iDreamPost

Revanth Reddy: రేవంత్ ముందున్న పది సవాళ్లు ఇవే.. వీటిని దాటితే సక్సెస్

  • Published Dec 06, 2023 | 2:39 PMUpdated Dec 06, 2023 | 2:39 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేవంత్ ఎదుర్కోబోయే సవాళ్లు ఇవే అంటున్నారు రాజకీయ పండితులు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రేవంత్ ఎదుర్కోబోయే సవాళ్లు ఇవే అంటున్నారు రాజకీయ పండితులు. ఆ వివరాలు..

  • Published Dec 06, 2023 | 2:39 PMUpdated Dec 06, 2023 | 2:39 PM
Revanth Reddy: రేవంత్ ముందున్న పది సవాళ్లు ఇవే.. వీటిని దాటితే సక్సెస్

హోరాహోరిగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరంలో..  కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. అధికారం కైవసం చేసుకుంది. ఇక సీఎం పదవి కేటాయింపుపై భారీ ఎత్తున ఉత్కంఠ కొనసాగింది. 48 గంటల తర్వాత.. రేవంత్ రెడ్డి.. తెలంగాణకు కాబోయే రెండో ముఖ్యమంత్రిగా ఢిల్లీ పెద్దలు ప్రకటించారు. డిసెంబర్ 7, గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇప్పటికే సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. రేవంత్ సంతకం చేయబోయే తొలి ఫైల్ ఏది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే కొత్త సీఎం రేవంత్ కు పాలన అంతా సింపుల్ గా సాగదని.. ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయిని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వారు లేవనెత్తిన కొన్ని అంశాలు ఇక్కడ మీకోసం..

1.ఆరు గ్యారెంటీల అమలు.. ఆర్థిక భారం..

కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆరు గ్యారెంటీలు గురించి జోరుగా ప్రచారం చేసింది. దీనిలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి నెల 2500 రూపాయల ఆర్థిక సాయం, 500 లకే గ్యాస్ సిలిండర్, రైతు బంధు సాయం పెంపు వంటి సంక్షేమ పథకాలను ప్రకటించారు. అయితే ప్రకటించిన అంత ఈజీ కాదు.. వీటిని అమలు చేయడం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం కోసం ప్రభుత్వంపై ఎకంగా 2 వేల కోట్ల రూపాయలకు పైగా భారం పడనుందని అంచాన వేశారు.

ఇక ఇతర పథకాల అమలు మరింత భారం కానుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. సంక్షేమం, సంపద సృష్టి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ.. ముందుకు సాగడం రేవంత్ కి కత్తి మీద సాము వంటిదే అంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటిలో దేన్ని నిర్లక్ష్యం చేసినా.. బీఆర్ఎస్ కు ఎలాంటి ఫలితాలు వచ్చాయో.. కాంగ్రెస్ కు కూడా అదే పరిస్థితి వస్తుంది అంటున్నారు. వీటి అమలు వల్ల పడే అదనపు భారాన్ని ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి అంటున్నారు.

2.నిరుద్యోగుల అంచనాలు అందుకోగలరా..

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో యువత, నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారనేది వాస్తవం. గత ప్రభుత్వం హయాంలో రిక్రూట్ మెంట్ ప్రక్రియలో చోటు చేసుకున్న అవకతవకలు, గ్రూప్ 1 వంటి ప్రతిష్టాత్మక పరీక్ష రెండు సార్లు క్యాన్సిల్ కావడం, పేపర్ లీకేజ్ వంటి అంశాలు నిరుద్యోగుల్లో ఆగ్రహాన్ని రగిలించాయి. అందుకు ఫలితమే ఈ రిజల్ట్.

ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని.. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇప్పుడు వాటిని అమలు చేయకపోతే.. నిరుద్యోగులు తిరగబడే అవకాశం ఉంది. కనుక ఈ హామీని నిలబట్టెకోవడం రేవంత్ ముందున్న అతిపెద్ద సవాల్. ఒక వేళ దీన్ని గనక నెరవేరిస్తే.. మరో సారి కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు.

3.గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూసుకున్నట్లయితే.. పట్టణ ప్రాంత ప్రజలు.. బీఆర్ఎస్ కు పట్టం కట్టగా.. గ్రామీణ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు. అందుకు ముఖ్య కారణం.. అభివృద్ధి అంతా పట్టణాలకే పరిమితం అయితే.. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని పట్టించుకోలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం. డెవలప్మెంట్ మొత్తాన్ని హైదరాబాద్ చుట్టూ కేంద్రీకరించి.. గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. అందుకే గ్రామీణ ప్రాంత ఓటర్లు.. బీఆర్ఎస్ ను తిరస్కరించారు. మరి ఇప్పుడు గ్రామీణాభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు.

4.పార్టీని సమైక్యంగా ఉంచడం..

కాంగ్రెస్ గెలిచిన తర్వాత.. తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ కింద పని చేయాలా అని ఆలోచిస్తున్నారట. అంతేకాక కేబినెట్ కూర్పులో కూడా అనేక తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికే పార్టీలో పలువురు అసంతృప్త నేతలు ఉన్నారు. వారందరని కలుపుకుని పోయి.. ఐక్యంగా ముందుకు సాగడం.. పార్టీని సమైక్యంగా ఉంచడం రేవంత్ ముందున్న ముఖ్యమైన సవాలు అంటున్నారు.

5.ధీటైన ప్రతిపక్షం..

ఈసారి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాత్రమే కాక.. కాంగ్రెస్ పార్టీ ధీటైన ప్రతిపక్షాన్ని ఎదుర్కొవాలి. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్, బీజేపీ మాత్రమే ప్రతిపక్షంగా వ్యవహరించాయి. ఎంఐఎం బీఆర్ఎస్ కు మద్దతిచ్చింది. పైగా అప్పుడు కాంగ్రెస్, బీజేపీలు అంత బలంగా లేవు. కానీ ఈసారి అలా కాదు. బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు మూడు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఈ పార్టీలో కాకలు తీరిన నేతలు ఉన్నారు. కనుక అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదంటున్నారు రాజకీయ పండితులు. మరి రేవంత్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి అంటున్నారు.

6.లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిపించడం..

రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించడం వెనక కాంగ్రెస్ పార్టీ అసలు ఉద్దేశం.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మ్యాగ్జిమం సీట్లను గెలవడం. ఇందుకోసం మిత్ర పక్షాలను కలుపుకుని పోవాలి. దానికి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారనేది కీలకం కానుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించకపోతే.. ఆయన వ్యతిరేక వర్గం దీన్ని ఒక సాకుగా చూపి.. అసమ్మతి వెలిబుచ్చే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు.

7.ఆంధ్రా-తెలంగాణ మధ్య సంబంధాలు..

ఆంధ్రాతో రేవంత్ రెడ్డి ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు.. విబేధాలు, వివాదాల విషయంలో ఎలా స్పందిస్తారు అనేది కూడా కీలకం కానుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కనుక మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ తో కాంగ్రెస్ ను దెబ్బకొట్టే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ పండితులు. పైగా రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సన్నిహితుడు అనే భావం చాలా మందిలో ఉంది. అలానే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ.. కనుక దాని ప్రయోజనాలు దేశవ్యాప్తంగా ఉంటాయి. ఈనేపథ్యంలో కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినా.. తెలంగాణ ప్రయోజనాల కోసం నిలబడ్డ ముఖ్యమంత్రిగా రేవంత్ పాత్ర ఉండాలని.. లేదంటే.. ఆయనను దెబ్బ తీసే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పండితులు.

8.కాంగ్రెస్ వస్తే.. కష్టాలు తప్పవంటూ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే.. కరెంట్ కోతలు తప్పవు, ఆరు నెలలకు ఒకసారి సీఎంలు మారతారు.. మొత్తం ఢిల్లీ పెత్తనమే కొనసాగుతుంది.. అంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది. ఈ విమర్శలు నిజం కాకుండా చూసుకోవడం అంత తేలిక కాదంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.

9.సంపద సృష్టించడం

సంక్షేమం ఎంత ముఖ్యమో.. ఆ పథకాల అమలుకు సంపద సృష్టి కూడా అంతే ముఖ్యం. అందుకు రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోబుతన్నారనే దాని గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. అది కూడా లోటు బడ్జెట్ తో ఏర్పడింది. అయినా సరే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వచ్చింది. ఆ భారం ఖజానాపై పడకుండా.. రాష్ట్రానికి విరివిగా పెట్టుబడులు తీసుకురావడంలో సఫలం అయ్యింది.

అయితే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గతంలో ఉన్న సంక్షేమ పథకాలతో పాటు.. కొత్త వాటిని అమలు చేయనుంది. దీని వల్ల ఖజానాపై మరింత భారం పడనుంది. మరి ఈ పరస్థితుల్లో.. రేవంత్ రెడ్డి సంపద సృష్టి కోసం ఏం చేయనున్నారు.. పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.

10.అవినీతి ముద్ర పడకుండా చూసుకోవడం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని.. మరీ ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో.. బీఆర్ఎస్ పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడిందని.. కారు పార్టీ నేతలు పెద్ద ఎత్తున భూకబ్జాలకు పాల్పడ్డారని.. సహజ వనరులను కొల్లగొట్టారని.. ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఊదర గొట్టింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక అవినీతి ముద్ర పడకుండా చూసుకోవడం ఆ పార్టీ మీదున్న అతిపెద్ద బాధ్యత. ఈ అంశంలో రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తాడో చూడాలి అంటున్నారు రాజకీయ పండితులు. ఈ సవాళ్లను దాటగలిగితే.. రేవంత్ ముఖ్యమంత్రిగా సక్సెస్ అవ్వడమే కాక.. జనాలు మరో అవకాశ కూడా ఇస్తారని అంటున్నారు. మరి రేవంత్ పాలన ఎలా సాగనుందో.. భవిష్యత్తులో తేలనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి