iDreamPost

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమ గమ్యమేది ??? 

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమ గమ్యమేది ??? 

యక్ష ప్రశ్నలకు సమాధానమిచ్చి తమ్ముళ్లని బతికించుకొన్న ధర్మజునికి కూడా ఈ ప్రశ్నకి సమాధానం చెప్పటం కష్టమేమో . కానీ చంద్రబాబు నైజమెరిగిన ఆంధ్రా ప్రజలు మాత్రం ఒక్కటి చెప్పగలరు . ఆయన ఉద్దేశ్యాలు , ప్రయోజనాలు నెరవేరెవరకూ రైతుల్ని అగమ్యగోచరంగా ఉద్యమం పేరిట ముందుకు నెడుతూనే ఉంటాడు .

రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పేరిట భూసమీకరణకు తెర తీసిన బాబు దీనికి ముందు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక , సూచనలు పక్కన పెట్టడం , పర్యావరణ నిపుణుల , రైతుల , ప్రజల అభ్యంతరాలు పరిగణించకుండా నిర్ణయం తీసుకోవడం , 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కి రియల్టర్ తరహాలో భూ సమీకరణ పేరిట ప్రయివేటు ఒప్పందానికి తెర తీసి రైతుల నుండి భూమి సేకరించడం లాంటి ఏకపక్ష నిర్ణయాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే .

ప్రపంచంలో పేరొందిన భారీ నిర్మాణాల నుండి అనేక వింతలు విశేషాలని అమరావతిలో నెలకొల్పుతానని అదే ప్రాంతంలో మీకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తానని అప్పటి వరకూ కవులు , మరికొన్ని తాయిలాలు ఇస్తానన్న బాబు మాటలు నమ్మి కొందరు రైతులు CRDA కి భూములిచ్చారు . అభ్యంతరాలు వ్యక్తం చేసిన కొందరు తర్వాతి రోజుల్లో ఒప్పించబడ్డారు . చంద్రబాబుకి ఓటేసి మా నెత్తి మీద ఎక్కించుకొన్నాం , ఇప్పుడు బంగారం పండే మా భూములు లాక్కుని మా నోట్లో మట్టి కొడుతున్నాడు అని మీడియా ముందు ఆక్రోశించిన బోయపాటి సుధారాణి అనే మహిళ ఈ ఘటన తర్వాత రెండుమూడ్రోజుల అజ్ఞాతంలోకి వెళ్లడం తర్వాత భూమి ఇవ్వడానికి ఒప్పుకోవడం అందరికీ తెలిసిందే .

ఈ విషయంలో ఎవరు ఎలా ప్రభోదించి ప్రభావితం చేశారో ఊహించని అమాయకులు కాదు ప్రజలు . మరికొందరు భూములివ్వని రైతుల పంట పొలాలు దున్ని చదును చేయడం , పొలాల్లో గుండా రోడ్లు వేయడం , అరటి తోటలు తగలబడడం , కొందరు రైతులు స్టేషన్ల చుట్టూ తిరగడం అందరికీ తెలిసిన వార్తలే , అప్పటికీ భూములివ్వని ప్రాంతాల్లో వారికి అమ్మకపు విలువ దక్కే అవకాశం లేకుండా గ్రీన్ జోన్ లాంటి నిబంధనలూ చవిచూశారు అక్కడి రైతులు .
ఎట్టకేలకు 29000 మంది రైతులకు సంభందించిన 34000 ఎకరాల భూమి సమీకరించారు .

నాలుగేళ్లు గడిచిన తర్వాత చూస్తే మూడు తాత్కాలిక భవనాలు , పది అసంపూర్తి నిర్మాణాలతో 2019 ఎన్నికలకు పోయిన టీడీపీ అధినేతని మూకుమ్మడిగా తిరస్కరించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. తర్వాత ఏర్పడిన వైసీపీ ప్రభుత్వ అధినేత జగన్ రాజధాని పేరిట లక్షల కోట్లు వెచ్చించే ఆర్ధిక స్థితిలో మన రాష్ట్రం లేదని , అదీ కాక అభివృద్ధి మొత్తం ఒకేచోట కేంద్రీకృతం అయ్యి భవిష్యత్ వివాదాలు రాకుండా వికేంద్రీకరణ నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ బిత్తరపోవడంతో పాటు భగ్గుమంది . పలు వేదికలపై ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన టీడీపీ రాజధాని కోసం భూములిచ్చిన అమరావతి రైతుల పేరిట ఉద్యమం అంటూ కొందరు గ్రామస్తుల చేత దీక్షలు చేయించడం మొదలు పెట్టింది .

అమరావతి రైతు పేరిట దీక్షలో రైతులందరు ?.

CRDA కి భూములిచ్చిన రైతులు 29000 మందిలో ఈ రోజు అమరావతి పోరాటంలో పాల్గొంటున్న రైతులు ఎందరు అంటే చాలా తక్కువ మంది అనే చెప్పాలి . రాజధాని ప్రాంత ఎంపిక తర్వాత అక్కడ ఇంసైడర్ ట్రేడింగ్ జరిగింది అనేదానికి ఇప్పటికే పలు ఆధారాలు లభించడమే కాదు . జరిగిన అక్రమాల పై కేసుల్లో కొందరి అరెస్టులు కూడా జరిగాయి . చంద్రబాబు తనయుడు లోకేష్ , మంత్రి నారాయణ , పుల్లారావు , కోడెల శివరాం , పయ్యావుల , కొమ్మాలపాటి లాంటి ప్రధాన టీడీపీ నేతల పేరిట 4000 ఎకరాల పై చిలుకు ఇంసైడర్ ట్రేడింగ్ జరిగింది అని ప్రధాన ఆరోపణతో పాటు , రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖులు భూములు కొన్నారని పలు వార్తా సంస్థలు వెల్లడించాయి . ఒక అగ్రశ్రేణి తెలుగు హీరో ఐదొందల ఎకరాలు కొన్నాడని , ఇంకా పలువురు సినీ రంగ ప్రముఖులు పెట్టుబడి పెట్టారని ఆంధ్రజ్యోతి ప్రచురించగా , దాదాపు 7000 మంది రైతులు భూములు విక్రయించారని , కేటాయించిన ప్లాట్లలో సైతం 7000 పై చిలుకు ప్లాటులు చేతులు మారాయని ఈనాడు రాసుకొచ్చింది .

ఇలా టీడీపీ అనుకూల వార్తా సంస్థల సమాచారం ప్రకారమే దాదాపు పది వేల మందికి పైగా రైతుల నుండి భూములు చేతులు మారాయంటే ఇంకా బయటికి తెలియకుండా అమ్మిన , అగ్రిమెంట్స్ మీద చేతులు మారిన భూముల తాలూకూ రైతుల్ని కూడా లెక్కిస్తే సగానికి పైగా చేతులు మారాయని అంచనాకు రావొచ్చు . వీటి పై విచారణలు పక్కన పెడితే ప్రస్తుతం రాజధాని పోరాటంలో రైతులు పెద్దగా పాల్గొనకపోవటానికి , బయటివారు ఎక్కువగా కనపడటానికి ఇదే ప్రధాన కారణం .

ఏడాదిగా ఉద్యమం చేస్తున్నా ఇతర ప్రాంతాల వాళ్ళు పట్టించుకోవట్లేదు . ఇది దారుణం . వాళ్ళు అక్కడ శిబిరాల్లో అష్టా చెమ్మ ఆడట్లేదు , ఉద్యమం చేస్తున్నారు . ప్రజలు పట్టించుకోవాలి అంటూ నిన్న టీడీపీ అనుకూల ఛానెల్ యాంకర్ మాట్లాడటం చూస్తే ఉద్యమం పట్ల రాష్ట్ర ప్రజల నిరాదరణ అర్ధమవ్వటమే కాదు . రైతుల పేరిట టీడీపీ చేస్తున్న పోరాటం విఫలమైందన్న విషయం , టీడీపీకి మద్దతిస్తున్న ఆయా వర్గాలకు కూడా అర్ధమై ఉంటుంది .

అమరావతి ఉద్యమం మేం భూములిచ్చిన రైతు పక్షం అంటూ తొలుత మాట్లాడిన నారాయణ , పుల్లారావు , ధూళిపాళ్ల లాంటి టీడీపీ ప్రధాన నేతలు ఒక్కొక్కరూ ఇంసైడర్ ట్రేడింగ్ లో తమ పేర్లు బయటికొస్తుండడంతో మౌనం వహిస్తుండడం వలన పోరాటానికి కృత్రిమ రైతులు , తాత్కాలిక నేతలు , రైతు పక్షపాత నటుల పాత్ర పెరిగింది ఉద్యమంలో . ఇటీవల కాలంలో అమరావతి రైతుల పోరాటం చూస్తే గుండె తరుక్కుపోతుంది అని దీనాళాపాలు పలికిన సినీ నిర్మాత అశ్వినీదత్ , తర్వాత కొద్ది రోజుల్లోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం తన భూమి ఇచ్చినందుకు ప్రతిగా రాజధానిలో తనకు ప్లాట్స్ ఇచ్చారని ఇప్పుడు రాజధాని తరలిస్తే వాటి విలువ తగ్గుతుందని కనుక తన సమస్య తేలేవరకూ రాజధాని వికేంద్రీకరణ అడ్డుకోవాలని కోర్టులో పిటిషన్ వేయడంతో నివ్వెరపోయి ముక్కున వేలేసుకోవడం రాష్ట్ర ప్రజల వంతు అయ్యింది .

భోగాపురం పోర్ట్ కోసం దాదాపు 5300 ఎకరాలు సేకరించగా వారికి ఎవరికీ ఇక్కడ ప్లాట్స్ సేకరించకుండా అశ్వినీదత్ ఒక్కడికే ఇక్కడ కేటాయించడం వెనకున్న మతలబు 2004 లో టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసిన అశ్వినీదత్ చెప్పలేదు .

29 గ్రామాల నుండి భూమి సేకరించగా పోరాటం మొదలు పెట్టిన నాటి నుండి నేటి వరకూ మందడం , ఉద్దండరాయునిపాలెం లాంటి నాలుగైదు ఊర్లలో తప్ప మిగతా గ్రామాల్లో పోరాటాలు , శిబిరాలు కనపడట్లేదు . ఐదు కోట్ల ఆంధ్రుల కల అమరావతి లాంటి పడికట్టు పదాలతో టీడీపీ చేస్తున్న గోల తప్ప కనీసం పక్క నియోజక వర్గాల్లో కూడా స్పందన లేదనేది జగమెరిగిన సత్యం .

అమరావతి ఉద్యమం మొదలైన రెండు నెలలకి, ఈ యాడాది ఫిబ్రవరి 22 నాటికి అమరావతి రాజధాని కోసం 44 మంది ప్రాణత్యాగం చేశారు అని టీడీపీ ప్రకటించగా , అందులో కొందరు గుండె పోటుతో , కొందరు వృద్దాప్యంతో , కొందరు అనారోగ్య కారణాలతో పోయుంటారని అన్నీ పోగా కనీసం 22 మందినైనా అమరావతి మరణాల ఖాతాలో లెక్కేసుకోవచ్చని ఈనాడు రాసిన వార్తలోని బేలతనాన్ని , సాధారణ మరణాలు అనే నిజాన్ని అంగీకరించలేక పడిన కష్టాన్ని చూస్తే అమరావతి రైతుల పేరిట టీడీపీ ఉద్యమంలోని డొల్లతనం తెలుస్తుంది . ఈ విషయంలో సోషల్ మీడియా వేదికగా పలు ప్రాంతాల్లో దుర్ఘటనల్ని , దుర్మరణాల్ని కూడా అమరావతి ఉద్యమ ఖాతాలో వేసే ప్రయత్నం చేసి అభాసుపాలయ్యింది టీడీపీ .

మరి భూములిచ్చి అయోమయంలో ఉన్న రైతుల కర్తవ్యమేంటి ?.

నిజమే రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది . ఇందుకు కారణం మాత్రం పూర్తిగా చంద్రబాబు ఆయన కూటమే . చరిత్రలో ఏ ఉద్యమమయినా పోరాటం అయినా దిశానిర్దేశం లేకుండా సాగి ముగియడానికి ప్రధాన కారణం అసలు సమస్య ఉన్నవారు కాకుండా దాని నుండి లబ్ది పొందుదాం అనే కోణంలో ఉద్యమాన్ని తమ చేతుల్లోకి తీసుకొని స్వప్రయోజనాల వైపు ఆ పోరాటాన్ని నడిపిన వారి కారణంగానే వారి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయి .

నాడు భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా భూసమీకరణ అంటూ వంచించి భూములు తీసుకొని ఆనాడు రైతులకు అన్యాయం చేసిన బాబే , ఈనాడు ఆంధ్రుల రాజధాని , ఆత్మగౌరవం అంటూ రైతుల సమస్యని హైజాక్ చేసి కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నాడని చెప్పొచ్చు .

ప్రపంచంలో అతి కొద్ది ఉద్యమాలు మాత్రమే యాడాది కాలం పాటు నిలిచినా వాటికి వేటికీ కూడా రాజధాని ఉద్యమానికి ఉన్నంత మీడియా మద్దతు , ఆర్ధిక బలం , ఎప్పుడూ రైతు గురించి ఆలోచించని కార్పోరేట్ రంగాల పెద్దల నుండి అమరావతి రైతులకు నైతిక మద్దతు లాంటివి ఎందుకు లభిస్తున్నాయో అర్ధం కాని అమాయకులు కాదు ఆ ప్రాంత రైతులు . తమ సమస్య పరిష్కారానికి సంభందం లేని నాయకుల కబంధ హస్తాల్లో నుండి బయటికి రావాలి రైతులు .

సమస్య పరిష్కరించాల్సిన ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ డిమాండ్లు తెలియజేయాలి . అందుకు ముందుగా 29000 మందిలో భూములు , ప్లాట్లు అమ్ముకొన్న రైతులు పోగా మిగిలిన కొద్దిమంది రైతులు గ్రామాల వారీగా కమిటీలుగా ఏర్పడి ఇంకా రైతుల వద్దనున్న భూమి , పొందిన ప్లాట్లు , ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు , తరలింపు వలన తమ భూముల స్థితి లాంటి వాటి పై విస్తృతంగా చర్చించి తగు పరిష్కారం పొందే ప్రయత్నం చేయాలి . వంద యుద్దాలు తీర్చలేని సమస్య ఒక సామరస్య పూర్వక చర్చ తీరుస్తుంది అన్నది పలుమార్లు నిరూపితమైన సత్యం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి