iDreamPost

చీకటి భేటికి సూత్రదారి ఎవరు ?

చీకటి భేటికి సూత్రదారి ఎవరు ?

అర్ధరాత్రి ముగ్గురు కీలక వ్యక్తుల సమావేశానికి సూత్రదారి ఎవరు ? అన్న విషయమే ఇపుడు సంచలనంగా మారింది. ఈనెల 13వ తేదీ అర్ధరాత్రి హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో రాష్ట్ర ఎన్నికల మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చదౌరి, మాజీమంత్రి బిజెపి నేత కామినేని శ్రీనివాసరావు సమావేశమైన విషయం బయటపడింది. వీళ్ళ రహస్య భేటికి సంబంధించిన సీసీ టివి ఫుటేజి బయటపడగానే ఒక్కసారిగా సంచలనం మొదలైంది.

నిమ్మగడ్డ తొలగింపు వివాదం కేసు ప్రస్తుతం సుప్రింకోర్టులో పెండింగ్ లో ఉంది. ఇపుడు వీళ్ళ ముగ్గురి తాజా రహస్య భేటి కలకలం రేపుతోంది. మొదటినుండి నిమ్మగడ్డ వ్యవహారం తెలుగుదేశంపార్టీకి అనుకూలంగానే ఉందనే ఆరోపణలు వినబడుతున్నాయి. స్ధానిక ఎన్నికలను కూడా ప్రభుత్వంతో చర్చించకుండానే ఏకపక్షంగా వాయిదా వేయటం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. దాని తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే.

ఒకవైపు నిమ్మగడ్డ తొలగింపు వివాదం సుప్రింకోర్టు విచారణలో ఉండగానే బిజెపి నేతలను కలవాల్సిన అవసరం నిమ్మగడ్డకు ఏమొచ్చింది ? అసలు అర్ధరాత్రి ఓ హోటల్లోని గదిలో దాదాపు 1.30 గంటల పాటు రహస్యంగా ఎందుకు భేటి అవ్వాల్సిన అవసరం ఏమిటి ? భేటిలో ఏ అంశాలు చర్చించారు ? అనేవి ఇపుడు తేలాల్సిన విషయాలు. అసలు వీళ్ళ ముగ్గురిని కలిపిన కామన్ అంశం ఏమిటి అనే ప్రశ్నకు చంద్రబాబునాయుడే అనే ఆరోపణలు విస్తృతంగా వినబడుతున్నాయి.

ఇదే విషయమై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ చీకటి రాజకీయాలు చేయటం చంద్రబాబునాయుడుకు బాగా అలవాటంటూ మండిపోయారు. ఇపుడు వీళ్ళ ముగ్గురి భేటి వెనుక కూడా చంద్రబాబే ఉన్నాడంటూ ఆరోపించారు. చంద్రబాబు ప్రోదల్బంతోనే వీళ్ళ రహస్య భేటి జరిగిందన్నారు. బిజెపి నేతలతో నిమ్మగడ్డ భేటి అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ వెల్లంపల్లి మండిపడ్డారు.

నిమ్మగడ్డపై వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ వైసిపి ఎంఎల్ఏ అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. వీళ్ళ ముగ్గురు దొరికిపోయిన దొంగలంటూ మండిపడ్డారు. రహస్య భేటి విషయాన్ని వాళ్ళంతట వాళ్ళే బయటపెట్టాలన్నారు. వీళ్ళ ముగ్గురికి బాస్ చంద్రబాబే అంటూ ఆరోపించారు. నిమ్మగడ్డ వెంటనే పోలీసులకు లొంగిపోయి భేటిలో ఏమి జరిగిందనే విషయాన్ని వివరించాలంటూ డిమాండ్ చేశారు. మరి వీళ్ళ భేటిలో ఏమి చర్చించారనే విషయం బయటపడుతుందా ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి