iDreamPost

Sai pallavi కశ్మీరీ పండిట్‌లు, గోహత్యలపై సాయి పల్లవి ఏమన్నారు? ఎందుకు హీరోయిన్ వ్యాఖ్యలను వివాద‌స్ప‌దం చేస్తున్నారు?

Sai pallavi కశ్మీరీ పండిట్‌లు, గోహత్యలపై సాయి పల్లవి ఏమన్నారు? ఎందుకు హీరోయిన్ వ్యాఖ్యలను వివాద‌స్ప‌దం చేస్తున్నారు?

రెండువారాలుగా సాయిప‌ల్ల‌వి విరాట‌ప‌ర్వం సినిమాను భుజానికెత్తుకొని ప్ర‌చారం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడారు. ఇంట‌ర్వ్యూలిచ్చారు. విరాట‌ప‌ర్వం సినిమాలో త‌న పాత్ర వెన్నెల గురించి ఎమోష‌న‌ల్ అయ్యారు. వారం రోజులుగా ఆమె ట్రెండింగ్ ఉన్నారు. కాని గ్రేటాంద్ర‌కిచ్చిన ఇంట‌ర్వ్యూ మాత్రం వివాద‌స్ప‌ద‌మైంది.

కశ్మీర్లో పండితులను చంపడం, ఆవు పేరుతో ముస్లింలను చంపడం , హింస‌ప‌రంగా ఈ రెండింటి మ‌ధ్య తేడా ఏముందని విరాట‌ప‌ర్వం హీరోయిన్ ప్ర‌శ్నించారు. ఒక‌టి రెండు రోజులు ఈ వ్యాఖ్య‌ల‌ను వివాద‌స్ప‌దం చేస్తున్నారు. సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ్ నాయకులు సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గోర‌క్షులు హీరోయిన క‌శ్మీర్ టెర్ర‌రిస్ట్ ల‌తో పోల్చార‌న్న‌ది వాళ్ల అభ్యంత‌రం.

ఇంట‌ర్వ్యూలో ప్ర‌శ్న అడిగారు. మీ విద్యార్థి జీవితంలో, కొంతైనా వామపక్ష ఉద్యమాలు చూసి ఉంటారు కదా అన్న ప్ర‌శ్న‌కు సాయి ప‌ల్ల‌వి ఇచ్చిన సమాధాన‌మే వివాద‌స్ప‌ద‌మైంది.

నేను పెరిగిన జీవన విధానం చాలా న్యూట్రల్‌. అందుకే నేను రెండు వాదనలనూ న్యూట్రల్‌గానే చూస్తున్నాను. నేను లెఫ్ట్ , రైట్ కుటుంబాల నుంచి వచ్చి ఉంటే, ఒకరికి అనుకూల అభిప్రాయాలు ఉండేవేమో! కానీ నేను ఒక నూట్రల్ ఫ్యామిలో పెరిగాను. వాళ్లు ఒకటే నేర్పారు. నువ్వొక మంచి మనిషిగా ఉండు అని నేర్పారు. ఎవరైనా ఇంకెవరినైనా ఇబ్బంది పెడితే, ఆ ఇబ్బంది పడేవాళ్లను రక్షించాలి. అణిచివేయబడుతోన్న వాళ్లను రక్షించాలి. వాళ్లు పెద్దవాళ్లా? చిన్నవాళ్లా? అని చూడకూడదు. అలాంటి నూట్రల్ వాతావరణంలో నేను పెరిగాను. నేను లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ గురించి విన్నా. ఎవరు కరెక్టు? ఎవరు తప్పు? ఎప్పడూ చెప్పలేం.

కొన్ని రోజుల మందు కశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా. అందులో, ఆ సమయంలో అక్కడి కశ్మీరీ పండితులను వాళ్లు ఎలా చంపారో చూపించారు. ఇప్పుడు కోవిడ్ సమయంలో, ఒకవేళ మీరు మత ఘర్షణలను చూస్తే, ఈ మధ్య ఒకరు, బండిలో ఆవును తీసుకెళ్తున్నారు. ఆ బండి నడిపే వ్యక్తి,…ముస్లిం. కొందరు అతన్ని కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అన్నారు. అప్పుడు జరిగినదానికీ, ఇప్పుడు జరిగిన దానికీ తేడా ఏముంది? అని సాయి ప‌ల్ల‌వి త‌న జ‌వాబులో ప్ర‌శ్నించారు.

ఇదే చాలామందికి న‌చ్చ‌డంలేదు. ఆమె కశ్మీర్ పండితుల ఊచకోతను, ఆవు పేరుమీదుగా జరిగే మూక హత్యలను పోల్చడంపై చాలామంది ఆగ్ర‌హంతో సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. భ‌జ‌రంగ్ ద‌ళ్ లాంటి సంస్థ‌ల వాళ్లు సాయిప‌ల్ల‌విపై విరుచుకుప‌డుతున్నారు. కొంద‌రు టాపిక్ వ‌ర‌కు ఆగ‌డంలేదు. ఆమె బాడీపై అభ్యంతరకర కామెంట్స్ పెడుతున్నారు.

సాయి పల్లవి తన పని తాను చేయడం తప్ప, ఇత‌ర వ్య‌వ‌హారాలను ఆమె ప‌ట్టించుకోలేదు. ఎక్స్ పోజింగ్ కు దూరం. మేకప్ ఉండ‌దు. ఆమెకు సింపుల్ సిటీ ఎక్కువ‌. అందుకే ఆమెకు ల‌క్ష‌ల మంది అభిమానులున్నారు. కొంద‌రు ఆమె చెప్పిన దాంట్లో తప్పేంలేదని సాయి పల్లవికి అనుకూలంగా పోస్టులు షేర్ చేస్తున్నారు.

ఎంబీబీఎస్ చేసిన‌ సాయి పల్లవిది, ఊటీ దగ్గర ఒక చిన్న ఊరు. బడగ ఆమె మాతృ భాష. బడగ తెగకు చెందిన అమ్మాయి. త‌మ భాష‌కు లిపి లేద‌ని ఆమె చెబుతుంటారు. ఆమె ఫ్యామిలీ పుట్టపర్తి సత్యసాయి భక్తులు కాబట్టి, ఆమెకు సాయి పేరు కలిపారు. ఆమెకూడా దైవ భక్తి ఎక్కువే. 8వ తరగతి నుంచే నటించారు. తమిళంలో స్టార్ విజయ్, తెలుగులో ఈటీవీ డ్యాన్స్ షోలల్లో సాయి పల్లవి అద‌ర‌గొట్టారు. హీరోయిన్ కెరీర్ ఎక్కువ‌కాలం ఉండ‌ద‌న‌ని సినిమాల వైపు వెళ్లకుండా, ఎంబీబీఎస్ కోసం జార్జియా వెళ్లారు. అప్పుడే ప్రేమమ్ సినిమాలో దర్శకుడు అల్ఫోన్స్ అవకాశం ఇచ్చారు. అక్క‌డ నుంచి ప్ర‌తి సినిమాకూ ఎదుగుతూనే ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి