iDreamPost

నిజాముద్దీన్ లో అస‌లేం జ‌రిగింది..వైర‌స్ వ్యాప్తికి ఎలా కారణమయ్యింది ..!

నిజాముద్దీన్ లో అస‌లేం జ‌రిగింది..వైర‌స్ వ్యాప్తికి ఎలా కారణమయ్యింది ..!

దేశం ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డింది. తెలంగాణాలో ఆరుగురు మృతి చెంద‌డం, క‌శ్మీర్, క‌ర్ణాట‌క‌లో మ‌రో ఇద్ద‌రు మృతి చెంద‌డం విచార‌క‌రంగా మారింది. కానీ తీరా వారి మ‌ర‌ణం వెనుక మూలాలు వెదికితే ఢిల్లీలోని నిజాముద్దీన్ తో ముడిప‌డ‌డం విస్మ‌య‌క‌రంగా మారింది. దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన 4వేల మంది నిర్వ‌హించిన మ‌త ప్రార్థ‌న‌లు ఇప్పుడు దేశాన్ని అల్ల‌క‌ల్లోలంగా మారుస్తున్నాయి. నిన్నటి వ‌ర‌కూ ప్ర‌శాంతంగా ఉన్న ఏపీలో కూడా ఒక్క‌రోజు 17 కేసులు న‌మోద‌యితే అందులో 15 కేసులు ఢిల్లీ ప‌రిణామాల‌తో ముడిప‌డ‌డంతో అంతా ఉలిక్కిప‌డుతున్నారు.

ఢిల్లీ నిజాముద్దీన్ లో ఏటా తుబ్లీగ్ జ‌మాత్ నిర్వ‌హిస్తారు. దానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి స‌దరు మ‌త‌స్తులు హాజ‌ర‌వుతారు. ఈ ఏడాది కూడా మార్చి 13,14 తేదీల‌లో రెండు రోజుల పాటు సామూహిక మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. అయితే అప్ప‌టికే ప్ర‌పంచంలోని అనేక దేశాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా చైనాకి స‌మీపంలో ఉన్న ఇండోనేషియా వంటి దేశాల నుంచి కూడా మ‌త ప్ర‌బోధ‌కులు హాజ‌ర‌య్యారు. అంతేగాకుండా ముస్లీంల ఆచారం ప్ర‌కారం మ‌నిషిని మ‌నిషి ద‌గ్గ‌ర‌కు చేర్చుకుని కౌగిలించుకునే ప‌ద్ద‌తి ఇప్పుడు పీక‌ల‌మీద‌కు తెచ్చింది. అస‌లే విదేశాల నుంచి వ‌చ్చిన వారి ద్వారా వైర‌స్ వ్యాపించ‌డం, అదే స‌మ‌యంలో కౌగిలించుకోవ‌డం అనే సంప్ర‌దాయం మూలంగా విస్తృత‌మ‌య్యింది.

క‌రోనా కాంటాక్ట్ కేసుల‌కు ఆస్కారం ఏర్ప‌డింది. అంత‌టితో స‌రిపెట్ట‌కుండా ఒకే రైలులో దేశంలోని వివిద ప్రాంతాల‌కు ప్ర‌యాణాలు చేశారు. దాంతో వారి ప‌య‌నంలో అది మ‌రింత‌గా వ్యాపించ‌డం ఇప్పుడు పెద్ద స‌మ‌స్య‌గా మారింది. క‌రోనా విష‌యాన్ని ఖాత‌రు చేయ‌కుండా ఎవ‌రి ప‌నిలో వారు మునిగిపోవ‌డంతో అది ఎంత‌మేర‌కు విస్త‌రించింద‌నే విష‌యం ఇప్ప‌టికీ అంతుబ‌ట్ట‌కుండా ఉంది.

ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నెల్లూరు నుంచి విజ‌య‌న‌గ‌రం వ‌ర‌కూ అన్ని జిల్లాల్లో ఉన్న నిజాముద్దీన్ తుబ్లీగ్ జ‌మాత్ యాత్రికుల స‌మాచారం సేక‌రించే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి తొలిద‌శ‌లో పూర్తిగా విదేశీయుల మీద గురిపెట్టి, వారిని ఐసోలేష‌న్ కి పంపించ‌డంపై అన్ని ప్ర‌భుత్వాలు దృష్టి పెట్టాయి. కానీ మ‌రోవైపు కాంటాక్ట్ కేసులు వివిధ ప్రాంతాల్లో వ్యాపిస్తుంద‌నే విష‌యం గ‌మ‌నంలో లేదు. ఈ విష‌యాన్ని ఆల‌శ్యంగా గుర్తించి ఇప్పుడు రంగ‌లో దిగేస‌రికి ఏపీలోనే కుటుంబ స‌భ్యులు స‌హా 100 మందికి పైగా క‌రోనా ప్ర‌భావితులుంటార‌ని అంచ‌నాలు వినిపిస్తున్నాయి. వారితో పాటుగా వివిధ రాష్ట్రాల్లో ఈ సంఖ్య వెయ్యి వ‌ర‌కూ ఉంటుంద‌నే ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఇప్ప‌టికే తెలంగాణాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవ‌డం, ఏపీలో ఓ నెగిటివ్ వ‌చ్చిన ఢిల్లీ యాత్రికుడు మ‌ర‌ణించ‌డంతో మృతుల సంఖ్య విష‌యం కూడా క‌ల‌క‌లం రేపుతోంది. దానిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మ‌య్యింది.

ఈ ప్ర‌మాదం విస్త‌రించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రి ప్ర‌ధాన కార‌ణంగా ప‌లువురు భావిస్తున్నారు. క‌రోనా స‌మ‌యంలో విదేశీ యాత్రికుల‌ను స‌కాలంలో అడ్డుకోలేక‌పోవ‌డం ఇప్ప‌టికే ఇబ్బందికి మూలం అయ్యింది. చివ‌ర‌కు మ‌త ప్ర‌చారాల‌కు కూడా విదేశీయులు వ‌స్తున్న విష‌యాన్ని గ్ర‌హించ‌లేక‌పోవ‌డం పెద్ద వైఫ‌ల్యంగా చెబుతున్నారు. ప్ర‌భుత్వ వ‌ర్గాలు మాత్రం నిజాముద్దీన్ మ‌త ప్ర‌చారంలో పాల్గొన్న వారు వీసా నిబంధ‌న‌లు ఉల్లంఘించిన‌ట్టు చెబుతున్న‌ప్ప‌టికీ వాస్త‌వం వేరుగా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. క‌రీంన‌గర్ వంటి ప‌ట్ట‌ణాలు, ప్ర‌కాశం జిల్లా వంటి ప్రాంతాలు విల‌విల్లాడిపోతున్న ప‌రిస్థితికి కేంద్రం నిర్ల‌క్ష్యం కార‌ణంగా క‌నిపిస్తోంది. త‌క్ష‌ణ‌మే సంబంధిత వ్య‌క్తుల జాడ క‌నిపెట్టి క్వారంటైన్ కి త‌ర‌లించ‌క‌పోతే క‌లిగే ముప్పు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి