iDreamPost

గ్రూప్ 1 పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులు.. పోటీ మామూలుగా లేదుగా !

గ్రూప్ 1 పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులు.. పోటీ మామూలుగా లేదుగా !

తెలంగాణలో గ్రూప్ 1 (TSPSC) పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియకు గడువు పూర్తైంది. మే 2వ తేదీ నుంచి గ్రూప్ 1 పోస్టులకు అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. తొలిరోజుల్లో దరఖాస్తులు కాస్త తక్కువగానే వచ్చినా.. గడువు ముగింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ దరఖాస్తుల సంఖ్య పెరిగింది. మే 2 నుంచి మే 16 వరకు రోజుకు సగటున 8వేల చొప్పున 1,26,044 అప్లికేషన్లు వచ్చాయి. మే 17 నుంచి 29 వరకు సగటున 10,769 చొప్పున 1,40,539 దరఖాస్తులు రాగా.. మే 30, 31తేదీల్లో సగటున 42,500 చొప్పున 85వేల దరఖాస్తులు వచ్చాయి. ముగింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ.. దరఖాస్తులు పెరగడంతో గ్రూప్ 1 దరఖాస్తుల గడువును జూన్ 4 వరకూ పొడిగించారు. దాంతో జూన్ 1 నుంచి 4వ తేదీ వరకూ మొత్తం 28,559 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు టీఎస్పీఎస్ సీ వెల్లడించింది.

గ్రూప్ 1 లో మొత్తం 503 పోస్టులకు నోటిఫికేషన్ రాగా.. 3,80,202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అంటే ఒక్కోపోస్టుకు సుమారుగా 756 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీనిని బట్టి చూస్తే.. ఉద్యోగాల కోసం పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 503 పోస్టుల్లో 225 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేయగా.. వాటికి 1,51,192 మంది అప్లై చేశారు. ఒక్కో పోస్టుకు సుమారు 672 మంది మహిళా అభ్యర్థులు పోటీపడుతున్నారు. అలాగే దివ్యాంగుల కేటగిరీలో 24 పోస్టులుండగా.. 6,105 మంది అప్లై చేసుకున్నారు. గ్రూపు 1 ఉద్యోగాల కోసం పోటీపడే అభ్యర్థుల్లో పురుషులు 2,28,951 ఉంటే.. మహిళా అభ్యర్థులు 1,51,192 మంది, ట్రాన్స్ జెండర్లు 59మంది ఉన్నారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి