iDreamPost

న‌వ్వుతూ గొంతు కోసే నాగ‌భూష‌ణం – Nostalgia

న‌వ్వుతూ గొంతు కోసే నాగ‌భూష‌ణం – Nostalgia

పాపం, పుణ్యం ప్ర‌పంచ మార్గం తెలియ‌ని రోజుల నుంచి సినిమాలు చూసే అల‌వాటు. దుర్మార్గుల్ని గుర్తు ప‌ట్ట‌డం సినిమాలే నేర్పించాయి. నాకు రాజ‌నాల‌, స‌త్య‌నారాయ‌ణ లాంటి విల‌న్ల‌తో స‌మ‌స్య లేదు. ఎందుకంటే చూడ‌గానే దొంగ‌నాకొడుకుల‌ని అర్థ‌మైపోతుంది. హీరో NTR తో క‌ర్ర‌తోనో, క‌త్తితోనో ఫైటింగ్ చేస్తారు. చివ‌రికి ఓడిపోతారు.

నాగ‌భూష‌ణాన్ని చూస్తేనే నాకు భ‌యం. పైకి మంచివాడిలా , భ‌క్తుడిలా నుదుట బొట్టు, చెవిలో పువ్వు వుంటాయి. క‌డుపులో క‌త్తులుంటాయి. ఏదీ బ‌య‌ట‌ప‌డ‌దు. కుట్ర చేసి మోసం చేస్తాడు. న‌వ్వుతూనే న‌మ్మ‌క ద్రోహం చేస్తాడు. త‌మాషా ఏమంటే జీవితంలో రాజ‌నాల కంటే నాగ‌భూష‌ణ‌మే మ‌న‌కు ఎక్కువ ఎదుర‌వుతాడు.

చిన్న‌ప్పుడు కోపం, అస‌హ్యం ఉండేవి కానీ, మెల్లిగా అర్థ‌మైంది ఆయ‌న ఎంత గొప్ప న‌టుడో. డైలాగ్ చెప్ప‌డంలో ఆయ‌న‌కో ప్ర‌త్యేక‌త ఉంది. త‌మిళంలో MR.రాధా (న‌టి రాధిక తండ్రి)ని ఇమిటేట్ చేస్తూ డైలాగ్ చెప్పిన‌ట్టు అనిపిస్తుంది కానీ , కాదు. తానే ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్నాడు.

ర‌క్త‌క‌న్నీరు నాట‌కాన్ని చాలా సార్లు చ‌దివాను. నాగ‌భూష‌ణం కొన్ని వేల‌సార్లు ప్ర‌ద‌ర్శించాడు. ఒక‌సారి అనంత‌పురం కూడా వ‌చ్చాడు. ల‌లితక‌ళాప‌రిష‌త్‌లో వేశారు. మ‌న ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవు. చూడాలంటే ఒక‌టే దారి. లైబ్ర‌రీపైన ఎక్కి కూచుంటే క‌నిపిస్తుంది. న‌టుల ముఖాలు క‌నిపించ‌వు, కానీ మైక్ వినిపిస్తుంది (అప్ప‌ట్లో ల‌లిత క‌ళాప‌రిష‌త్ open air theater). నేను , నా ఫ్రెండ్ ప్ర‌సాద్ సాయంత్రం 6 గంట‌ల‌కే లైబ్ర‌రీ ఎక్కి సీటు రిజ‌ర్వ్ చేసుకున్నాం. అప్ప‌టికే మాలాంటి ఉచిత జీవులు అక్క‌డున్నారు. 7.30 గంట‌ల‌కి నాట‌కం మొద‌లైంది. ఒక రాతి చ‌ప్టా మీద దాదాపు 3 గంట‌లు ఎలా కూచున్నామో మాకే తెలియ‌దు. బ‌హుశా నాట‌కం మీద , నాగ‌భూష‌ణం మీద ప్రేమ కావ‌చ్చు.

అప్ప‌టిక‌ప్పుడు స్పాంటేనియ‌స్‌గా స్టేజీ మీద సెటైర్లు వేయ‌డం ఆయ‌న అల‌వాటు. “నేనేమైనా ఫ్రీ పాసులు తీసుకుని ముందు వ‌రుస‌లో నాట‌కం చూసే బాప‌తు అనుకున్నావా” అని డైలాగ్ వేశాడు. ఫ్రీ పాసుల వాళ్లు కూడా ఏడ్వ‌లేక న‌వ్వారు. నాట‌కాన్ని ఉచితంగా చూడ‌కూడ‌ద‌ని నాగ‌భూష‌ణం అభిప్రాయం. ఎందుకంటే ర‌క్త‌క‌న్నీరు నాట‌కం మీద ఆయ‌న 30 కుటుంబాల్ని బ‌తికించేవాళ్లు.

అప్ప‌ట్లో రోడ్డు ప‌క్క‌న కంక‌ర తోలి, ఎంత కాలానికి రోడ్డు వేసేవాళ్లు కాదు. అనంత‌పురం కూడా అంతే. జ‌నాభా త‌గ్గించ‌డానికి అనంత‌పురం అధికారులు కృషి చేస్తున్నార‌ని సెటైర్ వేశాడు. కంక‌ర కుప్ప‌ల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగి ప్ర‌జ‌లు పోతార‌ని అన్నాడు.

1985లో SK యూనివ‌ర్సిటీకి అతిథిగా వ‌చ్చాడు. క‌లుద్దామ‌నుకుని క‌ల‌వ‌లేక‌పోయాను. కొంత మంది మిత్రులు వెళ్లి క‌లిశారు. NTRని తెగ తిట్టాడ‌ట‌! సినిమా ఫీల్డ్‌లో వాళ్లిద్ద‌రికి మంచి స్నేహం. కానీ NTRకి రాజ‌కీయ ప‌రిప‌క్వ‌త లేదు, దెబ్బ‌తింటాడ‌ని అన్నాడ‌ట‌. అదే నిజ‌మైంది.

ప్ర‌జా నాయ‌కుడు (1972) సినిమాలో నాగ‌భూష‌ణం డైలాగ్ ఒక‌టుంది. “పెళ్లాం లేచిపోయి ఎదురింట్లో కాపురం పెట్టినా భ‌రించొచ్చు కానీ, ప‌ద‌వి పోతే భ‌రించ‌లేం, బ‌త‌క‌లేం”

రాజ‌కీయాలు ఇంకా దిగ‌జారాయి.

(మే 5 నాగ‌భూష‌ణం వ‌ర్ధంతి)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి