iDreamPost

వరద నీటిలో మునిగిపోయిన గ్రామం.. 1500 మంది ఏమయ్యారు!

వరద నీటిలో మునిగిపోయిన గ్రామం.. 1500 మంది ఏమయ్యారు!

భారీ వర్షాల కారణంగా తెలంగాణలో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ఊర్లను ఇప్పటికే వరద నీరు ముంచెత్తింది. ఈ నేపథ్యంలోనే భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చటంతో మొరంచపల్లి నీటిలో మునిగిపోయింది. దాదాపు 15 అడుగుల మేర వరద నీరు నిండుకుపోయింది. దీంతో ఇళ్లు, వాకిళ్లు నీటిలో మునిగిపోయాయి. ఇంట్లోని వస్తువులు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి.

ఇళ్లు నీటిలో మునిగిపోవటంతో జనం ఇళ్లపైకి ఎక్కేశారు. తమ జంతువుల్ని కూడా ఇళ్లపైకి తీసుకెళ్లిపోయారు. తాగు నీరు, తిండి లేక అల్లాడిపోతున్నారు. ఆ ఊర్లో మొత్తం 1500 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో పదుల సంఖ్యలో జనం నీటిలో కొట్టుకుపోయి చనిపోయినట్లు సమాచారం. అయితే, ఆ 1500 మందిలో ఎంత మంది క్షేమంగా ఉన్నారన్నది తెలియరావటం లేదు.  ఈ గ్రామ పరిస్థితిని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇక, సీఎం కేసీఆర్ సైతం గ్రామంలో పరిస్థితి గురించి ఆరా తీశారు.

కాగా, గ్రామంలో వరదలకు సంబంధించి ప్రస్తుతం ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో లారీలో ఇరుక్కుపోయిన వ్యక్తి ప్రాణ భయంతో ఒణికిపోతూ.. ‘‘ అన్న మొత్తం మునిగిపోయిందన్న బండి.. ఎవరైనా వస్తుర్రా.. మొత్తం మునిగిపోయిందన్న.. బండి కూడా కదులుతూ ఉందన్న. ఏదో ఒకటి చేయన్న.. ఆల్‌రెడీ ఊర్లో చాలా మంది చనిపోయారు. లోడ్‌ బండ్లు కాబట్టి.. గట్టి వాగు వచ్చినా ఆపుకుని ఉన్నాయి. ఉత్త బళ్లు అయితే ఈ పాటికి కొట్టుకుపోయేవి. డ్రైవర్లు బండి క్యాబిన్‌ మీదకు ఎక్కి కూర్చున్నారు. బండికి ఒకళ్లు ఉన్నారు. మొత్తం పది బళ్లు ఆగి ఉన్నాయి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి