iDreamPost

టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఛైర్మన్ భూమన!

  • Author singhj Published - 08:16 AM, Wed - 16 August 23
  • Author singhj Published - 08:16 AM, Wed - 16 August 23
టీటీడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఛైర్మన్ భూమన!

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులకు బోర్డు ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు ఇప్పించే బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగుల ఇంటి స్థలాల కోసం వడమాలపేట దగ్గర మంజూరు చేసినటువంటి 310 ఎకరాల భూమిని ఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈవో సదా భార్గవి, ఉద్యోగ సంఘాల నాయకులతో కలసి ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో భూమన మాట్లాడారు. సెప్టెంబర్ 18వ తేదీన సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పంపిణీని ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

టీటీడీ ఉద్యోగుల కోసం అవసరమైతే మరో 100 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి సేకరించి ఇళ్ల స్థలాలు ఇప్పించేలా చర్యలు తీసుకుంటామని భూమన కరుణాకర్​ రెడ్డి తెలిపారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా టీటీడీ ఉద్యోగులు సంతోషంలో మునిగిపోయారు. ఇక, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తన కృషితో ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇచ్చే ప్రక్రియ మొదలుపెట్టామని భూమన గుర్తుచేశారు. అనంతరం జరిగిన పరిణామాల వల్ల పదేళ్ల పాటు ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. జగన్ సీఎంగా ఉండటం వల్లే మళ్లీ టీటీడీ ఉద్యోగులందరికీ ఇంటి స్థలాలు వస్తున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని భూమన పేర్కొన్నారు.

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పంపిణీ గురించి ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 7 వేల మంది ఎంప్లాయీస్​కు ఇంటి స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని వల్ల ఒక పెద్ద టౌన్​షిప్ తయారవుతుందన్నారు. ఈ స్థలం చెన్నై హైవే పక్కనే ఉండటం వల్ల మంచి ధర పలుకుతోందని చెప్పారు. ఛైర్మన్ భూమన ఆదేశాల మేరకు సెప్టెంబర్ 18వ తేదీ లోపు ఈ స్థలాన్ని ప్లాట్లుగా విభజిస్తామన్నారు. ఇక్కడ కచ్చా రోడ్లు వేసి తుడా అనుమతి తీసుకొనే ప్రయత్నం చేస్తామని ధర్మారెడ్డి పేర్కొన్నారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా విధుల్లో ఉత్తమ సేవలు అందించిన 30 మంది అధికారులు, 219 మంది ఉద్యోగులు, ఎస్వీబీసీలో ఏడుగురు ఉద్యోగులకు శ్రీ‌వారి వెండి డాలర్​తో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు భూమన.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి