iDreamPost

లెక్క సరిపోయింది

లెక్క సరిపోయింది

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు విశాఖ, విజయనగరం పర్యటన జరగకపోవడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు అమితానందంతో ఉన్నాయి. అదీ చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరగడంతో లెక్క సరిపోయిందని వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రత్యేక హోదా కోసం 2017 జనవరి 26వ తేదీన సీఎం జగన్‌ విశాఖలో ర్యాలీ నిర్వహించతలపెట్టారు. ఆ కార్యక్రమం కోసం జగన్‌ హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ చేరుకున్నారు. అయితే ఎయిర్‌పోర్టు రన్‌వే మీదనే రాష్ట్ర పోలీసులు జగన్‌ను అడ్డుకున్నారు. అక్కడ నుంచి కనీసం లాంజి లోకి కూడా రానివ్వలేదు. పోలీసుల తీరుపై రన్‌వేపైనే బైఠాయించిన జగన్‌.. విధివిధానాలు వివరించినా బయటకు రానిచ్చేది లేదంటూ తిరిగి హైదరబాద్‌ పంపారు.

రోజులు గిర్రున తిరిగాయి. జగన్‌ సీఎం అయ్యాడు. బాబు ప్రతిపక్ష నేత అయ్యాడు. ఇప్పుడు బాబు వంతు వచ్చిందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. అప్పుడు తమ నేతను ఎయిర్‌పోర్టు రన్‌వేపైన ప్రభుత్వమే అడ్డుకుంటే.. నేడు చంద్రబాబును ఎయిర్‌ పోర్టు బయటకు రానిచ్చి మరీ ప్రజలు అడ్డుకున్నారంటున్నారు. ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండానే.. బాబుకు లెక్క సరిచేశారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

జగన్‌ను అడ్డుకున్న సమయంలో పోలీసులు సివిల్‌ డ్రెస్‌లలో వచ్చారు. ఎవరు పోలీసులో.. ఎవరు సాధారణ ప్రజలో కూడా తెలియడంలేదంటూ జగన్‌ ప్రశ్నించారు. అయినా ఆ నాడు జగన్‌ వేదన అరణ్యరోదనైంది. నేడు చంద్రబాబు కూడా నాడు జగన్‌ చెప్పిన మాటలే పలికారు. పోలీసులు యూనిఫాంలో వచ్చినా.. బ్యాడ్జి పెట్టుకుని రాలేదన్నారు.

చంద్రబాబు పర్యటన బ్రేక్‌ పడినందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆనందపడినా.. ఈ విధానం సరికాదని పరిశీలకులు చెబుతున్నారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేసిందని.. ఇప్పుడు ప్రజలు, ప్రజా సంఘాలు అడ్డుకున్నా కూడా జగన్‌ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడంలాగే ప్రజలకు కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు పర్యటనకు అడ్డంకులు లేకుండా చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు.

విశాఖ, విజయనగరం జిల్లాలో పర్యటన పెట్టుకున్న చంద్రబాబు తన ప్రజా చైతన్య యాత్రలో విశాఖ కార్యనిర్వాహక రాజధానిపై ఏం మాట్లాడతారు..? రాజధానిగా అమరావతే మంచిదని ఎలా సమర్థిస్తారు..? అనే విషయంపై ఓ క్లారిటీ వచ్చేదంటున్నారు.

ఎలాగూ చంద్రబాబు మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తారని, తద్వారా ఉత్తరాంధ్ర ప్రజల్లో చంద్రబాబుపై మరింత వ్యతిరేకత వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అది ఫైనల్‌గా అధికార పార్టీకే ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన సాగకపోవడం ద్వారా పరోక్షంగా టీడీపీకి లాభం చేకూరినట్లేనని అంచనా వేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి