iDreamPost

నిమ్మగడ్డ వస్తే ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలవుతుందా ? ఎల్లోమీడియాలో కథనాలు

నిమ్మగడ్డ వస్తే ఎన్నికల ప్రక్రియ మళ్ళీ మొదలవుతుందా ? ఎల్లోమీడియాలో కథనాలు

రాష్ట్ర ఎన్నికల (మాజీ) కమీషనర్ నిమ్మగడ్డ బాధ్యతలు తీసుకుంటే స్ధానిక సంస్ధల ఎన్నికల ప్రక్రియ మొత్తం మళ్ళీ మొదలుపెడతాడా ? ఎల్లోమీడియాలో వచ్చిన కథనం ప్రకారమైతే అందరికీ ఇదే అనుమానం పెరుగుతోంది. ఎందుకంటే కేంద్రహోంశాఖకు నిమ్మగడ్డ పేరుతో వెళ్ళిన లేఖలో జరిగిన ఏకగ్రీవాలన్నీ ఒత్తిళ్ళ ద్వారానే జరిగినట్లు ఫిర్యాదు చేశాడు. పైగా 2014లో ఏకగ్రీవాలు ఎన్ని జరిగాయి, 2020లో జరిగిన ఏకగ్రీవాలెన్ని అంటూ లెక్కలను కూడా ఇచ్చాడు. అలాగే మొన్నటి ఎన్నికల సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలు తదితరులను బదిలీ చేస్తే ప్రభుత్వం అడ్డుకుందనే మంట కూడా నిమ్మగడ్డకు బాగా ఉందని ఎల్లోమీడియానే చెప్పింది.

తన అధికారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవటాన్ని నిమ్మగడ్డ సహించలేక పోతున్నట్లు చెప్పింది. తన సిఫారసులను ప్రభుత్వం అమలు చేయనపుడు జరిగిన ఏకగ్రీవాలను నిమ్మగడ్డ రద్దు చేసే అవకాశం ఉందని కథనం ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎల్లోమీడియా మొదటి నుండి ఇటు చంద్రబాబునాయుడు అటు నిమ్మగడ్డకు పూర్తిస్ధాయిలో మద్దతు పలుకుతోంది. అలాంటిది తన ఎన్నికల ప్రక్రియను మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉందని రాసిందంటే అనుమానించాల్సిందే.

ఎల్లోమీడియాలో వచ్చిందంటే చంద్రబాబు ఆలోచన అయినా అయ్యుండాలి. లేకపోతే నిమ్మగడ్డ-చంద్రబాబు మధ్య చర్చలన్నా జరిగుండాలి అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సరే ఆలోచన ఎవరిదైనా, ఆచరణ ఎవరిదైనా జరిగిన ఎన్నికల ప్రక్రియను నిమ్మగడ్డ రద్దు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ప్రచారమైతే ఊపందుకుంది. అదే జరిగితే ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారు చూస్తు ఊరుకోరు కదా ? వాళ్ళు వెంటనే ఎలక్షన్ కమీషన్ మీద కోర్టుకెళతారు. ఎలాగంటే వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇప్పటికే ఎన్నికల కమీషన్ గుర్తించింది, ప్రకటించింది కూడా. పైగా ఎన్నికల వాయిదా అంశంపై నిమ్మగడ్డ మాట్లాడుతూ జరిగిన ఏకగ్రీవాలన్నీ యధాతథంగా ఉంటాయని ప్రకటించాడు.

కాబట్టి నిమ్మగడ్డే తిరిగి బాధ్యతలను స్వీకరించినా జరిగిపోయిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేయటం అంత వీజీ కాదని గుర్తుంచుకోవాలి. కాకపోతే ప్రభుత్వంతో ఘర్షణ మరింతగా పెరుగుతుందంతే. అలాగే ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ఇచ్చిన లెక్కలు కూడా తప్పులే. 2014లో ఏకగ్రీవాలు పెద్దగా లేవన్న విషయం నిజమే. ఎందుకు లేవంటే అప్పట్లో టిడిపి, వైసిపి రెండూ ప్రతిపక్షంలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన నేపధ్యంలో జరిగిన ఎన్నికలు కాబట్టి రెండు బలమైన ప్రతిపక్షాలతో పాటు అధికార కాంగ్రెస్ కూడా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో గట్టిగా పోరాడింది. సాధారణ ఎన్నికలకు ముందు స్ధానిక సంస్ధలు జరగటం వల్లే ఏకగ్రీవాలకు ఏ పార్టీ కూడా ఒప్పుకోలేదు. అందుకనే అప్పట్లో ఏకగ్రీవాలు చాలా తక్కువయ్యాయి.

ఇక 2020లో ఏకగ్రీవాలంటారా ? ఎందుకు ఎక్కువగా జరిగాయో అందరికీ తెలుసు. ఎందుకంటే 2019లోనే వైసిపి అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చింది. వెంటనే స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగటంతో టిడిపి తరపున పోటి చేయటానికి చాలామంది ముందుకు రాలేదు. టిడిపి పరిస్ధితే ఇలాగుంటే ఇక మిగిలిన పార్టీల గురించి మాట్లాడుకోవటం కూడా దండగే. అందుకనే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో వైసిపి పక్షాన ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. నామినేషన్ల సందర్భంగా జరిగిన గొడవలు కూడా తక్కువనే చెప్పాలి. అయితే నిమ్మగడ్డ మాత్రం ఏకగ్రీవాలపై ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు నివేదిక ఇచ్చారనే అనుకోవాలి. చూద్దాం వివాదమంతా సుప్రింకోర్టుకు చేరింది కదా ఏమి జరుగుతుందో

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి