iDreamPost

Virata Parvam Review: విరాట పర్వం రివ్యూ

Virata Parvam Review: విరాట పర్వం రివ్యూ

నిర్మాణంలో ఉన్నప్పటి నుంచి ఎన్నో సాధకబాధలు పడుతూ విడుదల వాయిదా వేసుకుంటూ ఎట్టకేలకు ఈ రోజు విడుదలైన సినిమా విరాట పర్వం. సాయిపల్లవి రానా జంటగా నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ నక్సల్ బ్యాక్ డ్రాప్ మూవీ మీద గత వారం రోజులుగా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో అన్న మాటల గురించి కొంత వివాదం రేగి అవి సోషల్ మీడియాలో చిన్నపాటి దుమారం రేపినప్పటికీ అది ఒకందుకు ప్రమోషన్ కు ఉపయోగపడింది. చాలా అరుదుగా జరిగే ఇలాంటి ప్రయత్నాలు ఇలా వెండితెరపై రావడం హర్షణీయం. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం పదండి

కథ

వెన్నెల(సాయిపల్లవి)అచ్చమైన తెలంగాణ బిడ్డ, వయసొచ్చాక అరణ్య అలియాస్ కామ్రేడ్ రవన్న(రానా దగ్గుబాటి)రాసిన విప్లవ సాహిత్యం పట్ల ఆకర్షితురాలై చూడకుండానే ప్రేమించడం మొదలుపెడుతుంది. ఇంట్లో వాళ్ళు బావ(రాహుల్ రామకృష్ణ)తో సంబంధం ఖాయం చేయడంతో అది ఇష్టం లేక రవన్నను వెతికేందుకు టౌన్ కు బయలుదేరుతుంది. అక్కడి నుంచి అష్టకష్టాలు పడుతూ ఎట్టకేలకు అడవికి చేరుకుంటుంది. ముందు ఇష్టం లేకపోయినా ఆమె నిజాయితీ నచ్చి రవన్న తన దళంలో చేర్చుకుంటాడు. అటుపై ఆమె జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. చివరికి ఆమె లక్ష్యం ఏమయ్యిందనేది తెరమీద చూడాలి

నటీనటులు:

ఈవెంట్లలో చెప్పినట్టు రానా ఇది ముమ్మాటికీ సాయిపల్లవి చేయాల్సిన పాత్రే. ఇంకెవరినీ ఊహించుకోలేనంత గొప్పగా పండించేసింది. బలమైన సన్నివేశాల్లో చెలరేగిపోగా బలహీనంగా అనిపించే సీన్ ని తన ఎక్స్ ప్రెషన్స్ తో నిలబెట్టింది. వెంకటేష్ అన్నట్టు జాతీయ అవార్డు వస్తుందో రాదో చెప్పలేం కానీ తన అభిమానుల్లో సగటు సినీ ప్రేమికుల హృదయాల్లో అంతకన్నా గొప్ప గౌరవం సంపాదించుకుంటుంది. ఇంత బరువైన క్యారెక్టర్ ని పండించాలంటే రూపం కన్నా మిన్నగా అభినయం ఉండాలని మరోసారి రుజువు చేసింది. తాను ఎందుకు కమర్షియల్ చక్రానికి దూరంగా ఉంటుందో మరోసారి స్క్రీన్ మీద స్పష్టంగా కనిపిస్తుంది.

రానా బాగున్నాడు. కాకపోతే సబ్జెక్టు వెన్నెల కోణంలో రాసుకున్నారు కాబట్టి తనకు మరీ ఛాలెంజింగ్ అనిపించే అవకాశాలు పెద్దగా దక్కలేదు. నిండైన విగ్రహం, తొణికిసలాడే గాంభీర్యం బాగా ప్లస్ అయ్యాయి. నందితా దాస్ ఉన్న కొద్ది సీన్లలోనే ఉనికిని చాటుకున్నారు. ఈశ్వరి రావు, సాయిచంద్ లు తక్కువ స్పేస్ లో గుర్తుండిపోతారు. ప్రియమణి, నవీన్ చంద్రలు తమకిచ్చిన బాధ్యతలు నెరవేర్చారు. రాహుల్ రామకృష్ణ, బెనర్జీ, జహీనా వహాబ్ మొత్తంలో కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ వాళ్ళ ప్రాధాన్యత గుర్తుండేలా డిజైన్ చేసిన తీరు బాగుంది. ఇంకా ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ ఎవరూ మైనస్ అనిపించుకోలేదు

డైరెక్టర్ అండ్ టీమ్:

ఇది 2022. పబ్జి కల్చర్ లో మునిగితేలుతూ, పబ్బుల్లో నిషాలకు అలవాటు పడుతూ, టెక్నాలజీ మత్తులో విలువైన జీవితాన్ని స్మార్ట్ స్క్రీన్ కు అంకితం చేస్తున్న ఇప్పటి జనరేషన్ కు దశాబ్దాల వెనుక చీకటి చరిత్రలు పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాటిని అర్థం చేసుకునేంత పరిపక్వత, చూసేంత ఓపిక వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ చెప్పి చూద్దాం అనే ఆలోచనైనా చేయాలిగా. వేణు ఊడుగుల అదే చేశారు. ఇది రిస్క్ అని తెలుసు. కమర్షియల్ మీటర్ కు అంత సులభంగా లొంగని ఇలాంటి సినిమాల వల్ల తనకు గుర్తింపు రావొచ్చేమో కానీ నిర్మాతకు ఎంతవరకు లాభాలొస్తాయనే అనుమానమూ ఉంటుంది. అయినా తగ్గలేదు.

సినిమా ఎలా ఉందనేది కాసేపు పక్కనపెడితే 1990 కాలంలో జరిగిన ఒక విప్లవ ప్రేమికురాలి కథను తెరమీద చూపించాలన్న వేణు తాపత్రయం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని వీలైనంత కాల్పనికతకు చోటు ఇవ్వకుండా సహజంగా చూపించాలన్న కసి తొణికిసలాడుతుంది. దీని కోసం ఆయన హోమ్ వర్క్ చేశారు. ఆనాటి ఘటనలకు సంబంధించిన పేపర్ కటింగ్స్ ని సేకరించి, సదరు వ్యక్తుల నుంచి సమాచారం తెలుసుకుని వీలైనంత రియాలిటీ అప్పీల్ వచ్చేలా శాయశక్తులా ప్రయత్నించారు. బడ్జెట్ పరిమితులకు లోబడి ఎన్నో గండాలు దాటుతూ ఈ యజ్ఞాన్ని ఏళ్ళ తరబడి చేసుకుంటూ వచ్చారు.

ఇప్పటిదాకా చెప్పింది వేణు ఊడుగుల కష్టానికి తగ్గ గుర్తింపు.ఇక సినిమా ఫార్మెట్ లోకి వచ్చేద్దాం. నిజానికి అధిక శాతం ప్రేక్షకులు అనుకున్నట్టు విరాట పర్వం నక్సల్ భావజాలాన్ని బలంగా చూపించే సినిమా కాదు. వెన్నెల అనే అమాయక పల్లెపడుచు ప్రేమకోసం చేసిన యుద్ధం, మిగిల్చిన త్యాగం. ఆయన తరచూ చెబుతూ వచ్చింది కూడా ఇదే. కాకపోతే క్యారెక్టరైజేషన్ లో జరిగిన చిన్న తడబాటు కొంత అయోమయానికి గురి చేస్తుంది. సాహిత్యం పట్ల అంతగా ఆకర్షితురాలైన వెన్నెల ఉద్యమం పట్ల ప్రేమ పెంచుకోవాలి కానీ వ్యక్తిగతంగా రవన్నను ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి అనే కోణంలోనే చూపించడం అంతగా సింక్ అవ్వలేదనిపిస్తుంది.

అప్పట్లో సరళ అనే అమ్మాయి గాథ ఇలాగే జరిగి ఉండొచ్చు. నిజంగా ఆవిడే ఇదంతా చెప్పారో లేక వేణు తనశైలిలో కొంత ఇమాజినేషన్ జోడించారో తెలియదు. ఇలా కాకుండా వెన్నెల రవన్న కవితలకు ఆకర్షితురాలై దళంలోకి చేరాక తుపాకీ పట్టి అప్పుడు ప్రేమలో పడి ఉంటే డ్రామా మరింత గొప్పగా పండేదేమో అనిపిస్తుంది. ఎంత అడవుల్లో ఉన్నా నక్సలైట్లకు భార్యలున్నారు, పిల్లలు కలిగారు, వాళ్ళకూ వ్యక్తిగతంగా జీవితాలు కుటుంబాలు ఉన్నాయి. సో ఇలా చూపించడం తప్పేం కాదు. కానీ వెన్నెల పాత్ర స్వభావం ఒక్కోసారి ఒక్కో రకమైన ఫీలింగ్ కలిగిస్తుంది. సాయిపల్లవి కాబట్టి తన టాలెంట్ వల్ల అది చాలా మటుకు కవరైపోయింది కానీ లేదంటే ఇంకోలా ఉండేది.

ప్రేమకథను మినహాయిస్తే నక్సల్ సిద్ధాంతాలను చూపించే క్రమంలో పోలీసులను దుర్మార్గులుగా, వాళ్లే అసలు శత్రువులన్నట్టుగా తెరకెక్కించారు. నిజానికి ఆ పోలీసులు ప్రభుత్వ వ్యవస్థలో కీలుబొమ్మలు. బ్యూరోక్రసీ సిస్టమ్ లో పైవాళ్ళు ఏం చెబితే అది చేసుకుంటూ పోయే ఉద్యోగాలవి. ఈ క్రమంలో వీళ్ళు చాలా దారుణాలు చేసిన ఉదంతాలు ఉన్నాయి, అత్యంత క్రూరంగా వ్యవహరించిన సంఘటనలకు సాక్ష్యాలు ఉన్నాయి. కానీ దానికి అసలు కారణమైన పొలిటికల్ శక్తుల గురించి ప్రస్తావించి ఉండాల్సింది, విరసం నాయకులు, పౌరహక్కుల నేతలు, సానుభూతి పరులు, ఇంఫార్మర్లు అందరూ ఉంటారు ఒక్క రాజకీయ నాయకులు తప్ప.

విప్లవం జానర్ లో వచ్చిన సినిమాలు ఏది తీసుకున్నా అందులో రెండువైపులా జరిగిన తప్పొప్పుల ప్రస్తావన ఖచ్చితంగా ఉంటుంది. సింధూరంలో భానుచందర్, ఒసేయ్ రాములమ్మాలో కృష్ణ, అర్ధరాత్రి స్వాతంత్రంలో ప్రభాకర్ రెడ్డి ఇలా ఎన్నో పాత్రలు ఆయా చిత్రాల్లో ఇరువర్గాల వైపు వకాల్తా పుచ్చుకుని జనాన్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం జరిపినవి. కానీ విరాట పర్వంలో ఇదంతా వన్ సైడ్ అయిపోయింది. అది కూడా కేవలం నక్సల్స్ యాంగిల్ లోనే. నేను చెప్పింది ప్రేమకథని వేణు ఊడుగుల అనొచ్చు. కానీ టైటిల్ విరాట ప్రేమ అని లేదుగా. అలాంటప్పుడు థియేటర్ కు వచ్చే ఆడియన్స్ చాలా లోతుగా అన్నీ ఎక్స్ పెక్ట్ చేస్తారు.

ఫస్ట్ హాఫ్ లో జరిగే సంఘటనలు, ఎస్టాబ్లిష్ మెంట్లు వేగంగా చేసిన వేణు ఊడుగుల సెకండ్ హాఫ్ లో కొంత తడబడటం, ఎమోషన్స్ ని రిజిస్టర్ చేసే క్రమంలో కొంత సాగతీతకు వెళ్లడం గొప్పగా నిలవాల్సిన క్లైమాక్స్ ఇంపాక్ట్ ని తగ్గించాయి. ఎంతసేపూ అడవుల్లో పోలీసులు నక్సల్స్ మధ్య తుపాకుల యుద్ధంతో రెండు మూడు చిన్న చిన్న మలుపులతో ఎంగేజ్ చేయడం కష్టం. బ్యాక్ డ్రాప్ ఏదైనా డ్రామా ఉండాల్సిందే. ఎన్నో క్లాసిక్స్ తీసిన నారాయణమూర్తి, టి కృష్ణ లాంటి వాళ్ళు సైతం కొంత వరకు కమర్షియల్ గ్రామర్ ని ఫాలో అవుతూ వీలైనంత నాటకీయతను స్క్రీన్ ప్లేలో జోడించారు. కానీ విరాటపర్వంలో ఇది జరగలేదు. ఈ అంశమే ఫలితాన్ని శాసించనుంది

సురేష్ బొబ్బిలి పాటల్లో కోలో కోలో వెంటాడుతుంది. మిగిలినవి అలా వెళ్లిపోతాయి కానీ గుర్తుండే స్థాయిలో లేవు. నేపధ్య సంగీతం బాగుంది. గొప్పగా కాదు కానీ అండర్ టోన్ ఎలివేషన్లకు ఎంత కావాలో అంతా ఇచ్చారు. డానీ సాంచెజ్ లోపెజ్ ఛాయాగ్రహణం న్యాచురల్ గా సాగింది. ఆర్ట్ వర్క్ ని బాగా ప్రెజెంట్ చేసి ఆ ఫీల్ ని సజీవంగా చూపించగలిగారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. ఇంకో పావు గంట నిడివి తగ్గినా నష్టం ఉండేది కాదు. ప్రొడక్షన్ డిజైన్ ని మెచ్చుకోవచ్చు. పరిమిత లొకేషన్లతోనే సహజత్వం తెచ్చారు. సంభాషణల్లో నిజమైన తెలంగాణ యాస ఉట్టిపడింది. చాలా తెలివిగా ఖర్చుపెట్టిన నిర్మాణ విలువలు బాగున్నాయి

ప్లస్ గా అనిపించేవి:

సాయిపల్లవి నటన
రానా పాత్ర
కొన్ని మలుపులు

మైన‌స్ గా తోచేవి:

సినిమాటిక్ డ్రామా తగ్గడం
సెకండ్ హాఫ్ ల్యాగ్
కమర్షియాలిటీ లేకపోవడం

కంక్లూజన్:

ప్రతి శుక్రవారం ఎన్నో సినిమాలు వస్తాయి. కానీ విరాట పర్వం లాంటివి అరుదు.అలా అని ఇది చూస్తే మీరు నిరాశ చెందరని చెప్పే సాహసం చేయడం లేదు. ఇందులోనూ చాలా తప్పొప్పులు ఉన్నాయి. కొందరికే నచ్చేవి ఎక్కువ శాతం పెదవి విరిచేవీ ఉన్నాయి. కాకపోతే థియేటర్ కు వెళ్లి టికెట్ కొని డబ్బుకు సమయానికి న్యాయం జరిగిందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరకాలంటే ముందు ట్రైలర్ చూసి ఈ భావజాలం నాకు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని ఒక్కశాతం అనిపించినా చూసేయండి. తెలుగువాడు ఆవకాయను ఇష్టపడినంత రాగిముద్దను కోరుకోడు. కొందరికే దాని పోషక విలువలు తెలుసు. అందుకే అన్ని హోటళ్లలో దొరకదు. విరాటపర్వం అదే కోవలోకి వస్తుంది. వసూళ్లు రికార్డులు రాకపోవచ్చు కానీ ఏటికి ఎదురీదే వేణు ఊడుగుల లాంటి దర్శకులకు ప్రోత్సాహం అవసరం

ఒక్క మాటలో – అరవిరిసిన వెన్నెల

రేటింగ్: 2.5 / 5

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి