iDreamPost

వెలిగొండ ప్రాజెక్టు… వైఎస్సార్‌ చొరవను గుర్తుచేసుకున్న మేకపాటి

వెలిగొండ ప్రాజెక్టు… వైఎస్సార్‌ చొరవను గుర్తుచేసుకున్న మేకపాటి

మనిషికి రక్తం ఎంత ముఖ్యమో, వ్యవసాయానికి సాగునీరు అంతే ముఖ్యం. రైతులు బాగుండాలేంటే వ్యవసాయం బాగుండాలి. వ్యవసాయం సాఫీగా సాగాలంటే నీరు ఉండాలి. నీరు లేనిదే వ్యవసాయం లేదు. ఈ పరిస్థితిని తన ప్రజాప్రస్థానం పాదయాత్రలో కళ్లారాచూసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులు కట్టేందుకు జలయజ్ఞం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి కేవలం మాటల దశలో ఉన్న అనేక ప్రాజెక్టులను, అసాధ్యం అని పూర్వ ముఖ్యమంత్రులు పక్కనబెట్టిన ప్రాజెక్టులను నిర్మించే సాహసోపేతమైన నిర్ణయాలను వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి తీసుకున్నారు. వైఎస్సార్‌ చొరవ ఫలితమే నేడు కనిపిస్తున్న పోలవరం ప్రాజెక్టు, ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు.

వెలిగొండ ప్రాజెక్టుపై వైఎస్సార్‌ చొరవ..

వెలిగొండ ప్రాజెక్టు విషయంలో వైఎస్సార్‌ ఎలాంటి చొరవ తీసుకున్నారనేది మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు. సోమవారం నెల్లూరులో జరిగిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి సంస్మరణ సభలో వెలిగొండ ప్రాజెక్టు ప్రస్తావన తెచ్చిన రాజమోహన్‌ రెడ్డి, ఎలాంటి పరిస్థితుల్లో వెలిగొండ ప్రాజెక్టు వైఎస్సార్‌ పునాది రాయి వేశారు, దానికి పేరు ఎలాపెట్టారు..? ఆ ప్రాజెక్టు వల్ల మేలు ఏమిటి అనే అంశాలను మేకపాటి రాజమోహన్‌ రెడ్డి గుర్తు చేసుకున్నారు.

2004లో మేకపాటి రాజమోహన్‌ రెడ్డి నరసారావుపేట లోక్‌సభ సభ్యుడుగా ఉన్నారు. ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మిత ప్రాంతం మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. నరసారావుపేట లోక్‌సభ పరిధిలోకి వచ్చే మార్కాపురంలో వెలిగొండ ప్రాజెక్టు అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పునాదిరాయి వేసే కార్యక్రమంలో తాను కూడా పాల్గొన్నానని మేకపాటి గుర్తు చేసుకున్నారు. అంతకుముందు వరకు వెలిగొండ ప్రాజెక్టు అసాధ్యమని ముఖ్యమంత్రులు పక్కనపెట్టారని, కానీ క్షామపీడత ప్రాంతాలకు మేలు చేసే ఆ ప్రాజెక్టుకు వైఎస్సార్‌ పునాదిరాయి వేశారని మేకపాటి గుర్తు చేసుకున్నారు.

ఈ ప్రాజెక్టు వల్ల ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం (మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం)తోపాటు నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, కడప జిల్లాలోని పోరుమామిళ్ల ప్రాంతాలకు మేలు జరుగుతుంది. ఈ ప్రాంతాలు అన్నీ క్షామపీడత, వర్షాభావ ప్రాంతాలని గుర్తుచేసిన మేకపాటి రాజమోహన్‌ రెడ్డి.. వెలిగొండ ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే సమయంలో.. నాడు వామపక్ష నేతలు ప్రాజెక్టుకు కమ్యూనిస్టు నేత, మాజీ ఎమ్మెల్యే పూలసుబ్బయ్య పేరు పెట్టాలని కోరగా.. వైఎస్సార్‌ అభ్యంతరం ఏమైనా ఉందా..? అంటూ తమవైపు చూశారని రాజమోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. తాము అభ్యంతరం ఏమీ లేదని చెప్పగా.. అక్కడికక్కడే ప్రాజెక్టుకు పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుగా నామకరణం చేశారని మేకపాటి గుర్తు చేసుకున్నారు. నాడు వైఎస్సార్‌ తలపెట్టిన ప్రాజెక్టు నేడు ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హయాంలో పూర్తికావాలని మేకపాటి ఆకాంక్షించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి