iDreamPost

28 ఏళ్ళ తర్వాత వెంకటేష్ ఇలా

28 ఏళ్ళ తర్వాత వెంకటేష్ ఇలా

నిన్న రాత్రి విడుదలైన వెంకటేష్ నారప్ప ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆన్ లైన్ ని కుదిపేశాయి. అసురన్ ని ఇప్పటికే చాలా మంది అమెజాన్ ప్రైమ్ లో చూసేసిన నేపథ్యంలో వెంకీ ఈ పాత్రకు ఎంతవరకు సూట్ అవుతాడా అనే అనుమానాలు లేకపోలేదు. వాటిని పూర్తిగా పటాపంచలు చేస్తూ ఒకరకంగా చెప్పాలంటే వెంకటేష్ తనకన్నా చాలా చిన్నవాడైన ధనుష్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో తన అనుభవాన్ని ఉపయోగించి నారప్ప పాత్రలోని విభిన్న హావభావాలను అద్భుతంగా చూపించేశారు.

అయితే నారప్పలో ఇంకో ప్రత్యేకత ఉంది. సినిమా మొత్తం వెంకటేష్ పూర్తి పంచెకట్టులో కనిపిస్తాడు. గతంలో ఇలా ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ దాకా పంచెలో కనిపించింది చినరాయుడులోనే. 1992లో వచ్చిన ఆ మూవీ కూడా తమిళ్ బ్లాక్ బస్టర్ కి రీమేక్. మరీ ఆ స్థాయిలో కాకపోయినా చినరాయుడు మంచి విజయాన్నే సాధించింది. మధ్యలో సూర్యవంశంలో కూడా వెంకీ పంచెకట్టులోనే ఉంటారు కానీ డ్యూయల్ రోల్ చేసిన మరో పాత్ర రెగ్యులర్ ప్యాంట్ షర్ట్ లో కనిపిస్తుంది

ఈ లెక్కన ఇరవై ఎనిమిది ఏళ్ళ తర్వాత వెంకటేష్ ఇలా పంచెకట్టులో పూర్తి స్థాయి దర్శనమివ్వబోతున్నాడు. అయితే చినరాయుడుకి నారప్పకు ఓ ప్రధానమైన వ్యత్యాసం ఉంది. మొదటిదాంట్లో హీరో పాత్ర చాలా దర్పంతో ఊరికి తీర్పులిచ్చే ఉన్నతమైన తీరులోసాగుతుంది . కానీ నారప్ప అలా కాదు. వెనుకబడిన తరగతికి చెంది అవమానాలు ప్రతీకారంతో రగిలిపోయే పచ్చి నాటు స్టైల్ లో ఉంటుంది.

ఏదైతేనేం వెంకటేష్ ఇలాంటి పాత్ర చేసి దశాబ్దాలు దాటింది కాబట్టి నారప్పని ఫ్యాన్స్ చాలా స్పెషల్ గా ఫీలవుతున్నారు. షూటింగ్ త్వరగానే పూర్తి చేసి వేసవికి విడుదల చేసే ప్లాన్ లో ఉంది సురేష్ సంస్థ. ఇస్మార్ట్ శంకర్ తో ఫామ్ లోకి వచ్చిన మణిశర్మ ఇప్పుడు చిరంజీవి 152తో పాటు నారప్పకు సంగీతం అందించడంతో సంగీతాభిమానులు కూడా దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి