iDreamPost

ఈనాడు పత్రికలో ఏం జరుగుతోంది.. సిబ్బంది ఎందుకు ఆందోళనలో ఉన్నారు..

ఈనాడు పత్రికలో ఏం జరుగుతోంది.. సిబ్బంది ఎందుకు ఆందోళనలో ఉన్నారు..

ఈనాడు పత్రికలో ఉద్యోగం అంటే చాలామంది జర్నలిస్టులలో ఓ ధీమా. దాదాపుగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. కానీ రానురాను పరిస్థితి తారుమారయ్యింది. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కరోనా సమయంలో ప్రపంచంమంతా ఎదుర్కొంటున్న సంక్షోభం ప్రింట్ మీడియాని కుదేలు చేసింది. అయినా సుదీర్ఘకాలంగా లాభాల కోటలు నిర్మించిన ఈనాడు వంటి సంస్థలకు ఢోకా లేదనే అభిప్రాయం సర్వత్రా ఉండేది. కానీ అలాంటి అంచనాలు తప్పని రామోజీరావు నిరూపిస్తున్నారు. వివిధ వర్గాల హక్కుల గురించి మాట్లాడే పత్రికలో ఇప్పుడు సిబ్బంది జీవితాలతో ఆటలాడుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే వివిధ రకాలుగా కోతలకు సన్నద్ధమయిన ఈనాడు సంస్థలు ఇప్పుడు మరింత దూకుడుగా జర్నలిస్టులు, ఇతర సిబ్బంది పట్ల వ్యవహరిస్తున్నారు.

ఈనాడు పత్రికలో ప్రతీ నెలాఖరున వేతనాలు జమకావడం ఆనవాయితీ. పండుగలు, ఇతర సెలవులు వస్తే ఇంకా ముందుగానే జీతాలు అందేవి. కానీ ఇది గత రెండు మూడు నెలలుగా మారుతూ వస్తోంది. ఏప్రిల్ నెల వేతనాలను మే 6వ తేదీన వేశారు. జూన్ నెల జీతాలు రెండో వారంలోకి వచ్చినా నిన్నటి వరకూ పడలేదు. వాటికి తోడు తాజాగా కొత్త నిబంధనలతో కొర్రీలు వేస్తున్నారు. పొమ్మనలేక పొగడబెతున్న చందంగా వ్యవహరిస్తున్నారనే ఆందోళన ఈనాడు సిబ్బందిలో మొదలయ్యింది.

వాస్తవానికి ఇప్పటికే ఆంధ్రజ్యోతి వంటి పత్రికలు వందల మంది సిబ్బందిని సాగనంపాయి. పనిచేస్తున్న వారి వేతనాల్లో భారీ కోతలు విధించాయి. ఇప్పటికే అమలు చేస్తున్న 25 శాతం వేతనాల కోతకు తోడుగా ఈనెల నుంచి అదనంగా కోత విధిస్తున్నట్టు ప్రకటించారు. 11వ తేదీన వేతనాలు చెల్లించే ఆంధ్రజ్యోతి ఎంతమేరకు జీతాలు కోత వేస్తుందోననే భయాందోళనల మధ్య ఆ సంస్థ సిబ్బంది ఉన్నారు. ఈనాడు మాత్రం దానికి భిన్నమైన పద్దతిని అనుసరిస్తోంది. డెస్క్, మరియు మిషనరీ సిబ్బందికి సగం రోజుల పని, ఆ సగం రోజులకే వేతనం అనే నిబంధన పెడుతోంది. అంటే నెలలో కొద్దిరోజులు కొందరు ఉద్యోగం చేస్తే, మిగిలిన బ్యాచ్ మరికొన్ని రోజులు పనిచేయాల్సి ఉంటుంది. పనిచేసిన కాలానికే వేతనాలు చెల్లించే విధంగా ఈనాడు నిర్ణయం తీసుకుంది. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పకుండానే ఎవరికి వారు వైదొలిగేలా ఈనాడు సంస్థ కుట్ర చేసిందనే అబిప్రాయం కలుగుతోంది.

కరోనా నేపథ్యంలో అడ్వర్టైజ్మెంట్లు ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గడంతో ఉద్యోగులకు కొద్దిరోజుల పని, వేతనం ఇవ్వగలవు తామని ఈనాడు చెబుతోంది. దానికి అనుగుణంగా నిన్న అర్ధరాత్రి ఈనాడు యాజమాన్యం నుంచి నోటీసులు కూడా జారీ అయ్యాయి. విచిత్రమైన అంటేఆ నోటీసుల ప్రకారం మొత్తం ఉద్యోగుల్లో కొందరికి నెలలో రెండు మూడు రోజుల పాటు మాత్రమే పని మాత్రమే ఇవ్వగలుగుతామని పేర్కొనడం అలజడికి కారణంగా మారింది. సిబ్బంది అందరి పట్ల ఒకే విధంగా వ్యవహరించకుండా, ఈ విషయంలో కూడా వైరుధ్యం చూపడం ద్వారా కొందరిని తొలగించే పన్నాగం ఉందనే వాస్తవం తేటతెల్లం అవుతోంది. అత్యధిక సర్క్యులేషన్ కలిగిన పత్రికగా తెలుగు పత్రికల్లో నెంబర్ వన్ అంటూ చెప్పుకునే ఈనాడు దినపత్రిక లో సిబ్బంది పట్ల ఇంత కనికరం లేని నిర్ణయాలు తీసుకోవడం కలకలం రేపుతోంది.

రామోజీరావు తీరు మీద జర్నలిస్టులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగిని తొలగిస్తే దానికి ప్రతిఫలంగా పెద్దమొత్తంలో పరిహారం చెల్లించాల్సి వస్తుందనే సాకుతో ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా భావిస్తున్నారు. కేవలం కలాన్ని నమ్ముకున్న వందల మంది పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాలు తొలగించి వీధికి నెడుతున్న ఇలాంటి వారు అందరికీ నీతులు చెప్పడానికి సిద్ధపడే ధోరణి గురువిందల సామెతకు అద్దంపడుతున్నట్టు ఉందని అంటున్నారు. తక్షణం ఈనాడు సంస్థలు ఈ విషయంలో పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని జర్నలిస్టులు కోరుతున్నారు. జర్నలిస్ట్ సంఘాలన్నీ ఇలాంటి సంస్థల విషయంలో నోరుమెదపని కారణంగానే యాజమాన్యాలు ఇష్టారీతన వ్యవహరించే పరిస్థితి ఉందని బాధితులు వాపోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి