ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచులకు పలువురు ప్రధాన ఆటగాళ్లను దూరం పెట్టింది. ఆసియా కప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను మొదటి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అలాగే తొలి రెండు వన్డేలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలకు రెస్ట్ ఇచ్చారు. ఈ రెండు మ్యాచులకు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మూడో మ్యాచ్‌లో కోహ్లీ, హార్దిక్ అందుబాటులో ఉంటారు. మూడో మ్యాచ్‌కు రోహిత్ తిరిగి జట్టు పగ్గాలు చేపడతాడు.
ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు ప్రకటించిన జట్టులో సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు. ఆసియా కప్‌లో గాయపడిన అక్షర్ పటేల్ ప్లేసులో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. వన్డే ప్రపంచ కప్ కోసం సెలెక్టర్లు ఇటీవల ప్రకటించిన 15 మంది సభ్యుల స్క్వాడ్‌లోనూ చాహల్‌కు చోటు దక్కని విషయం విదితమే. ఈ నేపథ్యంలో చాహల్‌ను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. అసలు చాహల్‌ను ఎందుకు సెలెక్ట్ చేయలేదనేది తనకు అర్థం కావడం లేదన్నాడు. టీమ్‌లో ఉండాల్సిన ప్లేయర్లలో చాహల్ ఒకడని.. టాలెంట్ పరంగా అతడు అద్భుతమన్నాడు భజ్జీ.
‘ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో చాహల్ ఉంటే బాగుండేది. అతడికి ఛాన్సులు మాత్రం ఇవ్వడం లేదు. ఎందుకిలా జరుగుతోందో కూడా అర్థం కావడం లేదు. చాహల్ ఎవరితోనైనా గొడవపడ్డాడేమో లేదా ఎవరితోనైనా ఏమైనా చెప్పాడా? అనేది తెలియడం లేదు. కేవలం మనం టాలెంట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం అతడు జట్టులో ఉండాల్సిన ఆటగాడు. కనీసం కంగారూలతో వన్డే సిరీస్లోకైనా చాహల్‌ను తీసుకుంటే బాగుండేది. చాలా మంది ప్లేయర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ఆసీస్‌ను ఓడించాలంటే బాగా కష్టపడాలి’ అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి: రజినీకి BCCI గోల్డెన్ టికెట్.. నెక్స్ట్ ఆ టాలీవుడ్ హీరోకేనా?