iDreamPost

తాను చనిపోతూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిన కీర్తి

తాను చనిపోతూ.. ఏడుగురి జీవితాల్లో వెలుగు నింపిన కీర్తి

మృత్యువు ఏ రూపంలో కబళిస్తోందో ఎవ్వరూ ఊహించలేరు. అనుకోకుండా జరిగే ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తాయి. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన వారు ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు పడే వేధన వర్ణనాతీతంగా ఉంటుంది. ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్ లో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతురు ప్రమాదానికి గురై చనిపోవడంతో గుండెలవిసేలా రోదించారు. కానీ ఆ యువతి తాను చనిపోతూ కొందరికి ప్రాణం పోసి మరణాన్ని జయించింది. పుట్టెడు దుఖంలో ఉన్న ఆ యువతి తల్లిదండ్రులు అవయవదానానికి ఒప్పుకోవడంతో ఏడు మంది పేషెంట్లకు కొత్త జీవితాన్ని అందించినట్లైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఏపీలోని పిచ్చాటూరు మండలం రామాపురం గ్రామం ఎస్సీకాలనీకి చెందిన కీర్తి చెన్నైలో ఉద్యోగం చేస్తుంది. అయితే కీర్తికి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబందాలు చూస్తున్నారు. ఈ క్రమంలో గత ఆదివారం పెళ్లి చూపులు కూడా పూర్తయ్యాయి. అయితే ఇంతలోనే విధి ఆమెను వెంటాడింది. తమిళనాడులో తన ఫ్రెండ్ పెళ్లికోసం సోదరునితో కలిసి బైక్ పై వెళ్లి పెళ్లికి హాజరయ్యింది. పెళ్లి వేడుక ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కీర్తిని చెన్నైలోని ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడ పరీక్షించిన వైద్యులు ఆ యువతి బ్రెయిన్ డెడ్ కు గురైనట్లు నిర్దారించారు. ఇక ఆస్పత్రికి చేరుకున్న కీర్తి తల్లిదండ్రులు తమ కూతురు లేదని తెలిసి విలవిలలాడిపోయారు.

అయితే కీర్తి గతంలో తాను చనిపోతే తన అవయవాలను దానం చేయాలని చెప్పిన విషయం గుర్తు చేసుకున్న తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించారు. తమ కూతురి అవయవాలను పేద రోగులకు దానం చేయాలని కోరారు. ఇది విన్న అక్కడి వైద్యులు వారి గొప్ప మనసును అభినందించారు. వెంటనే కీర్తి శరీరంలోని అవయవాలను ఏడుగురికి అందించారు. తాను చనిపోతూ ఏడు మందికి ప్రాణం పోసిన కీర్తికి గౌరవం సమర్పించారు. ఇక త్వరలో పెళ్లి చేసి పంపించాల్సిన తమ కూతురు అర్థాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో కుమిలి కుమిలి ఏడ్చిన తీరు ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి