Idream media
Idream media
టీవీ సీరియల్స్ వచ్చిన తర్వాత మహిళల సినిమాలు లేకుండా పోయాయి. ఒకప్పుడు మహిళా సినిమాలు అని ప్రత్యేకంగా పోస్టర్ మీద వేసేవాళ్లు. మగవాళ్లకు నచ్చితే ఒంటరిగా వస్తారు. లేదా ఫ్యామిలీతో వస్తారు. మహిళలకి నచ్చడంలో ఉన్న సౌలభ్యం ఏంటంటే వాళ్లు వీధిలో ఉన్న వాళ్లందరికి చెప్పి పిల్లాజెల్లా గొడ్డూగోదాతో సహా వస్తారు. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు ఎవరికీ మాట్లాడే తీరిక లేదు. ఒకవేళ మాట్లాడినా ఫోన్‌లోనే.
సీరియల్స్ లేనప్పుడు హాయిగా మాట్లాడుకునే వాళ్లు. కొట్లాడుకునేవాళ్లు. చిన్నప్పుడు మా వీధిలో ఎన్ని కొట్లాటలు చూశానో. భూతులు కూడా మామూలుగా ఉండేవి కావు. చాలా స్ర్టాంగ్ లాంగ్వేజి.
అసలే నీళ్లు లేని కరువు ఊళ్లలో పుట్టాం కదా, కుళాయి దగ్గర నీటియుద్ధాలు జరిగేవి. కావేరి జలాల పరిష్కారమైనా సాధ్యమేమో కానీ ఈ జగడాలు మాత్రం పరిష్కారమయ్యేవి కావు. కానీ ఉదయం కొట్లాడి సాయంత్రానికి “వదినా” అని కలసిపోయేవాళ్లు. అదో ముచ్చట.
రాయదుర్గంలో ప్యాలెస్ అనే థియేటర్ ఉంది (ఇంకా కూడా ఉంది). అక్కడ ఆడవాళ్ల నేల క్లాస్‌లో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి END వరకు సీటు కోసం కొట్టుకునేవాళ్లు. చాలాసార్లు వీళ్ల తిట్ల సినిమా డైలాగ్‌ల్ని డ్యామినేట్ చేసేవి.
మనుషులు మారాలి సినిమా వచ్చినపుడు థియేటర్ అంతా ఆడవాళ్ల కన్నీళ్లతో తడిసిపోయింది. ఈ సినిమా తర్వాత శారదని చూడాలంటేనే నాకు భయమేసేది. బిగ్‌బాస్ శివజ్యోతికి ఈమె అమ్మమ్మ. మాట్లాడుతూ ఏడ్చేది. ఏడుస్తూ మాట్లాడేది.
నాకు మామూలుగా ఫైటింగ్ సినిమాలు ఇష్టం. కానీ నన్ను బలవంతంగా ఈ సినిమాకి లాక్కెళ్లారు. కూచున్నప్పటి నుంచి చిర్రుబుర్రు సౌండ్స్. DTS ఎఫెక్ట్‌లో వెక్కిళ్ల శబ్దాలు. సీటు కోసం కొట్లాడుతూనే ఆడవాళ్లు సినిమా చూసేవాళ్లు. ఏకకాలంలో శోక రసం, భయానక రసం కలిసి భయానక శోకం.
ఏడిపించడంలో సావిత్రి కూడా చాలా సీనియర్. రక్తసంబంధం సినిమాలో గట్టిగానే ఏడిపించింది. ఇక స్క్రీన్‌పై సూర్యకాంతం వస్తే ఆడవాళ్లు మెటికలు విరుస్తూ చెడ్ల తిట్లు తిట్టేవాళ్లు. పార్వతమ్మ అనే ఒకావిడ ఉండేది. ఆమెను చూస్తే అందరికీ భయం. నోరు విప్పితే మగధీరులు కూడా పారిపోయేవాళ్లు. రియల్ లైఫ్ సూర్యకాంతం. ఆవిడ కూడా సూర్యకాంతంని తెగతిట్టేది.
సినిమాలు ఏడిపించడం మానేసినప్పటి నుంచి మహిళలు థియేటర్‌కి రావడం మానేశారు. ఆ పనిని టీవీలు నెత్తికెత్తుకున్నాయి. గృహమే కదా స్వర్గ సీమ అన్నారు. కానీ టీవీలు వచ్చి నరకసీమగా మార్చేశాయి.