iDreamPost

బాబు ఎందుకు వెనక్కి తగ్గారు – ఎమ్మెల్సీ ఎన్నికలు

బాబు ఎందుకు వెనక్కి తగ్గారు – ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలుగుదేశం వెనకడుగు వేసింది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నింటా అడ్డంకులు కల్పించడమే పనిగా పెట్టుకున్న చంద్రబాబు తొలిసారిగా ముందడుగు వేయలేక మౌనంగా ఉండిపోయారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆశ్చర్యకర అంశమే. పైగా తాము పోటీలో ఉంటామని ప్రకటించిన తర్వాత కూడా టీడీపీ తయారు కాలేకపోవడం విశేషమే. ఏపీలో ఖాళీ అయిన ఒక్క మండలి సీటుకి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే టీడీపీ సై అని ప్రకటించింది. తాము కూడా అభ్యర్థిని రంగంలో దింపుతామని చెప్పింది. కానీ తీరా చూస్తే షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల గడువు నేటితో ముగిసిపోయింది. తన రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని మళ్లీ డొక్కా మాణిక్యవరప్రసాద్ దక్కించుకున్నారు. టీడీపీ పోటీకి దూరం కావడంతో ఏకగ్రీవంగా ఎన్నిక పూర్తయ్యింది.

వాస్తవానికి టీడీపీ పోటీలో ఉండాలనే ఆశించింది. కానీ బరిలో దిగే నాయకుడు కనిపించలేదని సమాచారం. పైగా మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత చేతులు కాల్చుకున్న తరుణంలో మరోసారి పరాభవం ఎదుర్కోవడం మంచి పద్ధతి కాదని అంతా చెప్పడంతో అనివార్యంగా పోటీ నుంచి విరమించుకున్నట్టు సమాచారం. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తనకు ప్రతిపక్ష నేత హోదాకి తగ్గట్టుగా కూడా ఎమ్మెల్యేల మద్ధతు లేదని చంద్రబాబు అందరికీ చాటి చెప్పుకున్నారు. తద్వారా టీడీపీ 23 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే కేవలం 17 ఓట్లు మాత్రమే దక్కించుకోవడం ద్వారా అభాసుపాలయ్యింది. ఇలాంటి సమయంలో మళ్లీ వెంటనే పోటీ చేసి మరో చెంపదెబ్బకు సిద్ధపడే పరిస్థితి కనిపించలేదని టీడీపీ నేతలే అంటున్నారు.

Also Read:నిఘా ఉందిగా నిమ్మగడ్డ గారూ?

అదే సమయంలో రాజ్యసభ ఎన్నికల్లో ఎస్సీని రంగంలో దింపలేదని విమర్శించిన టీడీపీ, ఇప్పుడు ఎస్సీ అభ్యర్థి మీదే పోటీ చేస్తే చాలా ప్రశ్నలు ఎదురయ్యే ప్రమాదం ఉందని గ్రహించింది. దాంతో చివరకు తమ పార్టీని వీడి, మళ్లీ అదే స్థానాన్ని దక్కించుకున్నప్పటికీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ మీద పోటీ చేసే సాహసానికి సిద్ధపడలేని స్థితిని కొనితెచ్చుకుంది. అయితే ఇప్పటి వరకూ ఏడాది కాలంగా అవకాశం ఉన్న ప్రతీ చోటా అడ్డుపడుతూ వచ్చిన చంద్రబాబు తొలిసారిగా బరిలో దిగలేని పరిస్థితి రావడం గమనార్హం. బలం లేని చోట కూడా అధికార పార్టీని, జగన్ ని బద్నాం చేయడం కోసమే ఆటంకాలు కల్పిస్తూ వచ్చింది. మండలిలో పలు బిల్లులకు అడ్డంకులు కల్పించడం కుదరదని తెలిసి కూడా అలాంటి కలహామే రాజేసింది. ఇతర అన్ని విషయాల్లోనూ టీడీపీది అదే ధోరణి. విపక్ష పార్టీగా పాలనలో సహకరించకపోగా, కీలక బిల్లులను కూడా అడ్డుకోవడం ద్వారా రాష్ట్రంలో పాలనను సజావుగా సాగకుండా చేయాలనే సంకల్పంతో పనిచేసింది. అలాంటి టీడీపీ తొలిసారి పోటీలో నిలబడడానికి మొఖం చాటేయడం రాజకీయంగా కీలక పరిణామంగా చెప్పవచ్చు. వైఎస్సార్సీపీ అధినేత వ్యూహాలతో టీడీపీ దగ్గర సమాధానం లేని స్థితి ఏర్పడిందని భావించవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి