iDreamPost

నా కెరీర్‌లో అత్యంత విషాద సంఘటన : రోహిత్

నా కెరీర్‌లో అత్యంత విషాద సంఘటన : రోహిత్

భారత్-సౌత్ ఆఫ్రికాల మధ్య వన్డే సిరీస్ రద్దు కావడం, ఐపీఎల్ కూడా వాయిదా పడటం,దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలుతో భారత క్రికెటర్లు ఇంటికే పరిమితమయ్యారు.ఈ నేపథ్యంలో గురువారం భారత ఓపెనర్, తాత్కాలిక సారధి రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో లైవ్ చాట్ చేశారు.ఈ సందర్భంగా ఐపీఎల్ నిర్వహణపై ఉన్న అవకాశాల గురించి కెవిన్ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు రోహిత్ కోవిడ్-19 కారణంగా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక దశలో ఐపీఎల్ జరుగుతుందని సమాధానం ఇచ్చాడు.కెవిన్ మరో ప్రశ్నకు జవాబిస్తూ తన కెరీర్‌లో 2011 వన్డే వరల్డ్ కప్‌కు ఎంపిక కాకపోవడం విషాద సంఘటన అని బదులిచ్చాడు.ఈ ప్రపంచ కప్‌కు ముందు బ్యాటింగ్ ఫామ్ కోల్పోవడంతో తనను వరల్డ్ కప్‌కు ఎంపిక చేయలేదని రోహిత్ తెలిపాడు.

భారత గడ్డపై లిమిటెడ్ ఓవర్ల వరల్డ్ కప్-2011 జరిగిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ అభిమానుల 28 సంవత్సరాల నిరీక్షణకు తెర దించుతూ ధోనీ నాయకత్వంలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది.ఫైనల్ మ్యాచ్ తన సొంత మైదానం ముంబైలోనే జరిగిన విషయాన్ని శర్మ గుర్తుచేశాడు. అయితే ఈ ప్రపంచ కప్ తర్వాత భారత జట్టులో తిరిగి స్థానం సంపాదించిన రోహిత్ శర్మ అద్భుత బ్యాటింగ్‌తో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు.హిట్ మ్యాన్ 2015,2019 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరఫున పాల్గొన్నాడు.గత ఏడాది ఇంగ్లాండ్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఐదు సెంచరీలు సాధించి ప్రపంచ కప్‌లో అత్యధిక శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు.

ఐపీఎల్‌పై పీటర్సన్‌ సంధించిన మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐపీఎల్‌లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆడిన క్షణాలు తన జీవితంలో మధురమైన క్షణాలని తెలియజేశాడు.ఐపీఎల్-2013 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు నాయకత్వ బాధ్యతలు పాంటింగ్ నుంచి రోహిత్ స్వీకరించాడు.అతని కెప్టెన్సీలో ఆడిన ఏడు ఐపీఎల్ సీజన్‌లలో ముంబై ఇండియన్స్ నాలుగు సార్లు ఈ మెగా టోర్నీని గెలుపొందింది. ఐపీఎల్ టైటిల్‌ను అత్యధిక సార్లు గెలుపొందిన జట్టు కెప్టెన్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి