iDreamPost

హామీలు గుర్తుచేసే ముఖ్యమంత్రి గురించి విన్నారా..?

హామీలు గుర్తుచేసే ముఖ్యమంత్రి గురించి విన్నారా..?

రాజకీయపార్టీల అంతిమలక్ష్యం అధికారం సాధించడం. ఇందుకోసం ఆయా పార్టీల అధినేతలు ప్రజలకు అనేక హామీలు ఇస్తూ.. ఎన్నికల నాటికి వారి మద్ధతును కూడగడుతుంటారు. ప్రాంతాల వారీగా, వర్గాల వారీగా ఈ హామీలు ఉంటాయి. సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై కూడా పలు హామీలు ఉంటాయి. హామీలు ఇచ్చి ఓట్లు వేపించుకుని, ఆ పై అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా హామీలను అమలుచేసే నేతలు బహుఅరుదుగా ఉంటారు. ఎక్కువమంది ఇచ్చిన హామీలను మరిచిపోతుంటారు. ఎవరైనా గుర్తుచేసే ప్రయత్నం చేస్తే.. వారిపై గుడ్లురుముతారు. కన్నెర్ర చేసిన దాఖలాలు చూశాం.

పరిపాలనలో ప్రత్యేకత చాటుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి.. హామీల అమలులోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. తాను భిన్నమైన నేత అని సీఎం జగన్‌ తరచూ నిరూపించుకుంటున్నారు. ఎన్నికలకు ముందు హామీలు తీసుకున్న వారు.. ఇచ్చిన హామీలను ఆయా నేతలకు గుర్తు చేస్తూ.. ఎప్పుడు అమలు చేస్తారని అడిగే పరిస్థితులు ఇప్పటివరకు చూశాం. కానీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం తాను ఇచ్చిన హామీలను ప్రజల సమక్షంలోగుర్తు చేసుకుని, తప్పక అమలు చేస్తామని భరోసా ఇస్తున్నారు. శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పునరావాస కాలనీ అయిన ఇందుకూరు సభలో నిర్వాసితులతో మాట్లాడిన సీఎం జగన్‌.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నిర్వాసితులకు, భూములు కోల్పోయిన రైతులకు ఇస్తానన్న పరిహారం గురించి ప్రస్తావించి ఆశ్చర్యపరిచారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వివిధ సందర్భాల్లో పోలవరం నిర్వాసితులకు పరిహారం విషయంలో జగన్‌ హామీలు ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం వల్ల నిర్వాసితులు అవుతున్న కుటుంబాలకు కేంద్రం 6.86 లక్షల రూపాయలు ఇస్తోంది. నిర్వాసితుల త్యాగానికి ప్రతిఫలంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో మూడు లక్షల రూపాయలు ఇస్తామని,.. మొత్తంగా పదిలక్షల రూపాయలు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. నిర్వాసితులకు కేంద్రం నుంచి పరిహారం రావాల్సి ఉంది. ఈ విషయం ఇందుకూరు సభలో గుర్తుచేసిన సీఎం జగన్‌.. పదిలక్షల రూపాయలు తప్పకుండా ఇస్తామని చెప్పిన సమయంలో.. సభలో హర్షధ్వానాలు ధ్వనించాయి.

నిర్వాసితులకే కాదు.. భూములు ఇచ్చిన రైతులకు అదనంగా పరిహారం ఇస్తామని సీఎం జగన్‌ ఎన్నికలకు ముందు చెప్పారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 2006లో అప్పటి చట్టం ప్రకారం భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి లక్షన్నర రూపాయల చొప్పన పరిహారం ఇచ్చారు. వీరందరికీ మళ్లీ నూతన చట్టం ప్రకారం పరిహారం ఇస్తామని.. మొత్తంగా ఎకరానికి ఐదు లక్షల రూపాయలు అందిస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. లక్షన్నర రూపాయలు పోను.. మిగతా మూడున్నర లక్షల రూపాయలు తప్పకుండా ఇస్తామని సీఎం జగన్‌ మరోసారి ఇందుకూరు సభలో గుర్తుచేశారు. పోలవరం వల్ల సర్వస్వం కోల్పోతున్న నిర్వాసితులకు ఎంతచేసినా తక్కువనేన్న సీఎం జగన్‌.. వారి త్యాగానికి విలువకట్టలేమని అనడం అందరిని ఆలోచింపజేసింది. సీఎం మాటలు, హామీలు గుర్తు చేస్తూ.. వాటిని తప్పక అమలు చేస్తామని చెప్పడం నిర్వాసితుల్లో కొండంత ధైర్యాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి