iDreamPost

గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో విచారణ.. ఆ రోజే కీలక ప్రకటన!

  • Author singhj Published - 06:59 PM, Fri - 11 August 23
  • Author singhj Published - 06:59 PM, Fri - 11 August 23
గ్రూప్-2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో విచారణ.. ఆ రోజే కీలక ప్రకటన!

తెలంగాణ గ్రూప్​-2 ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఆగస్టు 29, 30వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను పోస్ట్​పోన్ చేయాలంటూ టీఎస్​పీఎస్​సీ కార్యాలయం ముందు గురువారం వేలాది మంది అభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓయూ జేఏసీ నేతలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఆందోళన చేస్తున్న జేఏసీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు నచ్చజెప్పినా జేఏసీ నేతలు, అభ్యర్థులు వెనక్కి తగ్గలేదు. గ్రూప్-2 పరీక్ష వాయిదాపై స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు అదనపు బలగాలను రప్పించాల్సి వచ్చింది.

ఇదిలా ఉంటే.. గ్రూప్​-2 పరీక్ష వాయిదాను కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్​పై కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. మిగిలిన ఎగ్జామ్స్ నేపథ్యంలో గ్రూప్-2 వాయిదా వేయాలని అభ్యర్థులు ఉన్నత న్యాయస్థానాన్ని కోరగా.. ఇప్పటికే పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్​పీఎస్​సీ కౌన్సిల్ తమ వాదనలు వినిపించింది. అయితే, గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహణపై ఆగస్టు 14వ తేదీ (సోమవారం) నాడు స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్​పీఎస్​సీ కౌన్సిల్ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో ఆ తేదీనే కచ్చితంగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ సోమవారానికి విచారణను కోర్టు వాయిదా వేసింది.

ఇకపోతే, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఈ ఎగ్జామ్​ను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పాలిటెక్నిక్ జూనియర్ లెక్చరర్లతో పాటు గురుకుల టీచర్ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2ను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఆగస్టు 2 నుంచి 30వ తేదీ వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని.. గ్రూప్-2 రాసేవాళ్లు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇన్ని ఎగ్జామ్స్​కు ఒకే నెలలో సన్నద్ధమై రాయడం సాధ్యం కాదంటున్నారు. మొత్తం అభ్యర్థుల్లో 90 శాతం మంది గ్రూప్​-2 పరీక్ష నిర్వహణను వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి