‌య్యింది. అయితే ఎట్ట‌కేల‌కు నారా లోకేశ్ కూడా ఎంట్రీ ఇచ్చేశారు. రాజ‌ధాని గ్రామాల్లో ప‌ర్య‌టించేశారు. పైగా అమ‌రావ‌తి కోసం ప్రాణాలు కోల్పోయారంటూ ఆ వృద్ధుడి శ‌వ‌పేటిక‌ను సైతం మోశారు. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని క‌దిలించ‌లేర‌ని ఆయ‌న ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు.

వాస్త‌వానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యంలో కొంత వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని ఆశించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాల్లోనే ప్ర‌చారం సాగింది. చంద్ర‌బాబు నేరుగా అమ‌రావ‌తి రైతుల‌కు అండ‌గా నిల‌వాల్సి రావ‌డంతో నారా లోకేశ్ మాత్రం నేరుగా వేలు పెట్ట‌కుండా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని ఆశించారు. ఓవైపు ప్ర‌భుత్వం రాజ‌ధాని మార్పున‌కు అనుగుణంగా చ‌ర్య‌లు తీసుకుంటుండ‌డం, కేంద్రం నుంచి కొర్రీలు వేయాల‌ని ఆశించినా నెర‌వేరే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఇక రాజ‌ధాని త‌ర‌లింపు అనివార్యం అవుతున్న వేళ తండ్రీకొడుకులిద్ద‌రూ కొన్ని జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం అని భావించారు. కానీ తీరా చూస్తే అవేమీ నెర‌వేర‌క‌పోగా నారా లోకేశ్ నేరుగా ఎంట్రీ ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

క‌నీసం ప్ర‌భుత్వం నుంచి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కూ ఈ ఉద్య‌మాన్ని కొన‌సాగించాల‌ని టీడీపీ కోరుకుంటోంది. అందుకు అనుగుణంగా ఇప్ప‌టికే అన్ని ర‌కాల వ‌న‌రులు వినియోగించేశారు. శ‌క్తియుక్తుల‌న్నీ ఉప‌యోగించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం కొంద‌రు కీల‌క కార్య‌క‌ర్త‌ల‌ను త‌ర‌లించి ఉద్య‌మం న‌డుపుతున్నప్ప‌టికీ మ‌రో ప‌ది రోజుల‌కు పైగా ఉద్య‌మం కొన‌సాగించ‌డం పెద్ద క‌ష్టంగా మార‌బోతోంది. ఈనెల 20 నాటికి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న తుది నిర్ణ‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న త‌రుణంలో ఈ ఉద్య‌మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్ర‌య‌త్నంలోనే చివ‌ర‌కు నారా లోకేశ్ తెర‌మీద‌కు రావాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని రాజ‌ధాని ప్రాంత వాసులు సైతం భావిస్తున్నారు. తొలి నుంచి లోకేశ్ ఈ ఉద్య‌మంలో ప్ర‌త్య‌క్షంగా పాల్గొన‌కుండా జాగ్ర‌త్త వ‌హించిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఆయ‌న కూడా ఎంట్రీ ఇవ్వాల్సిన అనివార్య‌త ఏర్ప‌డిన త‌రుణంలో టీడీపీ అధిష్టానం రాబోయే 10 రోజుల పాటు ఎలా వ్య‌వ‌హ‌రించ‌బోతుంద‌న్న‌ది ఆస‌క్తిగా క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే రాజ‌ధాని ప్రాంతంలో రైతుల్లో నైరాశ్యం క‌నిపిస్తోంది. పలు చోట్ల శిబిరాలు ప‌లుచ‌బ‌డుతున్న‌ట్టు భావిస్తున్నారు. ఓవైపు సంక్రాంతి సందడి, మ‌రోవైపు స్థానిక ఎన్నిక‌లు, వాటికి తోడుగా 20 రోజుల‌కు పైగా ఆందోళ‌న‌లు సాగించాల్సిన స్థితి రావ‌డంతో ప‌లువురు జారుకుంటున్నార‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగుదేశం నేత‌లు ఎలాంటి వ్యూహాలు ర‌చిస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశ‌మే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి