iDreamPost

కోహ్లీ కోసమే మ్యాచ్ చూడటానికి వచ్చాను: పాక్ యువతి

కోహ్లీ కోసమే మ్యాచ్ చూడటానికి వచ్చాను: పాక్ యువతి

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన దాయాదుల పోరు నిరాశ పరిచిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా మ్యాచ్ ను రద్దు చేశారు. రెండు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ ఇండియాకి బ్యాటింగ్ ప్రాక్టీస్, పాకిస్తాన్ కు బౌలింగ్, ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి పెట్టిన మ్యాచ్ లా మారిపోయింది. మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వెళ్లిన అభిమానులు ఒకింత నిరాశతో వెనుతిరిగారు. వారిలో విరాట్ కోహ్లీ వీరాభిమాని పాకిస్తాన్ యువతి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తాను వచ్చిందే విరాట్ కోహ్లీ ఆట చూసేందుకు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

శనివారం జరిగిన భారత్- పాక్ మ్యాచ్ రద్దు కావడంతో అభిమానులు అంతా నిరాశ చెందారు. ముఖ్యంగా మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వెళ్లిన ఫ్యాన్స్ బాధతో వెనుదిరిగారు. గెలుపు ఎవరిదైనా మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే బాగుండేదని చెబుతున్నారు. స్టేడియం బయట అందరూ తమ అభిప్రాయాలను చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవతున్నాయి. వాటిలో పాక్ యువతి తాను విరాట్ కోహ్లీ వీరాభిమానిని అంటూ చెప్పిన వీడియో బాగా వైరల్ అవుతోంది. కోహ్లీ ఆట చూసేందుకే తాను పాకిస్తాన్ నుంచి శ్రీలంక వెళ్లినట్లు చెప్పింది. కోహ్లీ అలా అవుట్ కాగానే తాను ఎమోషనల్ అయ్యానంది.

“విరాట్ కోహ్లీ నా ఫేవరెట్ ప్లేయర్. నేను విరాట్ కోహ్లీ కోసమే ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నేను కోహ్లీ ఆటను లైవ్ లో చూడాలి అనుకున్నాను. విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడని ఎదురుచూశాను. నా గుండె పగిలిపోయింది. నేను పాకిస్తాన్ కి కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఇండియాకి కూడా సపోర్ట్ చేస్తున్నాను. రెండు దేశాలు ఒకే దగ్గర ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది. అక్కడున్న పెద్దాయన విరాట్ కోహ్లీకి సపోర్ట్ చేస్తావా? అంటూ ప్రశ్నించగా.. చాచా పక్క దేశం వారిని సపోర్ట్ చేయడం తప్పేంకాదు కదా అంటూ ప్రశ్నించింది. విరాట్ కోహ్లీ- బాబర్ అజామ్ లో ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు అంటే విరాట్ కోహ్లీ పేరే చెప్పింది. ప్రస్తుతం ఈ యువతి ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతోంది.

ఇంక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మొదలైనప్పటి నుంచి వర్షం రావడం, తిరిగి మ్యాచ్ ప్రారంభం కావడం జరుగుతూనే వచ్చింది. టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ మొత్తం కుప్పకూలగా హార్దిక్ పాండ్యా(87), ఇషాన్ కిషన్(82) మ్యాచ్ ని గాడిలో పెట్టారు. లేదంటే ఇండియా చాలా తక్కువ స్కోర్ కే ఔట్ కావాల్సి వచ్చేది. రోహిత్ శర్మ(11), విరాట్ కోహ్లీ(4) తీవ్ర నిరాశ పరిచారు. పాక్ బౌలింగ్ చూస్తే.. షాహీన్ అఫ్రీది 4 వికెట్లతో విజృంభించాడు. నసీమ్ షా, రౌఫ్ చెరో 3 వికెట్లతో ఆకట్టుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి