iDreamPost

వెంకన్న బడ్జెట్.. రూ.3,309 కోట్లు…

వెంకన్న బడ్జెట్.. రూ.3,309 కోట్లు…

తిరుమల తిరుపతి దేవస్థానం 2019-20 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌కు పాలకమండలి ఆమోదం తెలిపింది. ఈ బడ్జెట్ అంచనా మొత్తం రూ.3,309 కోట్లు కేటాయించారు. గత ఏడాదికంటే రూ. 60కోట్లు అంచనాలు పెరిగాయి. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి బడ్జెట్ ను వెల్లడించారు.

హుండీద్వారా రూ.1,351 కోట్లు, పెట్టుబడులపై వచ్చే వడ్డీ ద్వారా రూ.706 కోట్లు, లడ్డూ విక్రయాల ద్వారా 400 కోట్లు వస్తుందని అంచనా వేసారు. అలాగే రూ.18కోట్లతో అన్ని భవనాల ఆధునీకరణకు పాలకమండలి ఆమోదం తెలిపింది. 2020-21 సంవత్సరానికి గానూ శార్వారి నామ సంవత్సర పంచాంగం విడుదల చేసారు. అదేవిధంగా వార్షిక బడ్జెట్‌ మొత్తంలో భక్తుల సౌకర్యాలు, దేవాలయాల నిర్మాణానికి రూ.100 కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.210 కోట్లు, హిందూ ధర్మ పరిరక్షణ కార్యక్రమాలకు రూ.179 కోట్లు, విద్యకు రూ.127.5 కోట్లు, వైద్యం, ఆరోగ్యం, పరిశుభ్రతకు రూ.139 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఇందులో రహదారుల నిర్మాణానికి రూ.210 కోట్లు కేటాయింపులు చేసారు. స్విమ్స్‌ హస్పిటల్స్‌కి రూ.100కోట్లు, గరుడ వారధి నిర్మాణానికి రూ.100కోట్లు కేటాయించారు.

వడ్డీ ద్వారా వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోవడంతో ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్లు చేయాలని నిర్ణయించారు. సేవా టికెట్లు, వసతి గదుల ధరలను రెండేళ్లకోసారి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్‌లో ఫైనాన్షియల్‌ సబ్‌కమిటీ చేసిన సూచనలు పాలకవర్గం ముందుకువచ్చాయి. టీటీడీలో ఆర్థిక క్రమశిక్షణ అవసరమని, నిరుపయోగంగా ఉన్న టీటీడీ ఆస్తుల అమ్మకాల ద్వారా రూ.100కోట్ల నిధులు సమీకరించాలని సూచించింది. అలాగే నిధుల కేటాయింపులు, లడ్డూల విక్రయం వంటి కీలక అంశాలపై చర్చించారు. అదే విధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల జీతాలు, ఆదాయ పెంపు మార్గాలపై ఈ సమావేశంలో చర్చించారు. మొత్తం 165 అంశాలపై పాలకమండలిలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి