iDreamPost

టెక్ దిగ్గజం విప్రో కీలక ప్రకటన.. వేలకోట్లతో ఏఐపై ఉద్యోగులకు శిక్షణ!

టెక్ దిగ్గజం విప్రో కీలక ప్రకటన.. వేలకోట్లతో ఏఐపై ఉద్యోగులకు శిక్షణ!

ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తోన్న పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ఇది టెక్నాలజీ రంగంలో పెను మార్పులను తీసుకొస్తుంది.  అందుకే ఏఐ గురించి పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఈ ఏఐ కారణంగా లాభాలు ఉన్నాయని కొందరు, నష్టం జరుగుతుందని మరికొందరు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలా చర్చలు ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు ఇప్పటికే ఏఐ వివిధ రంగాల్లో ఉద్యోగుల స్థానాల్ని భర్తీ చేసింది. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో కూడ  ఏఐ విషయంలో ఓ కీలక ప్రకటన చేసింది. తాము ఏఐపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు స్పష్టం చేసింది.

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు టెక్ రంగంలో తనదైన ముద్ర వేసింది విప్రో సంస్థ.  ఇప్పటికే ఏఐలను వివిధ రంగాల్లో వినియోగిస్తుండగా.. తాజాగా విప్రో కూడా అదే బాటలో వెళ్తోంది.  ఈక్రమంలోనే విప్రో ఓ కీలక ప్రకటన చేసింది. తాము ఏఐ360 సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు స్పష్టం చేసింది. రాబోయే మూడేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఒక బిలియన్ డాలర్లు..  మన కరెన్సీలో రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ఈ సంస్థలో మొత్తం 2.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

వచ్చే 12 నెలల్లో 2.5 లక్షల మంది ఉద్యోగులకు ఏఐ ఫండమెంటల్స్, బాధ్యతాయుతంగా ఏఐ వినియోంపై శిక్షణ అందిస్తామని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ స్థాయిల్లో కూడా ఏఐ వినియోగానికి సంబంధించిన కంపెనీ టీచింగ్ పాయింట్ ను రూపొందించనుంది. అలాగే హ్యాకథాన్స్ వంటి వాటిని కూడా నిర్వహించనుంది.  మరోవైపు విప్రో వెంచర్స్ ద్వారా ఆధునిక స్టార్టప్ లలో పెట్టుబడులు కూడా చేయడంతో పాటు జెన్ఏఐ సీడ్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ద్వారా జనరేటివ్ ఏఐ ఆధారిత స్టార్టప్ లకు ట్రైనింగ్ కల్పించనుంది.

ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక ఫాస్ట్ మూవింగ్ ఫీల్డ్ అని.. దీనిని తాము కూడా అందిపుచ్చుకునేందుకు చూస్తున్నట్లు విప్రో సీఈఓ థియరీ డెలపోర్టే  వివరించారు. ఏఐ ఆధారంగా ఉండే భవిష్యత్తు కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే జనరేటివ్ ఏఐ టూల్స్‌పై 25 వేల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌  ప్రకటించిన విషయం తెలిసిదేం. ఇలా టీసీఎస్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇప్పుడు విప్రో ఈ ప్రకటన చేయడం గమనార్హం. మరి.. విప్రో చేసిన ఈ కీలక ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి