iDreamPost

అధికార ప‌క్షంలో నైరాశ్యం ఎందుకు..?

అధికార ప‌క్షంలో నైరాశ్యం ఎందుకు..?

ఏపీలో అనూహ్య మెజార్టీ సాధించిన వైఎస్సార్సీపీ లో ఉత్సాహం నీరుగారిపోతుందా.. జ‌గ‌న్ వెంట న‌డిచిన శ్రేణులు ఇప్పుడు చ‌ల్ల‌బ‌డుతున్నాయా..స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఎదుర్కొని వెంట ఉన్న‌ వాళ్లు కూడా అధికారం వ‌చ్చిన త‌ర్వాత దూర‌మ‌వుతున్నారా..పార్టీ వ్య‌వ‌హారాలకు ప్రాధాన్య‌త త‌గ్గ‌డ‌మే కార‌ణ‌మా..లేక ఇత‌ర విష‌యాలేమ‌యినా ఉన్నాయా..ఇవే ప్ర‌శ్న‌లు ఇప్పుడు అధికార పార్టీలో మొద‌ల‌య్యాయి. వైఎస్సార్సీపీ కార్య‌క‌ర్త‌ల‌ను వేధిస్తున్నాయి. పార్టీ నాయ‌క‌త్వం తీరు ప‌ట్ల నైరాశ్యం క‌నిపిస్తోంది. నిన్నటి వ‌ర‌కూ పార్టీ కోసం ఎంత‌కైనా తెగించే తీరుతో వ్య‌వ‌హ‌రించిన వారు కూడా ఇప్పుడు పున‌రాలోచ‌న చేసుకోవాల్సిన ప‌రిస్థితి దాపురిస్తోంది. ఇది పార్టీకి శ్రేయ‌స్క‌రం కాద‌ని కొంద‌రు భావిస్తున్నారు. అయినా స‌రిదిద్దే ప్ర‌య‌త్నాలు మాత్రం ప్రారంభం కాక‌పోవ‌డం విశేషం.

క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌ల బ‌లంతోనే ముందుకు..!

జ‌గ‌న్ వెంట తొలినాళ్ల‌లో నాయ‌కుల క‌న్నా సాధార‌ణ కార్య‌క‌ర్త‌లే ఎక్కువ‌గా న‌డిచారు. సామ‌న్య ప్ర‌జ‌ల‌ను స‌మీక‌రించారు. ఆ త‌ర్వాతే ఒక్కొక్క‌రుగా వివిధ పార్టీల నేత‌లు జ‌గ‌న్ పంచ‌న చేరారు. ప్ర‌స్తుతం వైఎస్సార్సీపీ ప్ర‌భుత్వంలో , పార్టీలో కీల‌క పాత్ర పోషిస్తున్న నేత‌ల్లో అనేక మంది అంచెలంచెలుగా జ‌గ‌న్ తో చేరిన వారే. అంత‌కుముందు విమ‌ర్శ‌లు గుప్పించిన వారు కూడా ఉన్నారు. అయితే వారంద‌రిక‌న్నా ఆపార్టీకి బ‌లం, బ‌లంగా కార్య‌క‌ర్త‌లే. ఏపార్టీక‌యినా వారే మూలం. పునాది కూడా. అలాంటి కార్య‌క‌ర్త‌ల విష‌యంలో వైఎస్సార్సీపీ నేత‌ల తీరు స‌మ‌గ్రంగా క‌నిపించ‌డం లేద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. పార్టీ కోసం ఎన్నో క‌ష్టాల‌కు ఓర్చి నిల‌బ‌డిన వారికి త‌గిన ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌నే అభిప్రాయం పెరుగుతోంది. కార్య‌క‌ర్త‌ల మ‌నోభావాల‌ను నేత‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటున్న దాఖ‌లాలు లేవ‌నే వారి సంఖ్య ఎక్కువ‌గానే ఉంది.

అధికార పార్టీల‌లో ఇలాంటివి స‌హ‌జ‌మే..!

నిజానికి పాల‌క‌ప‌క్షాల్లో ఇలాంటి ప‌రిస్థితి చాలా స‌హ‌జం. ఏ పార్టీలో అయినా జ‌రిగేదే. అధికారం వ‌చ్చేటంత వ‌ర‌కూ అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డేది ఒక‌రైతే, ఆ త‌ర్వాత దానిని అనుభ‌వించేది మ‌రొక‌రు అన్న‌ట్టుగా ఉంటుంది. దాదాపుగా అన్ని చోట్లా ఇలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతూనే ఉంటుంది. అందుకు కార‌ణాలు కూడా లేక‌పోలేదు. అధికార పార్టీలో చేరిన కొత్త‌త‌రం నేత‌ల వెంట వచ్చే వారికే స‌హ‌జంగా ప్రాధాన్య‌త ద‌క్క‌డంతో ఆది నుంచి అధినేత‌ను న‌మ్ముకున్న అనేక మందికి అడియాశ‌లు త‌ప్ప‌వు. అయినా పార్టీ వెంట ఉండే కొంద‌రికి అవ‌కాశాలు వ‌స్తూ ఉంటాయి. ఇప్పుడు వైసీపీలో కూడా గ‌త ఎన్నిక‌ల‌కు ఒక‌టి, రెండేళ్ల ముందు చేరిన వారి హ‌వా సాగుతోంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ముందు నుంచి పార్టీ కోసం ప‌నిచేసిన వారి ప్రాభ‌వం త‌గ్గుతోంది. ఇక అధికారం ద‌క్కిన త‌ర్వాత కూడా పాల‌క శిబిరానికి చేరువ‌యిన వారి సంఖ్య కూడా త‌క్కువేం కాదు. అలాంటి కొంద‌రికి కూడా ప‌ద‌వులు, ఇత‌ర వ్య‌వ‌హారాల్లో ప్రాధాన్య‌త క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ కి, పార్టీకి వ్య‌తిరేకంగా ప‌నిచేసిన వారిలో కూడా కొంద‌రు ఇప్ప‌టికే ప‌ద‌వులు పొందుతున్నారు. అధినేత‌కు తెలిసి కొన్ని విష‌యాలు జ‌రుగుతుంటే, ఆయ‌న దృష్టిలో లేని విష‌యాలు కూడా చాలా ఉంటాయ‌న్న‌ది ఇలాంటి వ్య‌వ‌హారాలు తెలిసిన వారు చెబుతున్న విష‌యం.

అధినేత దృష్టి పెట్ట‌క‌పోవ‌డం కూడా కార‌ణ‌మే..!

అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత గ‌త ఎనిమిది నెలల్లో క‌నీసం కూడా పార్టీ ప‌రిస్థితి మీద దృష్టి పెడుతున్న‌ట్టుగా లేదు. అధికార వ్య‌వ‌హారాలు త‌ప్ప పార్టీ సంస్థాగ‌త వ్య‌వ‌హారాలు ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ది స్ప‌ష్టం. క‌నీసం ఒక్క సమీక్ష కూడా చేసింది లేదు. చివ‌ర‌కు స్థానిక ఎన్నిక‌ల విష‌యంలో కూడా జిల్లాల ఇన్ఛార్జుల‌కు బాధ్య‌త అప్ప‌గించ‌డ‌మే త‌ప్ప ఆయా జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితిని అధినేత ప‌ట్టించుకున్న‌ట్టుగా లేదు. అక్క‌డ‌క్క‌డా నేత‌ల మ‌ధ్య వ‌చ్చిన విబేధాల‌ను కూడా కీల‌క నేత‌ల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించి అధినేత చేతులు దులుపుకుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది. విష‌యం ముదిరితే త‌ప్ప ఆయ‌న ఖాత‌రు చేయ‌డం లేదు. దాంతో చివ‌ర‌కు జిల్లాల్లో కూడా పార్టీ ప‌రిస్థితిని స‌మీక్షించే నాథుడే లేదు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంద‌రు జిల్లా అధ్య‌క్షులుగా బాధ్య‌త‌ల్లో ఉన్నా లేన‌ట్టుగానే క‌నిపిస్తోంది. పార్ల‌మెంట‌రీ క‌మిటీలు వేసినా ప‌నిలో లేవు. ఇత‌ర క‌మిటీల ఫంక్ష‌నింగ్ జాడ కూడా లేదు. ఈ నేప‌థ్యంలో అధికార పార్టీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. అధినేత అవ‌స‌ర‌మైనంత స్థాయిలో దృష్టి పెట్ట‌క‌పోవ‌డంతో కింద స్థాయి నేత‌ల‌కు కూడా అలాంటి స్పృహ క‌నిపించ‌డం లేదు. చివ‌ర‌కు సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు పీకే టీమ్ చొర‌వ‌తో ఏర్ప‌డిన బూత్ క‌మిటీల నిర్వ‌హ‌ణ దాదాపుగా కొండెక్కింది.

అనుభ‌వాల నుంచి నేర్చుకోక‌పోతే..!

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యంలో కూడా భిన్న‌మైన ప‌రిస్థితి ఉండేది. ఆయ‌న జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయి నేత అయిన‌ప్ప‌టికీ త‌న ప‌రిధిలో పార్టీకి ఆయ‌న ప్రాధాన్య‌త‌నిచ్చేవారు. గాంధీ భ‌వ‌న్ వ్య‌వ‌హారాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించేవారు. కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌డ‌మే కాకుండా, పార్టీ వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించేవారు. కానీ జ‌గ‌న్ తీరు అందుకు భిన్నంగా ఉంది. చివ‌ర‌కు సొంత పార్టీ కార్యాల‌యానికి కూడా ఆయ‌న ప్రారంభోత్స‌వం నాడు త‌ప్ప మ‌ళ్లీ కాలు పెట్టిన దాఖ‌లాలే లేవు. కూత‌వేటు దూరంలో ఉన్న పార్టీ కార్యాల‌య వ్య‌వ‌హారాల‌నే ప‌ట్టించుకునే తీరికలేక‌పోతే ఇక పార్టీ ప‌రిస్థితి ఏమవుతుంద‌న్న‌దే ప్ర‌శ్న‌. ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా త‌న వెంట న‌డిచిన అనేక మందికి ఇప్పుడు ప్రోటోకాల్ రీత్యా నేరుగా క‌లిసే అవ‌కాశం లేదు. అలాంటి స‌మ‌యంలో వారి స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించడానికి వీలుండ‌దు. కాబ‌ట్టే వైఎస్సార్ జిల్లాల‌కు వెళ్లిన స‌మ‌యంలో కొంత స‌మ‌యం పార్టీ నేత‌ల‌కు కేటాయించేవారు. వారితో ముచ్చ‌టించే వారు. జ‌గ‌న్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కూ అలాంటి ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. అధికారిక కార్య‌క్ర‌మాల‌కు వెళ్లి రావ‌డ‌మే త‌ప్ప ఇత‌ర అంశాల‌ను ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు.

జిల్లా ప‌ర్య‌ట‌న‌ల్లోన‌యినా మార్పు రావాలి..

ఫిబ్ర‌వ‌రి నుంచి సీఎం జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళుతున్నారు. ఆయా జిల్లాల్లో వీల‌యినంత మేర‌కు పార్టీ వ్య‌వ‌హారాలు, పార్టీ శ్రేణుల‌కు కొంత స‌మ‌యం కేటాయించ‌డం అత్య‌వ‌స‌రంగా క‌నిపిస్తోంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్నంత కాలం ఆయ‌న మీద న‌మ్మ‌కంతో ప‌నిచేసిన వారికి ఉప‌శ‌మ‌నం ద‌క్కేలా వ్య‌వ‌హ‌రించాలి. అంద‌రికీ ప‌ద‌వులు, ఇత‌ర ప్ర‌యోజ‌నాలు పంచ‌డం సాధ్యం కాపోవ‌చ్చు గానీ నాయ‌కుడు త‌మ‌ను గుర్తించార‌నే అభిప్రాయం క‌లిగించాలి. అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక ఉండాలి. ప్ర‌భుత్వం చేప‌డుతున్న సంక్షేమ ప‌థ‌కాలు లేదా ఇత‌ర రాజ‌కీయ నిర్ణ‌యాలు అధికార‌యంత్రాంగంతో ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నం పూర్తిగా నెర‌వేరే అవ‌కాశం లేదు. వాలంటీర్ల వ్య‌వ‌స్థ కుదురుకోక‌పోవ‌డం, గ్రామ స‌చివాల‌యాలు ఇంకా పూర్తిగా ఆచ‌ర‌ణ‌లోకి రాక‌పోవ‌డం క‌నిపిస్తోంది. వారంతా పూర్తిగా ప‌నిలో దిగినా పార్టీ శ్రేణుల ద్వారా జ‌రిగే ప్ర‌య‌త్నానికి చాటి రావ‌న్న‌ది గుర్తించాలి. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను వారే తిప్పికొట్ట‌గ‌ల‌రు. కాబ‌ట్టి వారికి ప్రాధాన్య‌త ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని పార్టీ అధినేత గుర్తించాల్సి ఉంటుంది. గ‌తంలో వైఎస్సార్ అనుభ‌వాల‌ను గ‌మ‌నంలో ఉంచుకుని జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది.

వీల‌యినంత త్వ‌ర‌గా చ‌క్క‌దిద్దుకోవ‌డం శ్రేయ‌స్క‌రం

స‌మ‌స్య‌లు వ‌చ్చిన వెంట‌నే స‌ర్థుకుంటే న‌ష్టం స్వ‌ల్ప‌మే. కానీ దానిని జాప్యం చేస్తే క‌లిగే ముప్పు అంచ‌నా వేయ‌డం కూడా క‌ష్ట‌మే. ఇప్ప‌టికే ఏడాది కాలం గ‌డుస్తున్న నేప‌థ్యంలో వెంట‌నే పార్టీ వ్య‌వ‌హారాల విష‌యంలో అధికార పార్టీ ముఖ్య‌నేత‌ల తీరు మారాల్సి ఉంటుంది. అధినేత‌తో పాటుగా అంద‌రూ క‌దలాల్సి ఉంటుంది. జిల్లాలు, నియోజ‌వ‌క‌ర్గాల్లో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు స‌మ‌యం కేటాయించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేలు చూసుకుంటార‌నుకుంటే ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌కు నాయ‌క‌త్వం కార‌ణం అవుతుంది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితిని గాడిలో పెట్ట‌డం, కార్య‌క‌ర్త‌ల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం అత్య‌వ‌స‌రంగా వైఎస్సార్సీపీ భావిస్తేనే భ‌విష్య‌త్ ఆశించిన‌ట్టుగా ఉంటుంది. విప‌క్షంలో ఉన్నంత కాలం ఎంతో ఆశించిన వారికి క‌నీస ఊర‌ట క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌డం బాధ్య‌త‌గా గుర్తించాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి