iDreamPost

బాబు సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు?

బాబు సమావేశానికి ఎంతమంది ఎమ్మెల్యేలు హాజరవుతారు?

రాజ‌ధాని, రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధి అంశాల‌పై చ‌ర్చ కోసం ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాలు జ‌ర‌గ‌బోతున్నాయి. మూడు రోజుల ఈ స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని విప‌క్షం ఆశిస్తోంది. అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ కోసం గ‌త నెల రోజులుగా ఆయా గ్రామాల చుట్టూ ప్ర‌దిక్ష‌ణలు చేస్తున్న చంద్ర‌బాబు తాను స‌భ‌లో..మీరు బ‌య‌ట అంటూ జ‌నాల‌కు పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా ఆయ‌న త‌న పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేశారు. స‌భ‌లో పార్టీ నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని ఆదేశాల‌ను పంపించారు.

విప్ ని టీడీపీ త‌రుపున డీవీబీ స్వామి జారీ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలంద‌రికీ పంపించారు. అందులో వ‌ల్ల‌భనేని వంశీ, మ‌ద్దాలి గిరి కూడా ఉన్నారు. ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేలు ఇటీవ‌ల టీడీపీ అధినేత వైఖ‌రితో పార్టీకి దూర‌మ‌యిన సంగ‌తి తెలిసిందే. సీఎం జ‌గ‌న్ ని కూడా క‌లిసి వ‌చ్చారు. చివ‌ర‌కు స‌భ‌లో కూడా చంద్ర‌బాబుకి షాకిచ్చే రీతిలో వంశీ వ్య‌వ‌హ‌రించారు. ఈ ప‌రిణామాల‌తో ఆ ఇద్ద‌రూ ఎలా వ్య‌వ‌హ‌రిస్తారోన‌నే చ‌ర్చ మొద‌ల‌య్యింది.

కానీ తెలుగుదేశం పార్టీకి ఇక్క‌డ మ‌రో త‌ల‌నొప్పి ఉంది. ఇద్ద‌రు ఎమ్మెల్యేలు నేరుగా చంద్ర‌బాబుని త‌ప్పుబ‌ట్టిన వారు కాగా రాజ‌ధాని అంశంలో జ‌గ‌న్ ని స‌మ‌ర్థించే వారి సంఖ్య ఇంకా చాలా ఉంది. విశాఖ న‌గ‌రానికి చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు కొత్త రాజ‌ధాని ప్ర‌తిపాద‌న‌ను ఆహ్వానించారు. వారిలో గంటా శ్రీనివాస‌రావు మొద‌టి నుంచి విశాఖ ఉత్త‌మం అనే చెబుతున్నారు. గ‌ణ‌బాబు కూడా ఆయ‌న దారిలోనే ఉన్నారు. వాసుప‌ల్లి గ‌ణేష్ అదే మాట చెప్పిన‌ప్ప‌టికీ అమ‌రావ‌తి రైతుల‌కు కూడా న్యాయం జ‌ర‌గాల‌ని అంటున్నారు. వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు ది కూడా దాదాపు అదే వైఖ‌రి. ఈ న‌లుగురూ కూడా రాజ‌ధాని విష‌యంలో విప్ ని ఖాత‌రు చేస్తారా లేదా అన్న‌దే ఇప్పుడు టీడీపీ నేత‌ల‌కు అంతుబ‌ట్ట‌డం లేదు.

వారితో పాటుగా క‌ర‌ణం బ‌ల‌రాం స‌హా ప‌లువురు సీనియ‌ర్లు క‌నీసం రాజ‌ధాని విష‌యంలో ఒక్క‌సారి కూడా పెద‌వి విప్ప‌లేదు. ఇన్నాళ్లుగా చంద్ర‌బాబు ఆందోళ‌న చేస్తున్నా క‌నీస మ‌ద్ధ‌తు కూడా ప్ర‌క‌టించ‌లేదు. దాంతో అలాంటి నేత‌లంతా ఏం చేస్తార‌న్న‌దే అనుమానంగా ఉంది. విప్ జారీ చేసిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు టీడీపీకి అదే ముప్పు తెస్తుందా అనే ప్ర‌శ్న కూడా ఉద‌యిస్తోంది. ఈ ప‌రిణామాల‌ను ఎలా ఎదుర్కోవాల‌నే దానిపై చంద్ర‌బాబు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు స‌మాచారం. చివ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ క‌నీసం ఒక్క‌నాడ‌యినా అమ‌రావ‌తి వైపు క‌న్నెత్తి చూడ‌లేదు. కుటుంబ‌మంతా క‌దిలిన త‌రుణంలో ఆయ‌న ఎందుకు అలా చేశార‌న్న‌దే ప్ర‌శ్నార్థ‌కం. మొత్తంగా ఈ ప‌రిణామాలు స‌భ‌లో టీడీపీకి త‌ల‌వంపులు తీసుకొస్తాయా లేక త‌లెత్తుకునేలా చేస్తాయా అన్న‌దే స‌స్ఫెన్స్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి