iDreamPost

వెంకటేశ్వరుడే నేలపైకి దిగివస్తే – Nostalgia

వెంకటేశ్వరుడే నేలపైకి దిగివస్తే – Nostalgia

తెలుగు సినిమాల్లో ఫాంటసీ కొత్తేమి కాదు. ముఖ్యంగా దేవుళ్లను భూమిపైకి తీసుకొచ్చి తీసిన చిత్రాలు గొప్ప విజయం సాధించడం ఎన్నో చూశాం. యముడిని సబ్జెక్టుగా తీసుకుని రూపొందించిన యమగోల,యముడికి మొగుడు, యమదొంగ లాంటివి కాసుల వర్షం కురిపించాయి. ఇంద్రుడి కూతురు మనుషుల మధ్యకు వస్తే ఏమవుతుందో రాఘవేంద్రరావు ఓ దృశ్యకావ్యం రూపంలో జగదేకవీరుడు అతిలోకసుందరిగా ఆవిష్కరించారు. శివుడు సామాన్యుడితో స్నేహం చేస్తే ఎలా ఉంటుందన్న పాయింట్ తో మా ఊళ్ళో మహాశివుడు తీస్తే అది కూడా మంచి స్పందన దక్కించుకుంది. దాసరి గారికీ అలాంటి ఆలోచనే ఓ సందర్భంలో కలిగింది.

1992 సమయం. దాసరి గారు బడ్జెట్ సినిమాలతో మంచి విజయాలు నమోదు చేస్తున్నారు. అమ్మ రాజీనామా, సూరిగాడు లాంటి సెంటిమెంట్ డ్రామాలు నిర్మాతలకు కాసులు, పనిచేసిన వారికి అవార్డులు తీసుకొచ్చాయి. ఎటొచ్చి స్టార్లతో చేసిన అహంకారి టైపు చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ దగ్గర వర్కవుట్ కాలేదు. అందుకే ఈసారి విన్నూతమైన కథతో మరో చిన్న మూవీ తీయాలని ప్లాన్ చేసుకున్నారు దాసరి. తనతో పాటు గొల్లపూడి, జంధ్యాల, ఈ చిత్రం మాటల రచయిత ఎంవిఎస్ హరనాథరావు గారితో కలిసి ఎంకన్నబాబు స్క్రిప్ట్ కో రూపం ఇచ్చారు. టైటిల్ రోల్ దాసరి గారే పోషించాలని ముందే నిర్ణయం జరిగిపోయింది.

కోర్టులో దాఫెదార్ గా పని చేసే ఎంకన్నకు అక్కడ జరిగే అన్యాయాలతో పాటు బయట జరుగుతున్న నేరాల పట్ల దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడన్న కోపం ఉంటుంది. ఈ క్రమంలో సాక్షాత్తు ఏడుకొండల వాడే దిగి వచ్చి ఎంకన్నకు ఓ అనూహ్య వరం ఇస్తాడు. అదే కథలో కీలకమైన పాయింట్. సుప్రసిద్ధ రచయిత రాజశ్రీ ఈ సినిమాతోనే సంగీత దర్శకుడిగా కొత్త ప్రస్థానం మొదలుపెట్టారు. వేంకటేశ్వరుడి పాత్రలో సీనియర్ నటులు రామకృష్ణ నటించగా జమున, సాయికుమార్, బ్రహ్మానందం, అల్లు, కోట తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1992 సెప్టెంబర్ 18న రిలీజైన ఎంకన్నబాబు బ్లాక్ బస్టర్ కాలేదు కానీ ఓ వర్గం ప్రేక్షకుల మెప్పు పొందింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి