iDreamPost
android-app
ios-app

42 సార్లు రంజీ విజేతగా ముంబై! వాళ్లే ఇన్నిసార్లు గెలవడానికి కారణం?

  • Published Mar 15, 2024 | 10:37 AM Updated Updated Mar 15, 2024 | 10:37 AM

Mumbai, Ranji Trophy: విదర్భతో జరిగిన రంజీ సీజన్‌ 2023-24 ఫైనల్లో ముంబై విజయం సాధించింది. ఈ గెలుపుతో 42వ రంజీ టైటిల్‌ను ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 90 రంజీ సీజన్లు జరిగితే.. 42 సార్లు ముంబై గెలవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

Mumbai, Ranji Trophy: విదర్భతో జరిగిన రంజీ సీజన్‌ 2023-24 ఫైనల్లో ముంబై విజయం సాధించింది. ఈ గెలుపుతో 42వ రంజీ టైటిల్‌ను ముంబై జట్టు కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 90 రంజీ సీజన్లు జరిగితే.. 42 సార్లు ముంబై గెలవడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 15, 2024 | 10:37 AMUpdated Mar 15, 2024 | 10:37 AM
42 సార్లు రంజీ విజేతగా ముంబై! వాళ్లే ఇన్నిసార్లు గెలవడానికి కారణం?

2023-24 రంజీ సీజన్‌లో ముంబై జట్టు విజేతగా నిలిచింది. అజింక్యా రహానె కెప్టెన్సీలో ఛాంపియన్‌గా అవతరించిన ముంబై.. ఈ నెల 10న విదర్భ జట్టుతో మొదలైన ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి.. ఏకంగా 42వ సారి రంజీ ట్రోఫీ గెలిచింది. ముషీర్‌ ఖాన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అజింక్యా రహానె రెండో ఇన్నింగ్స్‌లో అద్భుతంగా ఆడటంతో ముంబైకి విజయం సొంతమైంది. అయితే.. కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఒకే టీమ్‌ ఇన్నిసార్లు ఎలా విజేతగా నిలవడం విశేషం. 38 జట్లు పాల్గొంటున్న ఈ ట్రోఫీలో మిగతా జట్లలో ఏ ఒక్కటి కూడా కనీసం 9 సార్లు కూడా టైటిల్‌ గెలవలేదు.. ముంబై ఒక్క జట్టే 42 ఏళ్లు ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది.

దేశవాళి క్రికెట్‌లో ఎంతో ప్రతిష్టత్మకమైన రంజీ ట్రోఫీలో ముంబై తిరుగులేని ఆధిపత్యం మొదటి నుంచి ప్రదర్శిస్తూ వస్తుంది. ముంబై జట్టు నుంచే ఎంతో మంది దేశం గర్వించే క్రికెటర్లు పుట్టుకొచ్చారు. సచిన్‌ టెండూల్కర్‌, సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, జహీర్‌ ఖాన్‌, అజిత్‌ అగార్కర్‌, వినోద్‌ కాంబ్లీ, రోహిత్‌ శర్మ, అజింక్యా రహానె. వీరితో పాటు ఇంకా చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లు ముంబై నుంచి వచ్చి టీమిండియాకు ఆడి.. ఇండియన్‌ క్రికెట్‌ కీర్తిని మరింత పెంచారు. అలాగే యువ క్రికెటర్లు సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, పృథ్వీ షా కూడా ముంబైకి ఆడిన వారే. దేశవాళి క్రికెట్‌లో మరీ ముఖ్యంగా రంజీలో ముంబై అంత స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే.. ఇంత మంది స్టార్‌ ప్లేయర్లను భారత జాతీయ జట్టుకు అందిచగలిగింది.

రంజీలో ముంబై ప్రస్థానం..
స్వాతంత్రం రాకముందు నుంచే రంజీ ట్రోఫీ జరుగుతుంది. మొట్టమొదటి రంజీ సీజన్‌ 1934లో మొదలైంది. 1934-35 తొలి రంజీ సీజన్‌లో ముంబై జట్టే విజేతగా నిలిచింది. అప్పట్లో బాంబే జట్టుగా నిలిచేవారు. బాంబే క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ టీమ్‌ ఆడేది. రంజీల్లో ముంబైకి మొట్టమొదటి కెప్టెన్‌గా విజయ్‌ మర్చంట్‌ వ్యవహరించారు. అయితే.. రంజీ సీజన్‌ ప్రారంభానికి ముందు నుంచే బాంబే క్రికెట్‌ అసోసియేషన్‌ ఉంది.

ముంబైలో మొట్టమొదటి క్రికెట్ మ్యాచ్ 1797లో మిలిటరీ ఎలెవన్- ఐలాండ్‌ ఎలెవన్‌ జట్ల మధ్య జరిగింది. ముంబైకి చెందిన సంపన్న పార్సీలు 1848లో స్వల్పకాలిక ఓరియంట్ క్రికెట్ క్లబ్‌ను స్థాపించారు. అలాగే 1850లో యంగ్‌ జొరాస్ట్రియన్ క్లబ్ స్థాపించారు. అది ఇప్పటికీ ఉంది. 1866లో బొంబాయి యూనియన్ హిందూ క్లబ్ స్థాపించబడింది. 1884లో సర్ డోరబ్జీ టాటా పార్సీ జింఖానాను ఏర్పాటు చేశారు. 1886లోనే ఆల్ పార్సి టీం ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లింది. 1888లో కూడా రెండో సారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది.

Mumbai 90 seasons in ranji trophy 42 times win

భారతదేశంలో మొదటి ఫస్ట్-క్లాస్ క్రికెట్ మ్యాచ్‌ 1892లో జరిగింది. బొంబాయి లార్డ్ హారిస్ గవర్నర్ ఆధీనంలో ఉన్న బొంబాయి టోర్నమెంట్‌లో.. మొదట పార్సీ టీమ్‌, యూరోపియన్‌ టీమ్‌లు ఆడేవి. తర్వాత హిందువుల టీమ్‌ వచ్చి చేరింది. 1912లో మొహమ్మదీయన్‌ జింఖానా ముస్లింల టీమ్‌ను ఆహ్వానించడంతో నాలుగు టీమ్స్‌ మధ్య టోర్నమెంట్‌ జరిగేది. 1937లో ‘రెస్ట్’గా పేరు పెట్టిన ఐదో టీమ్‌ను టోర్నమెంట్‌లో చేర్చారు. ఈ టీమ్‌లో బౌద్ధులు, యూదులు, భారతీయ క్రైస్తవులు ఉండేవారు. 1946లో బీసీసీఐ(బోర్డ్‌ ఆఫ్‌ కంట్రోల్‌ ఫర్‌ క్రికెట్‌ ఇన్‌ ఇండియా) ఈ ఐదు టీమ్స్‌ టోర్నమెంట్‌ స్థానంలో జోనల్ టోర్నీని తీసుకొచ్చింది. ఇండియాలోని అనేక ప్రాంతాల నుంచి ఈ టోర్నీలో జట్లు పాల్గొన్నాయి.

అంతకంటే ముందు.. బొంబాయిలోని పార్సీ, హిందూ, ముస్లిం, బాంబే జింఖానా టీమ్స్‌ కలిసి 1928 ఆగస్టు 6న సమావేశమై బొంబాయి ప్రెసిడెన్సీలో క్రికెట్‌ బోర్డు ఏర్పాటు గురించి చర్చించాయి. 1928 అక్టోబర్ 6న ‘బొంబాయి ప్రెసిడెన్సీ క్రికెట్ అసోసియేషన్’ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఈ అసోసియేషన్‌లో మరికొన్ని టీమ్స్‌ చేరాయి. కానీ, 1934లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్.. బాంబే ప్రెసిడెన్సీ క్రికెట్ అసోసియేషన్ నుంచి విడిపోయి.. బీసీసీఐలో చేరేందుకు నిర్ణయించుకున్నాయి. ఆ తర్వాత ‘బాంబే ప్రెసిడెన్సీ క్రికెట్ అసోసియేషన్’.. ‘బాంబే క్రికెట్ అసోసియేషన్’గా పేరు మార్చుకుంది. 1934-35లో జరిగిన తొలి రంజీ సీజన్‌లో బాంబై క్రికెట్‌ అసోసియేషన్‌ జట్టు విజయం సాధించింది.

ఇలా 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి ముంబై క్రికెట్‌ అసోసియేషన్ రంజీ ట్రోఫీలో తమ ఆధిపత్యం చాటింది. 1934-35లో మొట్టమొదటి రంజీ ట్రోఫీ పోటీని గెలుచుకుంది. నార్త్‌ఇండియాతో జరిగిన ఫైనల్‌లో విజయ్ మర్చంట్ కెప్టెన్సీలో ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. రంజీ రెండో సీజన్‌లో కూడా ముంబై జట్టే ఛాంపియన్‌గా నిలిచింది. మద్రాస్‌తో జరిగిన ఫైనల్‌లో విజయంతో వరుసగా రెండో సారి విజేతలుగా నిలిచారు. రంజీ ట్రోఫీ మొదటి 20 సీజన్లలో 7 సార్లు ముంబై జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. 1948-49 రంజీ సీజన్‌లో మహారాష్ట్రతో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై జట్టు చరిత్ర సృష్టించింది. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 600కి పైగా పరుగులు చేసింది. ఇలా ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 600 ప్లస్‌ రన్స్‌ చేసిన ఏకైక టీమ్‌ ముంబై. ఆ రికార్డ్‌ ఇప్పటికీ అలాగే పదిలంగా ఉంది.

Mumbai 90 seasons in ranji trophy 42 times win

1955 నుంచి 1977 మధ్య 22 రంజీ సీజన్లు జరిగితే అందులో ముంబై జట్టు ఏకంగా 20 సార్లు కప్పు కొట్టింది. అందులోనూ మరి ముఖ్యంగా 1958-59 సీజన్‌ నుంచి 1972-73 సీజన్‌ వరకు వరుసగా 15 టైటిల్స్ ముంబై ఖాతాలోకే వెళ్లాయి. రంజీలో ఇది ముంబై గోల్డెన్‌ పిరియడ్‌గా చెప్పుకోవచ్చు. కానీ, ఆ తర్వాత ముంబై ఆధిపత్యం కాస్త తగ్గింది. 1980ల్లో వరుసగా ఐదు సీజన్లలో ముంబై ఫైనల్స్‌కు చేరలేదు. మళ్లీ 1990ల్లో ముంబై జట్టు పూర్వవైభవాన్ని తిరిగి పొందింది. 1993-94 నుంచి 2003-04 సీజన్ల మధ్య 6 రంజీ ట్రోఫీలను గెలుచుకుంది.

2006-07 రంజీ సీజన్‌లో గెలిచి ముంబై 37వ రంజీ ట్రోఫీని సాధించింది. ఈ సీజన్‌ ముంబై రంజీ చరిత్రో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే.. ఆ సీజన్‌లో ముంబై తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైనా.. తిరిగి పుంజుకుని ఫైనల్లో బెంగాల్‌ జట్టును ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. కేవలం రంజీల్లోనే కాదు.. ఇతర దేశవాళి టోర్నీల్లో కూడా ముంబై జట్టు మంచి విజయాలు సాధించింది. ఇప్పటి వరకు 15 ఇరానీ కప్‌లు, 8 విల్స్‌ కప​్‌లు, విజయ్‌ హజారే ట్రోఫీ 8 సార్లు, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ ఒక సారి నెగ్గింది. ఇంత చరిత్ర ఉన్న ముంబై జట్టు.. భారత జాతీయ జట్టుకు ఎంతో మంది స్టార్‌ క్రికెటర్లను ఇచ్చింది.

ముంబై మాత్రమే ఎందుకింత సక్సెస్‌ అయింది?
మన దేశం సుమారు 200 ఏళ్ల పాటు బ్రిటీష్‌ పాలనలో ఉన్న విషయం తెలిసిందే. 1947కి ముందు బ్రిటీషర్లు భారత దేశంలో ఎక్కువ భూభాగాన్ని పాలించారు. ఆ సమయంలో వారు సరదాగా ఆడుకునే క్రికెట్‌ను ఇండియాలో కూడా ఆడేవారు. ఆంగ్లేయులతో కలిసి.. ఇండియాలోని సంపన్నులు, రాజకుంటుంబాలకు చెందిన వారు కూడా ఈ క్రికెట్‌ ఆడటం ప్రారంభించారు. అలా అలా ఇండియాలో క్రికెట్‌ వ్యాపించింది. అయితే.. ఇండియాకు ముంబై ఆర్థిక రాజధానిగా ఉంది. మొదటి నుంచి వ్యాపార కార్యకలాపాలన్ని ఎక్కువగా ముంబై నుంచే జరిగేవి. బ్రిటీష్‌ కాలంలో కూడా ముంబై వారికి ప్రధాన పట్టణంగా ఉండేది.

చాలా మంది బ్రిటీషర్లు, బ్రిటీష్‌ ఉన్నతాధికారులు ముంబైలో ఉండటం, క్రికెట్‌ను ఎక్కువ ఆటడంతో.. ఇండియాలో అన్ని ప్రాంతాల కంటే ముంబైలోనే క్రికెట్‌ వేగంగా వ్యాపించింది. క్రికెట్‌ ఆడేందుకు జింఖానాలుగా పిలిచే మైదానాలు నిర్మించడంతో క్రికెట్‌ ఆడేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించేవారు. క్రికెట్‌లోని టెక్నిక్స్‌ను నేర్చుకునే అవకాశం ముంబై వాసులకు ఎక్కువగా ఉండేది. అలా అలా క్రికెట్‌కు ​​ముంబై స్వర్గధామంగా మారింది. కొన్ని దశాబ్దాల పాటు సాగిన కృషి వల్ల ముంబై టీమ్‌ చాలా పటిష్టంగా తయారైంది. స్వతంత్రానికి పూర్వం కూడా మిగతా టీమ్స్‌ కంటే.. ముంబై టీమ్‌లో చోటు దక్కడం చాలా కష్టం మారేది.

Mumbai 90 seasons in ranji trophy 42 times win

ఎందుకంటే ఎంతో అద్భుతంగా ఆడేవారికి తప్పితే.. మిగతా వారికి ముంబై టీమ్‌లో చోటు దక్కేది కాదు. అంటే పోటీ కూడా ఆ స్థాయిలో ఉండేది. దీ బెస్ట్‌ ప్లేయింగ్‌ ఎలెవన్‌ ముంబై జట్టులో ఉండేది. పైగా కోచింగ్‌ స్టాఫ్‌ కానీ, ఇతర సౌకర్యాలు కానీ ముంబై టీమ్‌కు ఉన్నంత బాగా మరే జట్లకు ఉండేవంటే అతిశయోక్తి కాదు. కాల క్రమంలో ముంబై జట్టుకు ఢిల్లీ, కర్ణాటక, బరోడా, బెంగాల్‌ జట్టు గట్టి పోటీ ఇచ్చాయి. ముంబై తర్వాత అత్యధిక రంజీ ట్రోఫీలు గెలిచిన జట్లుగా కర్ణాటక, బరోడా ఉన్నాయి. కర్ణాటక 8 సార్లు, బరోడా 5 సార్లు రంజీ టైటిల్స్‌ సాధించాయి. వీటికి ముంబైకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ముంబై ఖాతాలో 42 రంజీ ట్రోఫీలు ఉన్నాయి. ఇలా రంజీ ట్రోఫీని ఏలుతున్న ముంబై ఒకరకంగా ఇండియాకు మంచి చేస్తున్నట్లే.. ఎలా ఉంటే టీమిండియాకు ది బెస్ట్‌ ప్లేయర్లను అందిస్తోంది. మరి ముంబైలో రంజీ జైత్రయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.