iDreamPost

వర్ల రామయ్య అభ్యర్థిత్వంలో బాబు వ్యూహమేంటి?

వర్ల రామయ్య అభ్యర్థిత్వంలో బాబు వ్యూహమేంటి?

రాజకీయాల్లో అపర చాణక్యుడు అని చంద్రబాబు నాయుడుకి ఒక పేరుంది. ఆయన ఏది చేసినా, ప్రత్యేకించి రాజకీయాల్లో, చాలా లెక్కలు వేస్తారని, ఎత్తులు, పై ఎత్తులు వేస్తారని, ప్రత్యర్థిని చిత్తు చేస్తారని 1995 నుండి ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఒక భారీ స్టేచర్ ను ఆయనకు కట్టబెట్టింది.ఒకటి మాత్రం నిజం. ఆయన రాజకీయాలు తన తరం ఇతరనేతల రాజకీయాలకంటే భిన్నంగా ఉంటాయి. ఆ రాజకీయాలు పార్టీలో తన స్థానం మరింత పదిలపర్చుకునే దిశగా ఉంటాయి.

ఒకప్పుడు దగ్గుబాటిని, నందమూరి కుటుంబాన్ని, ప్రత్యేకించి హరికృష్ణను ఇలానే తనకు అనుకూలంగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఒక దశలో జూనియర్ ఎన్టీఆర్ ను ఇదే స్థాయిలో వినియోగించుకున్నారు. నిన్న మొన్న తెలంగాణ ఎన్నికల్లో హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూడా ఇదే పద్దతిలో తన రాజకీయాల కోసం వినియోగించారు.

ఇప్పుడు తాజాగా పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య వంతు వచ్చింది. వర్ల రామయ్యను పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించి రాష్ట్రంలో ఏకగ్రీవం కావాల్సిన రాజ్యసభ ఎన్నికలను పోలింగ్ వైపు నడిపిస్తున్నారు.

వాస్తవానికి పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునే బలం టీడీపీకి లేదు. కేవలం ఒక అభ్యర్థిని నిలబెట్టగలిగే సంఖ్యాబలం తప్ప విజయం సాధించే బలం లేదు. ఇప్పటి ఎన్నికల్లో మొత్తం 175 మంది శాసన సభ్యుల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలంటే కనీసం 44 మంది సభ్యులు అవసరం. ఈ సంఖ్యకు సరిగ్గా సగం మంది శాసన సభ్యులతో తన పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టడంలో చంద్రబాబు చాణక్యం ప్రదర్శించారని ఆయనను అభిమానించేవారు చెప్పుకుంటారు. వాస్తవానికి చంద్రబాబు అభిమానులు చెప్పేటంతటి రాజకీయ చాణిక్యం ఆయన చూపిన సందర్భాలు కనపడవు.. “అధికారం” ఉంటేనే ఆయన వ్యూహాలు పనిచేసేది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనకు కావలసింది గెలుపు కాదు. ఒక చర్చ.. దానికి ఒక త్యాగజీవిలాంటి నాయకుడు కావాలి.. ఆయనే వర్ల రామయ్య. మొన్నటి వరకు బీసీలకు అన్యాయం చేసిన జగన్ అని ప్రచారం చేసిన చంద్రబాబు నాలుగు రాజ్యసభ స్థానాలలో ఇద్దరు బీసీ నేతలకు జగన్ అవకాశం ఇవ్వటంతో చంద్రబాబు దళిత వ్యూహాన్ని ముందుకు తీసుకొచ్చాడు. శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన పిల్లి సుభాష్ మరియు మోపిదేవి రమణలను మంత్రివర్గంలోకి తీసుకున్న జగన్, శాసనమండలి రద్దు నిర్ణయంతో వారిని ఏకంగా రాజ్యసభకు పంపిస్తుండటం బీసీ వర్గాలలో జగన్ పట్ల సానుకూలతను పెంచింది. ఈ క్రమంలో బీసీ వాదం పేరుతో జగన్ మీద విమర్శలు చేస్తే ఉపయోగం ఉండదనే చంద్రబాబు కొత్తగా దళిత కోణం ఎత్తుకోబోతున్నాడు…

ఎప్పుడో 2018లో వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వాల్సి ఉంది. అప్పుడే చంద్రబాబు రామయ్యకు హామీ ఇచ్చారు. ఒకరకంగా వర్ల రామయ్య తాను రాజ్యసభ సభ్యుడు అయినట్టే భావించి చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పేందుకు కుటుంబసభ్యులతో కలిసి బయలు దేరారు. సరిగ్గా ప్రకాశం బ్యారేజ్ దాటే సమయంలో చంద్రబాబు కార్యాలయం నుండి వచ్చిన ఒక ఫోన్ కాల్ రామయ్య ఆశల పాలపొంగు పై నీళ్ళు చల్లింది. రాజ్యసభ సీటు అలా చివరి నిమిషంలో చేజారింది. ఇప్పుడు వర్ల రామయ్యను రాజ్యసభ బరిలో దింపిన చంద్రబాబు ఎన్నికయ్యే అవకాశం ఉన్న రోజుల్లో రాజ్యసభకు కాదుకదా ఆయన్ను కనీసం ఎమ్మెల్సీ ని కూడా చేయకపోవటం వలన దళిత వర్గాలు చంద్రబాబు వాదనను పట్టించుకోవటం లేదు.

చంద్రబాబు హయాంలో గడచిన ఐదేళ్ళలో మూడు సార్లు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఈ మూడు ఎన్నికల్లో సంఖ్యాబలాన్ని బట్టి టీడీపీ ఆరు స్థానాలు గెలుచుకుంది. 2014లో ఒకటి, 2016లో మూడు చివరిగా 2018లో రెండు స్థానాలు టీడీపీ గెలుచుకుంది. వీటిలో ఏ ఒక్క ఎన్నికలోనూ వర్ల రామయ్యకు అవకాశం కల్పించలేదు. ఇవన్నీ తగిన సంఖ్యాబలం ఉండి టీడీపీ ఖచ్చితంగా గెలుచుకున్న స్థానాలు.

ఈ మూడు ఎన్నికల్లో మొత్తం ఇద్దరు దళిత నేతలను చివరి వరకు ఆశావహులుగా నిలబెట్టి చివరి క్షణంలో రిక్తహస్తం చూపారు . మొదట మాజీ మంత్రి జె ఆర్ పుష్పరాజ్, ఆ తర్వాత వర్ల రామయ్య. ఒకానొక సందర్భంలో అంటే 2018లో టీడీపీ ముగ్గురు సభ్యులను గెలుచుకునే అవకాశం ఉన్న సమయంలో ప్రతిభా భారతిని కూడా ఆశావహుల బరిలోకి దింపి చివరకు వేరు లెక్కలు చెప్పారు.

ఈ ఎన్నికల్లో ఆయన అభిమానులు రాజకీయ వ్యూహకర్తను, అపర చాణిక్యుణ్ణి చూస్తే ప్రత్యర్ధులు మాత్రం ఆయనలోని దళిత వ్యతిరేకిని చూశారు. పార్టీ ఖచ్చితంగా గెలవగలిగిన ప్రతి ఎన్నికలో ఒక్క దళితుడికి కూడా చంద్రబాబు అవకాశం కల్పించలేదు. మొదట 2014లో తెలంగాణ నుండి మోత్కుపల్లి నర్సింహులుకు చివరి నిమిషం వరకు ఆశ కల్పించి సమీకరణ పేరుతో ఆఖరి క్షణంలో వ్యూహం మార్చుకున్నారు. చంద్రబాబు ఆ ఎన్నికల్లో వరంగల్ కు చెందిన గరికపాటి మోహన్ రావ్ ను రాజ్యసభకు పంపించాడు. గరికపాటి మోహన్ రావ్ కులం మీద జరిగిన చర్చను పక్కదారి పట్టించటానికే మోత్కుపల్లికి గవర్నర్ గిరి అంటూ ప్రచారం చేయించారు. ఈ ఆశతో 2019 ఎన్నికల వరకు మోత్కుపల్లి ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు కావలసింది విజయం కాదు. విజయానికి సరిపడిన సంఖ్యాబలం కూడా లేదు. ఆయనకు కావలసింది తన అభ్యర్థి వర్ల రామయ్య గెలుపు కాదు. ఒక దళితుడైన వర్ల రామయ్యను జగన్మోహన్ రెడ్డి పట్టుబట్టి ఓడించాడు అని చెప్పేందుకు అవకాశం. తాను రాజ్యసభ అభ్యర్థిగా ఒక దళితుణ్ణి నిలబెడితే జగన్మోహన్ రెడ్డి దళితుడిని ఓడించాడు అని చెప్పే అవకాశం కోసం చంద్రబాబు ఎదురు చూస్తున్నాడు .

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక్క దళితుడిని కూడా జగన్మోహన్ రెడ్డి పోటీకి దింపలేదు. నాలుగు స్థానాల్లో రెండు బీసీలకు, ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి, నాలుగోది రాష్ట్రేతరునికి ఇచ్చి దళితులకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేశారు అని చెప్పే అవకాశం కోసం మాత్రమే చంద్రబాబు వర్ల రామయ్యను బరిలోకి దింపారు. రేపటి నుండి చంద్రబాబు ప్రచారం ఈ అంశంపైనే ఉండబోతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆ అంశమే ప్రధానంగా వినిపించబోతున్నారు. ఆయనను సమర్ధించే మీడియా కూడా ఈ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతోంది. అయితే, ఈ వ్యూహం ఎంతమేరకు చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తుందో చూడాలి.

ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్న వర్ల రామయ్య ఆత్మప్రభోధం ప్రకారం ఓటు వెయ్యమని వైసీపీ దళిత ఎమ్మెల్యేలను అడగటం అత్యంత హాస్యాస్పదం … టీడీపీ ఎమ్మెలేలు ఎన్నిసార్లు ఆత్మప్రభోధం ప్రకారం ఎదుటిపార్టీ అభ్యర్థులకు ఓటువేశారో చెప్పి ఇప్పుడు తనకు ఆత్మాప్రబోధం ప్రకారము ఓటువేయమని వర్ల రామయ్య అడగాలి.

ఆత్మప్రబోధం ప్రకారం ఓటు వెయ్యమని అడుగుతున్న వర్ల రామయ్య ,రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ ఇవ్వవద్దని ఆ విధంగా వారికి కూడా ఆత్మ ప్రభోదం ప్రకారం ఓటేసే అవకాశం కల్పించమని చంద్రబాబుకు చెప్పాలి. దాన్ని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించాలి.. అప్పుడు చంద్రబాబు చాణుక్యమో \, వర్ల ఆత్మప్రబోధమో తేలుతుంది.

చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చిన తరువాత 1995-2018 మధ్య టీడీపీ తరుపున 30 మంది రాజ్యసభకు ఎన్నికయ్యారు.. వీరిలో కేవలం ఒకే ఒక దళిత నేత రాజ్యసభకు ఎన్నికయ్యారు… దళితనేతల్లో సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే ఆకారపు సుదర్శన్ను మాత్రమే చంద్రబాబు ఈ పాతిక సంవత్సరాలలో రాజ్యసభకు పంపాడు. సుదర్శన్ 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు…

ధాటిగా మాట్లాడే వర్ల రామయ్య మాట మీడియాలో చెల్లోచ్చుకాని ఈ చరిత్ర తెలిసిన వారెవరు ఆయన ఆత్మగౌరవ , ఆత్మా ప్రబోధ వాదాన్ని అంగీకరించరు .

వర్ల రామయ్యను రాజ్యసభకు పోటీచేయించడం కేవలం టీడీపీతో విభేదించిన ముగ్గురు ఎమ్మెల్యేల మీద విప్ ధిక్కరణ కింద చర్యలు తీసుకోమని . మరో రాజకీయ పోరాటం చేయటానికే !… ఇంతకన్నా రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు వ్యూహం ఏమి లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి