SNP
SNP
తొలి అంతర్జాతీయ మ్యాచ్, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాలి, పైగా ఇప్పటి వరకు ఆడని వెస్టిండీస్ గడ్డపై బ్యాటింగ్ చేయాలి.. ఇన్ని సవాళ్ల మధ్య టెస్టు క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన 21 ఏళ్ల యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్.. దుమ్ములేపాడు. మ్యాచ్ రెండో రోజు తర్వాత అందరితో జై..జై.. జైస్వాల్ అనిపించుకుంటున్నాడు. విండీస్ గడ్డపై డెబ్యూ చేస్తూ సెంచరీ బాదిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. టెస్టు క్రికెట్లో సరైన ఓపెనింగ్ పార్ట్నర్ లేక ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మకు.. ఒక ఆశాకిరణమై, రోహిత్, కోహ్లీ తర్వాత.. టీమిండియాకు ఫ్యూచర్ స్టార్‌గా కనిపిస్తున్నాడు.
అయితే.. జైస్వాల్ ఈ స్థాయికి అంత ఈజీగా చేరుకోలేదు.. అతని కెరీర్లో ఎన్నో కష్టాలు, ఆకలి బాధలు ఉన్నాయి. క్రికెట్ కోసం రోడ్డు పక్కన పానీపూరి బండిని కూడా నడపాల్సి వచ్చింది. ప్రస్తుతం టీమిండియా తొలి మ్యాచ్‌లోనే దుమ్ములేపిన జైస్వాల్ ఇంకా ఎంతో సాధించాల్సి ఉంది. అయితే.. ఇప్పటి వరకు అతను పడిన కష్టం, చేసిన కృషి, సాధించిన విజయం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. క్రికెట్ అభిమానుల నుంచి జేజేలు అందుకుంటున్న జైస్వాల్ సక్సెస్ స్టోరీ మీ కోసం..
యశస్వి జైస్వాల్ 2001 డిసెంబర్ 28న ఉత్తరప్రదేశ్‌లోని బదోహీలో కంచన్ జైస్వాల్-భూపేంద్ర జైస్వాల్ దంపతులకు జన్మించాడు. జైస్వాల్ పూర్తి పేరు యశస్వి భూపేంద్ర కుమార్ జైస్వాల్. ఆరుగురు సంతానంలో జైస్వాల్ నాలుగో వాడు. క్రికెట్‌పై చిన్నతనం నుంచే ఇష్టం పెంచుకున్న జైస్వాల్.. 11 ఏళ్ల వయసులోనే ముంబైకి వెళ్లిపోయాడు. కేవలం క్రికెట్ కోసం తల్లిదండ్రులను, తోబుట్టువులను వదిలేసి.. ఒక్కడే ముంబై చేరుకున్నాడు. అక్కడే క్రికెట్లో శిక్షణ తీసుకుంటూ.. ఎదిగాడు. అయితే.. ముంబైలో జైస్వాల్ చాలా కష్టాలు పడ్డాడు.
శిక్షణ కోసం, అలాగే వసతి, తిండి కోసం ఇంటి నుంచి పంపిచే డబ్బులు సరిపోక.. వేరే పనులు చేస్తూ మరీ, తన క్రికెట్ ట్రైనింగ్‌ను కొనసాగించాడు. కొన్ని సందర్భాల్లో ఆకలి కడుపుతోనే నిద్రపోయేవాడు. ఈ క్రమంలో ఆకలిని తట్టుకోలేక.. క్రికెట్‌ను వదులుకోలేక.. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రోడ్డు పక్కన పానీపూరి అమ్మే వ్యాపారి దగ్గర పనికి కుదిరి, పానీపూరి అమ్మేవాడు. ఇలా ఎంతో శ్రమిస్తూ.. క్రికెటే ప్రాణంగా బతుకుతున్న జైస్వాల్‌ను క్రికెట్ కోచ్ జ్వాలా సింగ్ గుర్తించారు. జైస్వాల్‌లోని క్రికెట్ టాలెంట్‌ను గుర్తించిన జ్వాలా సింగ్ అతన్ని చేరదీసి, చట్టపరంగా అతని సంరక్షకుడిగా మారారు.
ఇక అక్కడి నుంచి జైస్వాల్ వెనుదిరిగి చూడలేదు. 2015లో గైల్స్ షీల్డ్ మ్యాచ్‌లో అజేయంగా 319 పరుగులు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేసుకున్నాడు. 2018-19 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరపున లిస్ట్-ఏ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 17 ఏళ్ల వయసులో జార్ఖండ్‌పై 154 బంతుల్లో 203 పరుగులు చేసి, లిస్ట్-ఏ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండటంతో జైస్వాల్‌కు భారత అండర్ 19 టీమ్‌లో చోటు దక్కింది. అందులోనూ మేటి క్రికెటర్‌గా రాణించడంతో పాటు.. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో స్టార్ ఓపెనర్‌గా ఎదిగాడు.
2023 ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేయడంతో పాటు 14 మ్యాచ్‌ల్లో 625 పరుగులు చేసి సత్తా చాటాడు. దీంతో.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు సెలెక్టర్లు జైస్వాల్‌ను ఎంపిక చేశారు. వచ్చిన అద్భుత అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకున్న జైస్వాల్.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగి భారత క్రికెట్‌కు ఫ్యూచర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. తొలి టెస్ట్‌లో సాధించిన సెంచరీని తన తల్లిదండ్రులకు అంకితమిచ్చిన జైస్వాల్.. భవిష్యత్తులో మరెంతో సాధించాల్సింది ఉందన్ని అన్నాడు. జైస్వాల్ టీమిండియా తరఫున ఆడుతున్నది తొలి మ్యాచ్చే అయినప్పటికీ.. ఈ స్థాయికి చేరుకోవడానికి అతను చేసిన ప్రయాణం మాత్రం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తి దాయకం. మరి పానీపూరి టూ ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌గా ఎదుగుతున్న జైస్వాల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The moment Yashasvi Jaiswal reached his Test century on debut.
What a journey it has been, what a talent! The future of India. pic.twitter.com/XZpwDgtfTU
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 13, 2023
ఇదీ చదవండి: వీడియో: బూతులు తిడుతూ.. కోహ్లీకి జైస్వాల్ ఫిర్యాదు! గొడవేంటంటే?