iDreamPost

జగమంత కుటుంబం – సిరివెన్నెల తొలికిరణం

జగమంత కుటుంబం – సిరివెన్నెల తొలికిరణం

తెలుగు సినిమా సాహిత్యానికి కొత్త సొబగులు అద్ది పండితుల నుంచి పామరుల దాకా అందరినీ అలరించే గొప్ప గీత సంపదను అందించిన మహానుభావులు కొందరే ఉంటారు. ఆ ముందు వరుసలో ఉన్న వారిలో సీతారామశాస్త్రి గారిది అగ్రపీఠం. సిరివెన్నెలనే ఇంటి పేరుగా మార్చుకుని మూడు దశాబ్దాలకు పైగా అసంఖ్యాకమైన అభిమానులను, సంగీత ప్రియులను తన శిష్యులుగా మార్చుకున్న ఘనత ఆయనకే చెల్లుతుంది. కళామతల్లికి చేయాల్సిన సేవ ఎంతో ఉండగానే మనల్ని శోకసంద్రంలో ముంచెత్తుతూ స్వర్గానికేగడం మరువలేని విషాదం. ఇంకెన్నో పాటలకు ప్రాణప్రతిష్ట చేస్తారని చూస్తున్న తరుణంలో ఇలా జరగడం బాధాకరం.

సీతారామశాస్త్రిగారు భౌతికంగా లేకపోయినా ఆయన పాటలు నింగి నేల ఉన్నంత కాలం జీవించే ఉంటాయి. కొన్ని లక్షల మందికి స్ఫూర్తి పాఠాలు నేర్పిస్తూనే ఉంటాయి. అలాంటి సరస్వతి పుత్రుల చివరి జ్ఞాపకాలు ప్రత్యక్షంగా పంచుకునే మహా యజ్ఞం ఐడ్రీంకే దక్కడం పూర్వజన్మ సుకృతం. సంస్థ అధినేత చిన్నవాసుదేవరెడ్డి గారి మూడేళ్ళ నిర్విరామ కృషి ఫలించి గురువు గారు తను రచించిన వేల పాటల ప్రస్థానాన్ని సవివరంగా ప్రపంచానికి చెప్పే బృహత్కార్యానికి ఒప్పుకోవడం అదృష్టం. ఆ క్రతువు సంపూర్ణంగా పూర్తి కాకపోయినా చివరి రోజుల వరకు సిరివెన్నెల గారు పంచుకున్న ఎన్నో అద్భుత రసస్పందనలు ఇందులో చూడబోతున్నాం.

విధాత తలపున ప్రభవించిన ఈ లలిత ప్రియ కమలాలను పంచుకోవడానికి తన దరికి చేరలేని శిష్యుల కోసం ఎగసే అలకు లేనట్టే ఏ అలుపు లేకుండా సీతారామశాస్త్రి గారు ఎంతో ఓపిగ్గా ఒద్దికగా రచనా అనుభవాలను వివరించారు. ఇవి వర్తమాన రచయితల కోసమో ఆయన్ను అభిమానించే అశేష జనవాహిని కోసం మాత్రమే కాదు. భవిష్యత్ తరాలు ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప సాహితి సంపద గురించి తెలుసుకోవడం కోసం ఈ నిధిని ఇలా ముఖాముఖీ రూపంలో అందించడం జరుగుతుంది. ఆయన ప్రతి మాట అక్షరామృతం, ప్రతి పలుకు అద్వితీయం. అందుకుందాం, సీతారామశాస్త్రి గారి జ్ఞాపకాల్లో ఓలలాడుదాం. కొత్త ప్రయాణం మొదలుపెడదాం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి