iDreamPost

పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్  ఫస్ట్ లుక్

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ ఖరారు అయింది. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా అధికారికంగా కొన్ని రోజులముందు విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను నటించిన హిందీ చిత్రం పింక్ రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా కాలంగా అందరికి తెలిసిన విషయమే. వకీల్ సాబ్ అన్న టైటిల్ కూడా అందరికీ తెలిసిందే.

మహిళల హక్కులు ప్రధానంగా రూపొందించిన సినిమా పింక్. No means no అన్న పాయింటుని హైలైట్ చేస్తూ సినిమాని నడిపించాడు అనిరుద్ధ రాయ్ చౌధురి. అమ్మాయి గతం ఎలాంటిది అయినా, బాయ్ ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా, మద్యం తీసుకోవడం, పబ్బులకి పోవడం లాంటి అలవాట్లు ఉన్నా ఏ అమ్మాయి ఇష్టానికీ వ్యతిరేకంగా ఏం చేయడానికి ఎవరికీ హక్కు లేదన్న విషయం నొక్కి చెప్పారు హిందీ సినిమా పింక్ లో.

ముగ్గురు అమ్మాయిలు అనుకోకుండా ధనం, పలుకుబడి, అధికారం ఉన్న కొందరు అబ్బాయిలతో పోరాటం చేయాల్సివచ్చినప్పుడు చాలాకాలం క్రితం తన నల్లకోటు పక్కన పడేసిన వృద్ధుడైన లాయర్ అమితాబ్ బచ్చన్ తిరిగి నల్లకోటు ధరించి కోర్టులో ఆ అమ్మాయి లకు అండగా నిలబడడమే పింక్ సినిమా ఇతివృత్తం. ఇందులో అధిక భాగం సినిమా కోర్టు రూములో సాగుతుంది. ఈ సినిమాలో నాయకుడి హీరోయిజమంతా ప్రత్యర్ధి లాయర్ వాదనను తన వాదనతో ఎదుర్కోవడం లోనే ఉంటుంది.

రొటీన్ మాస్ సినిమాలు చేయడం ఏనాడో మానివేసిన అమితాబ్ లాంటి వయసు మళ్లిన హీరోకి ఈ కథ సరిపోతుంది కానీ, రెగ్యులర్ మాస్ హీరోకి తన అభిమానులు ఆశించే మాస్ ఎలివేషన్లు ఇందులో లేవు. అందుకే ఈ సినిమాని తమిళ భాషలో అజిత్ హీరోగా నేర్కొండ పార్వాయి పేరుతో రీమేక్ చేసినప్పుడు తను సహాయం చేసే ముగ్గురు అమ్మాయిలలో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన ముఠాతో ఫైటింగ్ చేసి, పోలీసులకు అప్పగించిన సన్నివేశం ఒకటి కల్పించారు.హీరో లాయర్ కోటు పక్కన పడేయడానికి కూడా ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించారు.

అందుకే వకీల్ సాబ్ కథని పింక్ కాకుండా అజిత్ సినిమా నేర్కొండ పార్వాయి ఆధారంగా రూపొందించారు. అయితే తెలుగులో పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ బేస్ సామాన్యమైనది కాదు. అతని ఫ్లాప్ సినిమాలు కూడా అరవై, డెబ్భై కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుంటాయి. దీన్ని మనసులో పెట్టుకుని పవన్ కళ్యాణ్ హీరోగా ఎలివేట్ చేసేలా పాటలు, ఫైట్లు లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించారా లేక మెయిన్ పాయింట్ నుంచి పక్కకు పోకుండా కోర్టు రూమ్ డ్రామాగా రూపొందించారా అన్నది సినిమా విడుదల అయితే కానీ తెలియదు.

అయితే ఫస్ట్ లుక్ లో సినిమా మొత్తానికి సెంట్రల్ పాయింట్ అయిన అమ్మాయిలు లేకపోవడం ఈ చిత్రం పవన్ కళ్యాణ్ షో లాగా ఉంటుందేమో అన్న అభిప్రాయం కూడా కలిగిస్తోంది.

ఏది ఏమైనా అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులని కూడా ఆకట్టుకోగలిగితే సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం. అలాగే మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, వాళ్ల మౌళిక హక్కుల గురించి చర్చ కూడా మొదలైతే మరీ మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి